Read more!

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరవ రోజు (Sri Lalitha Tripura Sundari Devi - 6)

 

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరవ రోజు

(Sri Lalitha Tripura Sundari Devi - 6)


ప్రాత: స్మరామి లలితావదనారవిందం

బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్

ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం

మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్

త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి.  

 

నైవేద్యం - అప్పాలు

కావలసిన పదార్ధాలు

మైదా -2 కప్పులు

బెల్లం తురుము - 1 కప్పు

బియ్యప్పిండి -1 కప్పు

ఎండు కొబ్బరి పొడి - 4 స్పూనులు

రవ్వ -1 కప్పు

యాలకుల పొడి -1 స్పూన్

తయారు చేసే పద్ధతి

రవ్వను జల్లించి గిన్నెలో వేయాలి. మైదాపిండి, బియ్యప్పిండి లను కుడా జల్లించి రవ్వలో కలపాలి. బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా ముద్దగా కలిపి ఒక అరగంట ఉంచాలి. అరగంట తర్వాత బెల్లం కరిగి పిండి కాస్త మెత్తబడుతుంది. చేతిని తడి చేసుకుంటూ చిన్న నిమ్మకాయంత పిండిని తీసుకుని అర చేతిలో అరిసెలు మాదిరిగా వత్తాలి. వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేగాక తీస్తే సరిపోతుంది.

నైవేద్యం - పులిహోర

కావలసిన పదార్ధాలు

బియ్యం - 1 పావు

చింతపండు - 2 నిమ్మకాయంత

పసుపు - 1 టేబుల్ స్పూన్

వేయించిన వేరుశెనగపప్పు - 3 స్పూన్లు

ఉప్పు, నూనె - తగినంత

ఆవాలు - 1 టీ స్పూన్

పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్

కరివేపాకు - 2 రెబ్బలు

ఎండు మిరపకాయలు - 4

తయారుసే పద్ధతి

ముందుగా బియ్యం కడిగి 2 పావుల నీళ్ళు పోసి ఉడికించాలి. అన్నంలో ఉప్పు, పసుపు వేసి కలిపుకోవాలి. వేడినీళ్ళలో చింతపండు వేసి నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును చిక్కగా అయ్యే వరకు ఉడక పెట్టుకోవాలి. మూకుట్లో నూనె పోసి కాగాక ఆవాలు వేసుకోవాలి. తరువాత పచ్చి శనగపప్పు , వేరుశెనగపప్పు , ఎండు మిరపకాయలు వేగనిచ్చి, చివర్లో కరివేపాకు వేసి దించాలి. ఇందులో చింతపండు మిశ్రమం వేసి అన్నం లో బాగా కలపాలి.