Read more!

కోరికల పర్యవసానం!!

 

కోరికల పర్యవసానం!!

మనిషి జీవితంలో కోర్కెలు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఏదైనా కావాలని అనుకోవడం, సొంతమవ్వాలని అనుకోవడం కోరిక. అది నెరివేరితే కోరిక తీరినట్టే. ఇలాంటి మనిషికి జీవితంలో ఎన్నో పుడతాయి. రోజుకు రోజుకు ఈ కోరికలు చిట్టా పెరుగుతూ ఉంటుంది కూడా. అలాగే మనిషి మనసు కోతిలాంటిది. దానికి నిలకడ ఉండదు. అయితే భగవద్గీతలో కృష్ణుడు కోరికలు మనిషిని ఎలా ఆడిస్తాయో చెబుతాడు.

కోరికలు మనకు మూడు విధములైన నష్టములను కలిగిస్తాయి. ఒకటి ఆ ఫలితములు అన్నీ తాత్కాలికములు నిలిచి ఉండేవి కావు. అన్ని తుదకు దుఃఖముతో అంతం అవుతాయి. రెండు ఎన్ని కోరికలు తీరినా తృప్తి ఉండదు. ఇంకా కావాలనిపిస్తుంది. మూడు ఈ కోరికలు బంధనములు కలుగజేస్తాయి. కాని పరమాత్మను ధ్యానిస్తే శాశ్వతానందము కలుగుతుంది. పరమ శాంతి కలుగుతుంది. కాబట్టి ఎన్నో రకాల దేవతలను మనసులో ఉన్న ఎన్నో రకాల కోరికల కోసం ఆరాధించి ఆయా కోరికల ఫలములను పొందడం కన్నా, పరమాత్మను ఆరాధించి ధ్యానించి శాశ్వత సుఖమును, శాంతిని పొందడం మంచిది.

ఈ విషయాలు అందరికీ తెలుసు కానీ కోరికలు తీర్చుకోడానికి ఎందరో రకాల దేవతలను ఆరాధించడానికే ప్రయత్నం చేస్తున్నారు. కారణం “అల్ప మేధసామ్" అంటే మన యొక్క బుద్ధి, మేధస్సు అల్పంగా ఉండటమే పెరగక పోవడమే. సరిగా ఆలోచించకపోవడమే. లేకపోతే శాశ్వతసుఖము, శాంతి, మోక్షము ఇచ్చే మార్గమును వదిలిపెట్టి చిన్ని చిన్ని కోరికలను తీర్చడానికే అర్హత గల చిన్ని చిన్ని దేవతలను ఎందుకు ఆరాధిస్తారు. అందరికంటే గొప్పవాడు అయిన పరమాత్మను మరిచిపోవడం మన అల్పమేధస్సుకు గుర్తు, గంగానదిలో ఉన్న నీటిని వదిలిపెట్టి పక్కనే ఉన్న బావిలో నీరు తోడుకున్నట్టు ఉంటుంది. కల్పవృక్షము ను వదిలిపెట్టి చిన్న మొక్కను కోరినట్టు ఉంటుంది. 

దీనికి కారణం ఏమిటి? మనుషులకు తాత్కాలిక ఫలముల మీద ఉన్న మోజు శాశ్వత ఫలితముల మీద ఉండదు. వెంటనే ఫలితం కావాలి. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలి. లోకంలో ఉన్నవన్నీ వెంట వెంటనే తన ఇంట్లో చేరిపోవాలి. ఎటువంటి అనుభవం లేకపోయినా ఇద్దరు రాజకుమారులు ఒకరు ఛీఫ్ మినిష్టరు మరొకరు ప్రైమ్ మినిష్టరు అవడానికి ఆతురత పడుతున్నారు ఇదే కారణం. మరొక ఛీఫ్ మినిష్టరు ఉన్న పదవి పోకుండా ఉండటానికి వివిధములైన పూజలు చేసాడని విన్నాం. ఇవన్నీ అల్పమేధస్సుకలవాళ్లు చేసే పనులు. ఈ తాత్కాలిక భోగములు పదవులు సంపదలు నశించిపోయేవే. ఏవీ శాశ్వతములు కావు. ఈ లోగా అవన్నీ దూరం అయిపోవచ్చు. 

కాబట్టి శాశ్వతానందము కొరకు ప్రయత్నం చేయాలి. రాక్షసులను ఆరాదిస్తే రాక్షస కోరికలే పొందుతారు. దేవతలను ఆరాధిస్తే సాత్వికమైన కోరికలను పొందుతారు. బంధనములు కలిగించే తాత్కాలికమైన కోరికల కోసం చిన్న చిన్న దేవతలను ఆరాధిస్తారా, లేక శాశ్వత సుఖం కోసం పరమాత్మను ఆరాధిస్తారా అంతా మన చేతుల్లోనే ఉంది. మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి మనము అల్పమేధస్సుతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. నీవు ఏం చేసినా పరమాత్మ కాదనడు. నీవు చేసిన దానికి తగిన ఫలితములను ఇస్తూనే ఉంటాడు.

                                ◆వెంకటేష్ పువ్వాడ