Read more!

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్!!

 

 

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్!!

 

దుర్గ నవరాత్రులలో ఒక్కో శక్తి ప్రత్యేకత ఒకటి. అలాంటిదే సరస్వతీ దేవత కూడా. సకల జనులకు విద్యాదానాన్ని చేసే సర్వ ప్రదాయిని ఆ సరస్వతీ దేవి. బ్రహ్మ దేవుడి భార్య అయిన సరస్వతి సృష్టి కార్యంలో బ్రహ్మకు సహకరించిందని పురాణ కథనాలు.

విద్య అనేది మనిషిలో ఆలోచనా శక్తిని, విచక్షణను పెంపొందించే గొప్ప మార్గం. అలాంటి విద్యకు మూలం సరస్వతి దేవి. అమ్మ కరుణ ఉంటే ఆద్యంతం చదువుల పల్లకిలో ఊరేగవచ్చని పెద్దలు చెబుతూ ఉంటారు. సాదారణంగా తెల్లని తామరలో ఆశీనురాలై రెండు చేతుల్లో వీణ, మరొక చేతిలో జపమాల, ఇంకొక చేతిలో పుస్తకం పట్టుకుని తెల్లని చీర కట్టుకుని ప్రశాంత వధనంతో దర్శనం ఇస్తుంది ఈ తల్లి. అమ్మ చేతిలో ఉన్న వీణను కచ్ఛపి అంటారు. 

వాక్శుద్ధి, విద్య, వివేకం, కళలు, విజ్ఞానం అన్నిటికి మించి మంచి బుద్దిని ప్రసాదించే చల్లని తల్లి  సరస్వతి దేవి. కాళిదాసు మహకవి కాళికాదేవిని ఆరాధించగా ఆ అతల్లి సరస్వతి రూపంలో కాళిదాసు అంతరంగంలో తిష్ఠ వేసి మహకవిని చేసింది. 

హంసను వాహనంగా చేసుకుని తులతూగే చదువులతల్లికి ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి పూజ చేస్తారు. తెల్లని వస్త్రాలతో అలంకరించి, తెల్లని పువ్వులతో పూజిస్తారు. పూజలో పుస్తకాలను అమ్మ దగ్గర ఉంచి తమకు జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. సరస్వతీదేవికి గారెలు, పాయసం, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు సరస్వతీ దేవాలయాలు ఎంతో సందడిగా ఉంటాయి. 

ఎన్నో చోట్ల నెలకొన్న సరస్వతీ దేవాలయాల్లో పిల్లలచేత విద్యాభ్యాసం చేయిస్తారు ఈరోజు. సరస్వతీ, శారదా, భారతీ, హంసవాహిని, వీణాపాణి ఇలా పేర్లు ఎన్ని ఉన్నా అమ్మ రూపం ఒకటే అమ్మ అందరికి ప్రసాదించే జ్ఞానం కూడా ఒకటే. కానీ మనుషులే వాటిని అందుకోలేకపోతున్నారు. 

అమ్మ ఎలాగైతే జ్ఞానాన్ని, బుద్దిని అందరికి ప్రసాధిస్తుందో. మనం కూడా అలాగే మననుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టినపుడే అమ్మ కృపకు పాత్రులవగలము. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న విద్యార్థులకు విద్యాదానం చేయడం ఎంతో గొప్పది. అలాగే ఈరోజున పిల్లలకు పెన్ను, పుస్తకం దానం ఇవ్వడం వల్ల అమ్మ చల్లని చూపులు మనపై ఉంటాయి. 

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం!!

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ  తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా 

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ 

ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ 

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ 

 సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!

పై శ్లోకాన్ని ప్రతిరోజు ముఖ్యంగా ఈరోజు 11 సార్లు చెప్పుకుని సరస్వతి దేవికి ఎంతో భక్తిగా పూజ చేసుకుని, ఆర్థిక సమస్యలో ఉండి చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితం, చదువుల తల్లి కరుణ మనపై ఎప్పుడూ ఉంటాయి.

◆ వెంకటేష్ పువ్వాడ