Read more!

శ్రేష్ఠుడు ఎవరు??

 

 శ్రేష్ఠుడు ఎవరు?? 

యస్త్వి న్డ్రియాణి మనసా నియమ్యారభతేర్జునః కర్మేన్దియైః కర్మయోగమసక్తస్స విశిష్యతే ॥

ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి, ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో, అతడిని విశిష్ఠపురుషుడు అని అంటారు.

అర్జునా! శరీరము, శరీర అవయవములనే కాదు, మనసును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములు మనసు చెప్పినట్టు వినాలి కానీ, ఇంద్రియములు చెప్పినట్టు మనసు వినకూడదు. అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామ కర్మలు చేయాలి. చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు. అప్పుడు ఆ కర్మ బంధనమలు అతనిని అంటవు. కర్మల పట్ల ఆసక్తి, విషయవాంఛలు, మనసులో నుండి బయటకు నెట్టాలి. నిష్కామంగా, ఏ కోరికా లేకుండా, ఫలం ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా, ఆ కర్మలు అతనిని బంధించవు. అటువంటి కర్మలు చేసేవాడు విశిష్యతే అంటే శ్రేష్ఠమైనవాడు అని పిలువబడతాడు. నేను జ్ఞానిని, నేను ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకొని, కళ్లు మూసుకొని కూర్చుని, మనసులో విషయవాంఛల గురించి ఆలోచించేవారి కంటే, తనకు విధింపబడిన కర్మలను, తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో, నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, అహంకారంలేకుండా చేసే వాడు ఎంతో ఉత్తముడు.

ఒకడు అజ్ఞాని. వాడికి ఏమీ తెలియదు. శాస్త్ర జ్ఞానము లేదు. వాడు ఈ ప్రపంచంలో తిరుగుతుంటాడు. కర్మలు చేస్తుంటాడు. కాని వాడి మనసు వాడి అధీనంలో ఉంటుంది. బుద్ధి చెప్పిన మాట వింటుంది. చేసే కర్మల ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తాడు. అటువంటి వాడు, అన్ని శాస్త్రములు చదువుకోనప్పటికీ, మనసును అదుపులో ఉంచుకోలేని సన్యాసి కన్నా గొప్పవాడు. ఎందుకంటే, మన అవయవములు అంటే ఇంద్రియములు జడపదార్థములు. అవి మనసు ఎలా చెబితే అలా చేస్తాయి. మనస్సు యొక్క ఆజ్ఞలను పాటించడమే వాటి పని. మనసు బుద్ధి అలా కాదు. వాటికి ఆలోచించే శక్తి ఉంది. మంచి చెడు విచక్షణ ఉంది. ఇంద్రియముల చేత మంచి పనులు చేయించే బాధ్యత మనసుది. అదే పెడదారి పడితే మానవుడు ఎన్ని శాస్త్రములు చదువుకున్నా, పతితుడవుతాడు. దానికి మనసు చేయవలసిన పని, ఇంద్రియములను అదుపులో పెట్టడం, నిష్కామంగా కర్మ చేయడం, ఫలితాన్ని ఆశించకుండా కర్మచేయడం.

 నేను ఈ పని చేస్తున్నాను అనే భావన లేకుండా అంటే కర్తృత్వభావన లేకుండా కర్మచేయాలి. కాని ఇప్పటి సన్యాసులు మాత్రం అంతా తమ మీదనే నడుస్తూ ఉందని ఫీల్ అవుతుంటారు. అన్నిటికీ తామే కర్త కర్మ క్రియ గా వ్యవహరిస్తుంటారు. వీరు పేరుకే సన్యాసులు కాని విశిష్ట వ్యక్తులు కారు. పై శ్లోకంలో చెప్పినట్టు వీరంతా దంభాచారులు, కపటులు. అసలు కర్మయోగి ఎవరంటే మనసుతో ఇంద్రియములను అదుపులో ఉంచుకొని, ఆ అదుపులో ఉన్న ఇంద్రియములతో కర్మలు చేసేవాడు. కర్మఫలమును ఆశించని వాడు. ఎల్లప్పుడూ తన మనసును భగవంతుని యందే లగ్నం చేసే వాడు. అటువంటి వాడు సంసారి అయినా, సన్యాసి అయినా ఒకటే. ఈ ప్రపంచంలో తిరుగుతూ కర్మలు చేస్తున్నా, తామరాకు మీది నీటి బొట్టు మాదిరి సంచరిస్తుంటాడు. అతడే శ్రేష్ఠుడు.


                               ◆వెంకటేష్ పువ్వాడ.