నేను - రాణి - 6
వాళ్ళయింట్లో ఒక మనిషిగా బాగా కలిసిపోవడం వల్ల అప్పుడప్పుడూ ఆదివారాలు నన్ను వాళ్ళింట్లోనే భోజనం చేసేయమంటారు. ఎంత తప్పించుకుందామన్నా వీలు కుదరదు వాళ్ళింట్లో భోజనం చేయడం అంటే నాకు నరకం. అంటే వెంకుమాంబ వంట బావుండదని కాదు. ఆవిడ వంటకేం, దివ్యంగా ఉంటుంది. ఎటొచ్చి అక్కడ రాణి చేసే హడావిడే నాకు సహించదు.
భోజనం చేస్తుంటే చెంగున ఎగిరొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. దాన్నిబ్రతిమాలో బామాలో కిందికి దించితే ఎదురుగా కూర్చుని నాలుక ఓ అరగజం మేరకు బయటకిపెట్టి చొంగ కారుస్తుంటుంది. నాకు ఆ చొంగ చూస్తుంటే వికారం పుడ్తుంది. గొంతులోకి వెళ్లిన ముద్ద మళ్ళీ నోట్లోకి వచ్చేస్తుంది. ఒక్కొక్కప్పుడు మూతి ముందుకు పెట్టి నా కంచం వాసన చూస్తుంది. దాని చొంగ కంచంలో ఎక్కడ కరిపోతుందోనని భయం.
“చొంగ కరుస్తుందండీ... హిహిహి...” అంటాను సంతోషాన్ని నటుస్తూ.
“నీ పళ్ళెంలో ఏమీ కార్చడం లేదుకదా? అయినా తప్పేమిటి? రేప్పొద్దున్న నీ పెళ్ళాం ఎంగిలి తినవూ?” అంటుంది వెంకుమాంబ రాణి నోటికి మాంసం ముక్కని అందించి అది కొరగ్గా మిగిలిన ముక్కని నోట్లో వేసుకుంటూ.
“కిస కిస కిస...' అంటూ నవ్వుతాడు శంభులింగం. అతను నవ్వితే వంద ఎలుకలు ఒక్కసారిగా అరిచినట్లు ఉంటుంది. గుండెల్లో చాలా గాబరా పుట్టేస్తుంది ఆ సమయంలో. ఎదుటి మనిషి ముఖంలో ఇబ్బంది తాలూకు భావప్రకటన గ్రహించే సాటి హృదయం కుక్కలను పెంచేవారికి ఉండదా...? అనుకుంటూ నేను ఆ ఎంగిలి చేత్తోనే జుట్టు పీకేసుకుంటాడు.
“అతనికి జుట్టు పీక్కునే టైం అయినట్టుందే! త్వరగా పెరుగు వడ్డించు" అంటాడు శంభులింగం ఆవిడతో. శంభులింగం ఆపీసునుండి రాగానే ఆ యింట్లో జరిగే సీనుమాత్రం కళ్లున్నదే అందుకు అనిపిస్తుంది అప్పుడు. శంభులింగం ఆఫీసునుండి రాగానే "రాణీ!" అంటూ ఓ గావుకేక పెడతాడు. రాణి రయ్యమని తుపాకిగుండులా దూసుకుని వచ్చి అతనిమీద పడి అతన్ని క్రింద పడేసి, ముఖాన్ని ఓ అయిదు నిమిషాల పాటు ఎడాపెడా నాకేస్తుంది. మధ్య మధ్య బుగ్గలూ, చేతివేళ్ళూ, వీలుంటే మెడా "గుర్.... గుర్... మంటూ కొరుకుతుంది సరసాలాడుతూ.
“దీనికి ఆయనంటే మహా ప్రేమ నాయనా, ఆయన ఇంటికి రాగానే అలా ముద్దు పెట్టుకొందే (నాకనిదే) వదలదు" అంటుంది వెంకుమాంబ. రాణి ముద్దులతో అలసిపోయిన శంభులింగం నేలమీద నుండి నెమ్మదిగా లేచి బాత్రూముకి వెళ్తాడు. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా రాణి గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడరు.
“ఇది క్రాస్ బీడ్ నాయనా. పామరిస్ కి మరో మరియమ్మకీ పుట్టింది. దీని తల్లి ఫలానా యింట్లో పెరుగుతుంది. తండ్రి ఫలానా యింట్లో మొరుగుతున్నాడు" అంటూ సోది చెప్తుంది ఆవిడ. అతనేమో కుక్కలూ వాటిరకాలూ, ఏ కుక్క "కుయ్ కుయ్" అంటుందో, ఏ కుక్క "భౌ భౌ" అంటుంటే తదితర విషయాలన్నీ చెప్పి నన్ను చావగోట్టేస్తాడు. అంతకంటే కొరత వేయించుకుంటే సుఖంగా హాయిగా ఉంటుంది నా దృష్టిలో. నేను పొరబాట్న ఎంతో గొప్పవాడిని అయిపోయిన, ఏ పత్రికవాళ్లో ఇంటర్వ్యూ కని వచ్చి
"మీ జీవితంలో మరుపురాని రోజేది?” అని అడిగితే
"అక్టోబరు నాలుగోతేదీ మంగళవారం, సంవత్సరం పందొమ్మిది వందల ఎనభై మూడని" ఠకీమని సమాధానం చెప్తాను. అలా ఎందుకంటారా?