Read more!

శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - ఐదవ రోజు (Moolaa Nakshatram Saraswathi Devi - 5)

 

శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - ఐదవ రోజు

(Moolaa Nakshatram Saraswathi Devi - 5)

 

''యా కుందేందు తుషారహార

దవళా యాశుభ్ర వస్త్రాన్వితా

యా వీణా వరదండ మండిత

కరా యశ్వేత పద్మాసనా

యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి

భిర్దేవైస్సదా పూజితా

సమాంపాతు సరస్వతీ భగవతీ

నిశ్శేష జాడ్యాపహా"

 

నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈమె బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి, చతుష్షష్టి కళలను అనుగ్రహించినది సరస్వతీ దేవి. సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. పెసరపప్పు పాయసాన్ని సరస్వతీ దేవికి నైవేద్యంగా నివేదించాలి.  

 

నైవేద్యం - పెసరపప్పు పాయసం

కావలసిన పదార్ధాలు

పెసరపప్పు - 100 గ్రా

పంచదార -150 గ్రా

పచ్చి కొబ్బరి - 1/2 కప్పు

జీడిపప్పు - 10

యాలకులపొడి -1 స్పూనుడు

బాదంపప్పు - 10

కిసిమిస్ - 10

పాలు - 2 గ్లాసులు

నెయ్యి - తగినంత

తయారు చేసే పద్ధతి

పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత పచ్చికొబ్బరి, పంచదార వేసి మరికొంతసేపు ఉడికించాలి. పాలు పోసి, దగ్గర పడిన తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి. చివర్లో యాలకుల పొడి వేసి దించితే సరిపోతుంది.