Read more!

నిజమైన శ్రీమంతులు ఎవరు??

 

నిజమైన శ్రీమంతులు ఎవరు??

 

మనిషి జీవితంలో కర్మలు చేస్తాడు. అయితే అవన్నీ కూడా నా అనే భావనతో చేస్తే అవి తిరిగి మనుషుల్ని బాధపెడతాయి. అందుకే నా అనే భావన లేకుండా నిష్కామ కర్మలు చెయ్యాలని గీతలో కృష్ణ భగవానుడు చెబుతాడు. అలా అచెయ్యాలంటే మనిషికి చింతన అవసరం, అది కావాలి అంటే ఏకాగ్రత, ఏకాగ్రత కావాలి అంటే ధ్యానం చేయడం ఎంతో అవసరం. అయితే వీటితో కూడిన జీవితాన్ని యోగం అని అంటారు. యోగంతో కూడిన జీవితం కొద్ది రోజులు ఆచరించి తరువాత వదిలేస్తే ఏమవుతుంది. సంపాదించిన జ్ఞానం, పుణ్యం అన్ని వ్యర్థమేనా అని అందరికీ సందేహం ఉంటుంది. ఆ సందేహానికి సమాధానం ఈ శ్లోకం.


ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః 

సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో భిజాయతే|


యోగభ్రష్టుడు అయిన వాడు ముందు పుణ్యలోకములను పొందుతారు. పుణ్యలోకములలో చాలా కాలం నివసించిన తరువాత మరుజన్మలో శుచిమంతులు, శ్రీమంతులు అయిన వారి గృహంలో జన్మిస్తారు. అంటే మంచి జన్మలభిస్తుంది.

యోగమును కొంత కాలము చేసి, ఏదో కారణము చేత మాని వేసిన వాడు అంటే యోగము నుండి దిగజారిన వాడు, సరిగా యోగం పూర్తిచేయలేకపోయిన వాడు, మధ్యలో మరణం సంభవించినవాడు. తాను ముందు జన్మలో ఎంత పుణ్యం చేసాడో అంత పుణ్యమునకు సరిపడా పుణ్యలోకాలను పొందుతాడు. అక్కడ చాలా కాలం ఉంటాడు. తాను చేసిన పుణ్యములకు తగిన సుఖములను అనుభవిస్తాడు. తరువాత మరు జన్మలో ఆచార పరులు, శుచిమంతులు అంటే సంస్కారవంతులు, పుష్కలంగా ధనం ఉన్న వారు, అయిన పుణ్యాత్ముల ఇంట్లో జన్మించి తను పూర్వజన్మలో విడిచిపెట్టిన యోగమును కొనసాగిస్తాడు. 

తాను చేయబోయే యోగమునకు అడ్డంకులైన దారిద్ర్యము, ఈతిబాధలు, వ్యాధులు మొదలగు బాధలు లేకుండా నిరాటంకంగా తన యోగమును కొనసాగిస్తాడు. శ్రీమంతుల ఇల్లు అంటే వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు అని కాదు ఇక్కడ అర్థం. తినడానికి తిండికి లోటు లేకుండా, అవసరానికి మించి ధనసంపాదన చేయని ఇల్లు ఉన్నదానితో తృప్తిగా జీవించే వాళ్లు ఉన్న గృహము అని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే మితిమీరిన ధనం ఉన్నా అతడు తన ధ్యానమును కొనసాగించలేడు. భోగలాలసలో పడిపోతాడు. అన్ని మరిచి పోతాడు. కాని ఈ యోగభ్రష్టుడు, క్రితం జన్మలో కొంత వరకు ధ్యానము మొదలగు యోగములను సాధన చేసాడు కాబట్టి భోగలాలసత్వమునకు బానిస కాకుండా, పరమాత్మవైపు తన దృష్టిని మళ్లిస్తాడు. కాబట్టి యోగభ్రష్టునకు సద్గతులే లభిస్తాయి.

శుచీనామ, శ్రీమతామ్ అనే పదాలు వాడారు. ఆచారవంతులు శ్రీమంతులు అయిన గృహంలో పుడతాడు. కొంత మంది సదాచార సంపన్నులు అయి ఉంటారు కాని దారిద్యంతో బాధపడుతుంటారు. అటువంటి ఇంట్లో జన్మిస్తే సాధకుడు తన సాధన కొనసాగించలేడు. అలాగే ధనం ఉండీ, సదాచారం లేకపోతే, అన్నిరకములైన చెడుఅలవాట్లకు బానిసై ఇదివరకు చేసిన సాధన కూడా ఆవిరై పోతుంది. అందుకే శ్రీమంతులు, సదాచార సంపన్నుల గృహంలో పుడతారు అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ.

 కాబట్టి మనం ఎంతో సాధన చేసి, మధ్యలో ఆపినా, మరలా కొనసాగించినా, మధ్యలో మరణించినా, చేసిన సాధన వృధా పోదు, చేసినంత వరకు పుణ్యలోకాలు లభిస్తాయి. తరువాతి మంచి జన్మ లభిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడు ధ్యానము చేయడం, వేదములు, శాస్త్రములు చదవడం, జ్ఞానం సంపాదించడం, నిష్కామ కర్మ, కరత్వభావన లేని కర్మలు చేయడం మొదలగు యోగములను శ్రద్ధతో, భక్తితో నిరంతరం చేస్తూ ఉండాలి. మనం ఆచరించిన యోగము ఎన్నటికీ వృథా కాదు, ఇది పరమాత్మ మనకు ఇచ్చిన అభయం.

                               ◆ వెంకటేష్ పువ్వాడ.