Read more!

భుక్తిని, శక్తిని చేకూర్చే అమ్మలకు నీరాజనం!!

 

భుక్తిని, శక్తిని చేకూర్చే అమ్మలకు నీరాజనం!!

నవరాత్రుల సందడిలో నవదుర్గల కొలాహాలంలో  అమ్మవారు అయిదవ రోజున రెండు రూపాలలో దర్శనమిస్తారు. అన్నపూర్ణగా, మహాలక్ష్మి దేవిగా భక్తుల కష్టాన్ని తీర్చి భుక్తిని, ముక్తిని ప్రసాదించే అమ్మవారి అలంకారాలు అనిర్వచనీయం, అవతారాల ఆంతర్యం అద్భుతం.

కాశీపురాధీశ్వరీ…..

సకల ప్రాణులకు ఆహారం ఎంతో ముఖ్యమైనది కాశీలో గంగ అందరి దాహం తీరిస్తే, అన్నపూర్ణాదేవి అందరి ఆకలి తీరుస్తుంది. కాశీలో ఆ పరమశివుడు విశ్వేశ్వరుడి రూపంలో స్థిరంగా నివాసం ఉంటాడని భక్తుల నమ్మకం. అందుకే కాశీకి అంత ప్రత్యేకత, విశిష్టత. ఆ విశ్వనాథుడితో పాటు ఆయన దేవేరి పార్వతీ దేవి అన్నపూర్ణగా ఇక్కడ కొలువై ఉంటుంది. శివుడికి కూడా భిక్ష వేస్తూ ఆహారమనేది సకల ప్రాణులకు అవసరమని, ఆకలి అందరికి సమానమే అనే సంకేతాన్ని ఇస్తుంది ఈ అమ్మ. 

శివుడినే పెళ్లి చేసుకోవాలని పూజిస్తున్న పార్వతీదేవి గురించి విన్న శివుడు ఒక బిక్షపాత్ర పట్టుకుని భిక్ష కోసం తిరుగుతూ పార్వతీదేవి ఇంటి దగ్గరకు వెళ్తాడు. సాక్షాత్తు ఆ పార్వతీ దేవి శివుడికి బిక్షపాత్రలో అన్నం పెడుతుంది. ఆ లయకారకుడి ఆకలి తీర్చిన అమ్మవారే ఆయనకు భార్యగా మారుతుంది. కైలాసం నుండి వచ్చిన శివుడు ఈ భూమండలంలో కాశీ క్షత్రాన్ని నిర్మించి స్థిరనివాసం ఉంటాడు, ఆయనతో పాటు ఆయన ఆకలి తీర్చిన అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కాశీలో కొలువై ఉంటుంది. అందుకే కాశీలో ఎవరికి ఆకలి బాధలు ఉండవని చెబుతారు.

శివుడికి భిక్ష వేస్తున్న రూపంలో అన్నపూర్ణ దర్శనం ఇస్తుంది. అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా బంగారు చీరను అలంకరిస్తారు. అయిధవరోజున అన్నపూర్ణాదేవిని గులాబీ రంగు పూలతో పూజించాలి. పరమాన్నం లేదా పాయసం నైవేద్యంగా పెట్టాలి. అన్నపూర్ణ దేవి సకల జంజలకు ఆకలి బాధలు తీర్చి, వాక్శుద్ధిని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు ఎవరికి సాధ్యమైనంత మేర వారు పేదలకు దానధర్మాలు చేయాలి. ముఖ్యంగా సాధ్యమైనంత వరకు అన్నదానం చేయాలి. దీనివల్ల ఆ అన్నపూర్ణ దేవి చల్లని చూపులకు పాత్రులవ్వచ్చు.

అయిదవ రోజున మహాలక్ష్మి రూపంలో కూడా అమ్మవారు దర్శనం ఇస్తారు. విష్ణువు భార్య అయిన మహాలక్ష్మి దేవి ప్రతీ ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మి, సరస్వతీ రెండు మెండుగా ఉన్నవాడికి ఎలాంటి సమస్యలు ఉండవని అంటారు. ఆర్థికబాదలు తీర్చే మహాలక్ష్మి దేవి ఇంటింటికి ఎంతో ప్రీతికరమైన దేవత. నాలుగు చేతులు కలిగి రెండు చేతుల్లో తామర పువ్వులు, మరొక చేతితో బంగారు ఆభరణాలు కురిపిస్తూ ఇంకొక చేతిని అభయహస్తంగా కలిగి ఉన్న ఈ తల్లి లోకాన్ని శాసిస్తుంది.

మహాలక్ష్మి అష్టకం చెప్పుకుని, పాయసం నైవేద్యం గా పెట్టి, స్థోమత ఉన్నవారు బంగారు లేదా వెండి పువ్వులతో పూజ చేసి ఆర్థిక స్థోమత లేనివాళ్ళు తామరపువ్వులను సేకరించి ఆ పువ్వులతో అమ్మను పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. మహాలక్ష్మి దేవి కృప మనపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈరోజు పేదలకు దానధర్మాలు చేయడం, ఆర్థిక సమస్యలలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల కూడా అమ్మ సంతోషిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ