పరమాత్మ స్వరూపానికి అర్థమేమిటి??

 

పరమాత్మ స్వరూపానికి అర్థమేమిటి??

 

జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః॥ 

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున|

ఎవరైతే నా గురించి నా పూర్వజన్మల గురించి, ఆయాజన్మలలో నేను చేసిన కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నాడో, అటువంటి వాడు ఈ జనన మరణ చక్రం నుండి విడిపడి నన్నే పొందుతున్నాడు.

కృష్ణుడు పరమాత్మ అవతారము అని తెలుసుకున్నాము. కృష్ణుడి గురించి ఆయన పూర్వ అపతారముల గురించి తెలుసుకోవడం అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడమే. ఒక సారి పరమాత్మ తత్వం తెలుసుకుంటే, అతడికి పరమాత్మ గుణాలు సంక్రమిస్తాయి. అతడు పరమాత్మలో లీనం అవుతాడు. పరమాత్మను గురించి తెలుసుకోడానికి తగిన మార్గం సాధన. సాధన చేస్తే లభ్యం కానిది ఏదీ లేదు. కేవలం శాస్త్రములు చదవడం వలన ప్రయోజనం లేదు. అందులో చెప్పబడిన విషయాలను సాధన చేయాలి. కేవలం జ్ఞానం సంపాదించడం వలన లాభం లేదు. విజ్ఞానం కంటే అచరణ ముఖ్యం, కాబట్టి ఆత్మజ్ఞానం గానీ, పరమాత్మను గురించి తెలుసుకోవడం కానీ చెయ్యాలంటే సాధన, ధ్యానం ముఖ్యం. 

చాలా మంది మాకు దేవుడు కనిపించాడు. మేము దేవునితో మాట్లాడుతాము, అని అంటుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే దేవుడి గురించి ఆయన తత్వము గురించి తెలుసుకోగలము అంతే కానీ చూడటం మాట్లాడటం సాధ్యంకాదు. ఎందుకంటే దేవుడు ఒక రూపం కాదు, శరీరంకాదు. కేవలం ఆవయవాలు ఉంటేనే చూడ్డం, మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి భగవంతుని చూచాను. మాట్లాడాను అనడం నిజం కాదు. భగవంతుడు ఆత్మస్వరూపుడుగా ప్రతివాడిలో ఉన్నాడు. భగవంతుని చూడాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. మనసును ఆత్మలో స్థిరంగా ఉంచాలి. అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. అదే పరమాత్మ దర్శనం. ఇక్కడ దివ్యమైన నా జన్మను గురించి ఎవరు తెలుసుకున్నారో అని ఉంది. జన్మేలేని వాడి జన్మను గురించి తెలుసుకోవడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. 

పరమాత్మకు జన్మ అనేది లేదు. తాను అనుకుంటే, తన ఇష్టం ప్రకారం, అవతరిస్తాడు. ధర్మసంస్థాపన చేస్తాడు అన్ని తెలుసుకుంటే పరమాత్మ జన్మరహస్యం తెలిసినట్టే అని అర్థం. బయట ఉంటే పరమాత్మ. శరీరంలో ఉంటే ఆత్మ. ఆత్మకు ప్రాపంచిక విషయాల ప్రభావం వలన వాసనలు అంటుకుంటే ఆత్మ జీవాత్మగా పరిణామం చెందుతుంది. దాని వలన జనన మరణాలు కలుగుతాయి. వాసనలు అన్నీ సమూలంగా అంతరిస్తే అంటే వాసనల నుండి మోక్షం కలిగితే, జీవాత్మ తన స్వస్వరూపమైన ఆత్మగా పరిణామం చెంది, పరమాత్మలో లీనం అవుతుంది. సూక్ష్మంగా ఇదీ ఆత్మతత్వము. 

ఈ తత్వం తెలుసుకున్నవాడికి పరమాత్మలో లీనం కావడం తేలిక. అలా కాకుండా పరమాత్మ తనకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడు అనీ, పరమాత్మ నాతో మాట్లాడుతాడనీ అనుకుంటూ ఉంటే, "ఉన్నావా! నీవున్నావా!” అంటూ పాటలు పాడుతుంటే...... అతను అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నాడు అని అర్థం. అంటే తాను వేరు పరమాత్మ వేరు అనే అజ్ఞానంలో ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అనే సూత్రం అర్ధం చేసుకోలేదని అర్థం. అందుకనే నా గురించి నా జన్మల గురించి అంటే నాకు జన్మ అంటూ లేదు. అంతా లీల అని తెలుసుకోవడం, నా కర్మల గురించి అసలైన తత్వం ఎవరు తెలుసుకుంటాడో వాడు నన్నేపొందుతున్నాడు అంటే వాడి ఆత్మ నాలో ఐక్యం అవుతుంది అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు.

 ఇక్కడ తత్వం తెలుసుకోవడం అంటే ఆత్మస్వరూపం గురించి అసలు విషయం తెలుసుకోవడం. సముద్రం, అలలు అనేవి మనకు కనిపించే అవతారాలు. అసలు ఉన్నది నీరు. అని తెలుసుకోవడం. అంటే పరమాత్మ ఒక్కడే అతడు నిరాకారుడు, మనకు కనిపించే అవతారాలు అన్నీ ఆయన లీలలు అని తెలుసుకోవడం. 

ఇలా తెలుసుకుంటే ఒక దేవుడు, ఒక మతము అనే విషయాలన్నీ మెదడులో నుండి మాయమైపోతాయి. ఉన్నది ఒక్కటే పరమాత్మస్వరూపమని అర్థమవుతుంది.

                                   ◆ వెంకటేష్ పువ్వాడ.