Read more!

వర్ణవ్యవస్థ గురించి భగవద్గీతలో ఏమి చెప్పారు??

 

వర్ణవ్యవస్థ గురించి భగవద్గీతలో ఏమి చెప్పారు??

 

వర్ణవ్యవస్థ గురించి పురుష సూక్తంలో ఉంది. పురుషసూక్తం ఋగ్వేదంలోనిది. ఋగ్వేదము అతి ప్రాచీనమైనది. అందులో ఈ వర్ణవ్యవస్థను అత్యంత నైపుణ్యంతో వర్ణించారు. 


బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే బ్రాహ్మణులు ముఖం నుండి ఆవిర్భవించారు. ముఖము ప్రదానంగా వాక్కు అంటే విద్యకు ప్రతీక. వేదవిద్య. శాస్త్రవిద్య. వీటిని అందరికీ బోధించి ఆచరింపజేసే పని బ్రాహ్మణులది. అందుకని బాహ్మణోస్య ముఖమాసీత్ అని అన్నారు. 


తరువాత బాహూరాజన్యకృతః అంటే రాజులు బాహుబలం కలిగి ఉండాలి. అప్పుడు రాజ్యరక్షణ, దేశరక్షణ, ప్రజల రక్షణ చక్కగా చూడగలరు. శరీరంలో శక్తి కలిగి ఉండేవి బాహువులు. అందుకే బాహు బలము అని అన్నారు. అందుకే బాహువులను క్షత్రియులకు ప్రతీకగా చెప్పారు. 


ఊరూ తదస్యయదైవశ్య: అంటే వైశ్యులు మన శరీరంలో ఊరువులతో అంటే తొడల భాగంతో సమానము. శరీరాన్ని మోసేది తొడల బాగం. అవి బలంగా లేకపోతే నిలబడలేడు. సమాజానికి ధనము, ధాన్యము, ఐశ్వర్యము సమకూర్చేది వైశ్యులు. ఈ సమాజానికి తొడలవంటి వారు. 


తరువాత పద్భాగ్ శూద్రో అజాయత. శూద్రులు పాదముల వంటి వారు. ఎక్కడికిపోవాలన్నా, ఏపని చేయాలన్నా గతిమంతములైన పాదములే శరణ్యము. అందుకని శరీరంలో పాదముల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవము వీరి పాదములకు నమస్కరిస్తాము. సమాజం సక్రమంగా నడవాలంటే విరాట్ పురుషుని పాదములలో నుండి ఉద్భవించిన శూద్రులే ముఖ్యము.


కాబట్టి అన్ని వర్ణములు సమానమైనవే. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదు. దేని ప్రాధాన్యత దానిదే అని తెలుసుకోవాలి. అందుకనే విరాట్ పురుషుని శరీరంలోని ముఖ్యమైన నాలుగు భాగాలు(తల, చేతులు, తొడలు, కాళ్లు) నాలుగు వర్ణాలకు ప్రతీకలుగా వర్ణించారు. వీటిలో భేదాలు కల్పించడం మన అజ్ఞానానికి పరాకాష్ఠ, కాలిలో ముల్లు గుచ్చుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. చెయ్యి ఆ ముల్లు తీయడానికి ప్రయత్నిస్తుంది. తొడలు మోకాళ్లు వంగి చేతులకు కాళ్లు అందేటట్టు చేస్తుంది. అవయవాలు అన్నీ ఒకదానితో ఒకటి ఇలా సహకరించుకుంటాయి. మనమే తిన్నది అరక్క కులాల పేరుతో దెబ్బలాడుకుంటున్నాము.


ఇంతెందుకు ప్రతి మనిషిలోనూ నాలుగు వర్ణాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఎలాగంటే, పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు, నీతి వాక్యాలు చెప్పేటప్పుడు, సాటివారికి నాలుగు మంచి మాటలు చెప్పేటప్పుడు అతడు బ్రాహ్మణుడు. ఎవరైనా తన మీదికి కానీ, తన కుటుంబం జోలికిగానీ వస్తే, ధైర్యంగా ముందుకు దూకినపుడు, అతడు క్షత్రియుడు. తన కుటుంబానికి ధనం సంపాదించేటప్పుడు, వ్యవసాయం, వ్యాపారం చేసేటప్పుడు వైశ్యుడు. ఉద్యోగం చేసేటప్పుడు సమాజ సేవ చేసేటప్పుడు శూద్రుడు. అంటే ప్రతి మనిషిలో నాలుగు వర్ణాలు ఉన్నాయి. అని కూడా చెప్పుకోవచ్చు.


సందర్భానుసారంగా మరొక విషయం కూడా చెప్పుకుందాము. మానవులను, వారి వారి గుణములు, చేసే కర్మలతో పాటు జాతి ప్రకారంగా కూడా విభజించవచ్చు. కాని ఈ నాడు కేవలం పుట్టుకతో మాత్రమే కులమును నిర్ణయిస్తున్నాము. జాతి అంటూ పుట్టుకతో వచ్చేది. జ అంటే పుట్టుక, ఒక వ్యక్తి తన గుణము ప్రకారము గురువుగా ఉన్నాడు. పురోహితుడుగా ఉన్నాడు. ఆయన గుణబ్రాహ్మణుడు. ఆయనకు పుట్టిన కుమారుడు కూడా బ్రాహ్మణజాతికి చెందినవాడు కావాలి. కాని ఆయన క్షత్రియ గుణములు అలవరచుకుంటాడు. అటువంటప్పుడు ఆయన జాతిరీత్యా బ్రాహ్మణ జాతి అయినా గుణములో క్షత్రియుడు. (పరశురాముడు, ద్రోణుడు, అశ్వత్థామ.) 


అలాగే జాతి రీత్యా క్షత్రియుడు అయినా గుణముల రీత్యా బ్రాహ్మణత్వము స్వీకరించి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయనే విశ్వామిత్రుడు, కృష్ణుడు కూడా జన్మత: క్షత్రియుడు. కానీ శూద్రవృత్తి అయిన సారధ్యం చేసాడు. బ్రాహ్మణ వృత్తి అయిన వేదాంతం బోధించాడు. వైశ్యవృత్తి అయిన పశుపాలన, గోవులను కాయడం చేసాడు. కాబట్టి ఒకే వ్యక్తిలో అన్ని గుణాలు ఉండవచ్చు. ఈనాడు మనలో కూడా పుట్టుక రీత్యా బ్రాహ్మణుడు అయి ఉండి, వ్యాపారం చేస్తుంటే అతడు గుణ, కర్మ రీత్యా వైశ్యుడు, రక్షణ, పరిపాలనా రంగంలో ఉంటే గుణ, కర్మ రీత్యా క్షత్రియుడు. ఈ ప్రకారంగా గుణముల ప్రకారము. వర్ణములు మారిన వారు ఈనాడు కూడా చాలామంది కనిపిస్తారు. 


కాబట్టి కులం అనేది ఒకటి ఎక్కువా కాదు ఒకటి తక్కువా కాదు అని అర్థం చేసుకోవాలి.


                               ◆వెంకటేష్ పువ్వాడ