Read more!

బుద్బుదమైన జీవితం పట్ల మనిషి చేస్తున్న తప్పు ఇదే..

 

బుద్బుదమైన జీవితం పట్ల మనిషి చేస్తున్న తప్పు ఇదే..

ఆయుష్షు చిగురాకు కొనలోని నీటి బిందువులా అలా జారిపోయే స్వభావం కలిగి ఉంటుంది. చీలిపోయిన కుండలోని నీటిలా తరిగిపోవడమే  దీని స్వభావం. ఈ శరీరం ఉన్నట్లుండి ఏ క్షణంలోనో రోగాల పాలు అవుతుంది. ఒక నియమం అంటూ లేకుండా ఏ క్షణంలోనో నేలకూలుతుంది.  చేతుల్లో లేకుండా ఇలా జారే ఆయుష్షును ఎలా నమ్మగలం? గాలినీ, అలలనూ నిరోధించ వచ్చునేమో కాని, నీటి బుడగలాంటి ఆయుష్షును నిలపలేము. ఇది అతి చంచలమైనది. అందుకే జ్ఞానులు దీనిని తరంగంలానో, నూనె లేని దీపంలానో త్వరలో నశించి పోయేదిగా భావిస్తారు. కొందరు "అయ్యా! మేము భగవంతుని గురించి ముసలితనంలో ఆలోచిస్తాం. ఇప్పుడు ఏం తొందర" అంటారు. వారికి ఆయుష్షుపై ఎంత నమ్మకం!


ప్రజలందరూ  'మాకు ఎక్కువ ఆయుష్షు ఉండాలి' అని కోరుకుంటారు. కానీ మనసు శాంతిని కోల్పోయిన తరువాత ఎంత దీర్ఘాయుష్షు ఉండి మాత్రం ఏం ప్రయోజనం ఏముంది? 


తరవోపి హి జీవన్తి, జీవన్తి మృగ పక్షిణః। 

సజీవతి మనో యస్య మననేన సజీవతి॥


వృక్షాలు, మృగాలు, పక్షులు కూడా జీవిస్తున్నాయి. కానీ ఏంలాభం? ఎవరికైతే, ఈ దృశ్య సంకల్పం యొక్క మననం క్షీణిస్తుందో, వారే వాస్తవమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని అర్థం.


ఈ జీవితం గురించి, జీవితంలో మనకు కనిపించే ఎన్నో రకాల విషయాల గురించి సరైన అవగాహన ఉండాలి.  వాస్తవాన్ని అంగీకరించగలగాలి. అర్థం చేసుకోగలగాలి. స్వార్థం, ఈర్ష్య, అసూయ, కోపం వంటి భావనలను వదిలిపెట్టాలి. తత్త్వబోధ పొంది ధన్యులు కావాలి. అలాంటి వారి విషయంలోనే ఆయుష్షు  సార్థకమవుతుంది.


మనస్సు ప్రశాంతంగా లేనివారికి ఆ మనస్సే పెద్ద భారంగా మారుతుంది. ఇది ప్రతిక్షణం తన పంథాను మార్చుకుంటుంది. నిలకడగా ఉండక ఎన్నో కోర్కెలు, ఆశల వలయంలోకి ప్రవేశించి చివరికి బాధకు లోనవుతుంది. ఈ మనసు మాయను అర్థం చేసుకున్నవారు మాత్రం, ఈ శరీరం గురించి, మనిషి భౌతిక జీవనం గురించి, ఆధ్యాత్మిక మార్గం గురించి తెలుసుకుని అర్థం చేసుకోగలుగుతున్నారు.  ఇలాంటి వారి బుద్ధి నిర్మలంగా మరి మనస్సుకు స్వస్థత చేకూరుతోంది. మనస్సు స్వస్థత లేనిచోట అందమైన రూపం, శరీర పుష్టి, లౌకిక తెలివితేటలు, దీర్ఘాయుష్షు, శాస్త్రజ్ఞానం, సంకల్ప సామర్థ్యం  ఇవన్నీ నిష్ప్రయోజనమే అవుతాయి. అంతే కాకుండా అవన్నీ పెనుభారంగా మారి అనేక దుఃఖాలను పోగుచేసి పెడుతున్నాయి. 


నూనం నిగరణాయాశు ఘన గర్ధమనారతం । ఆఖుర్మార్ణాలకేణేవ మరణే నావలోక్యతే !!


పిల్లి ఎలుకను ప్రియంగా చూసినట్లు ఒకపక్క మృత్యువు ప్రాణిని మింగివేయడానికి మహాభిలాషతో నిరంతరం చూస్తోంది. ఈ విషయం జీవులు ఎలా విస్మరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.


జరామరణాలు ప్రియమిత్రులలా కరచాలనం చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నాయి. ఇదంతా ఇలా ఉండగా అనేకు మంది దీనిని గమనించకుండా తీరికగా కూర్చుని, వర్తమానం వ్యర్థం చేసుకొంటున్నారు. ఈ వర్తమానంలో గతాలను గుర్తు చేసుకొని కాస్త, భవిష్యత్తు గురించి ఊహల కోటలు కట్టుకుంటూ మరికొంత సమయాన్ని గంగలో కలిపేస్తున్నారు.


                                     ◆నిశ్శబ్ద.