Read more!

మనిషి నిజమైన కర్తవ్యం ఇదే!

 

మనిషి నిజమైన కర్తవ్యం ఇదే!

మన జీవితాలు సంతోషంగా ఉంటూ కుటుంబాలు హాయిగా ఉండాలంటే ప్రతి మనిషీ తోటి వారితో అన్యోన్యంగా మెలగడం నేర్చుకోవాలి. మనలో నిద్రాణమై ఉన్న 'మానవత్వాన్ని' జాగృతం చేయడానికీ, అంతర్గతంగా ఉన్న 'దివ్యత్వాన్ని' వ్యక్తం చేయడానికీ  మనం ప్రయత్నించాలి. 


నవ మాసాలు మోసి, కని, పెంచిన తల్లియే ప్రథమ దైవం. ఒక ఊరిలో ఓ సంపన్నుడు ఉండేవాడు. తనకున్న ఆస్తినంతటినీ తన కుమారులకు పంచిపెట్టాడు. కొన్నాళ్ళ తరువాత ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఆయన చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ ధనికుని ఇద్దరు కుమారులు మరణించబోయే తండ్రి శవాన్ని శ్మశానానికి ఎలా తీసుకువెళ్ళాలో చర్చించసాగారు. పెద్ద కుమారుడు తండ్రి శవాన్ని ఒక లారీలో తీసుకు వెళదామంటే, రెండో కుమారుడు లారీ అయితే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎడ్ల బండిలో తీసుకువెళదామని అన్నకు సలహా ఇచ్చాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు తర్జనభర్జన పడుతుంటే చావు బ్రతుకుల్లో ఉన్న ఆ ముసలి తండ్రి 'ఒరేయ్! మీ ఇద్దరూ నా కోసం ఎందుకు అలా గొడవలు పడతారు. గ అదిగో! ఆ మూలనున్న నా చేతి కర్రను నాకు ఇవ్వండి. నేనే  మెల్లగా నడుచుకుంటూ శ్మశానానికి వెళ్ళిపోతాను' అని అన్నాడు విసుగ్గా. ధనం కోసం కన్న తల్లితండ్రులనే నిర్లక్ష్యం చేసే సుపుత్రులు ఉన్నంత వరకూ కుటుంబంలో శాంతి, సహజీవనం ఎలా నెలకొంటాయి!


నేటి పరుగుల ప్రపంచంలో దంపతులు ఒకరి అభిరుచుల్ని మరొకరు తెలుసుకొనేందుకు సమయం ఉండడం లేదు. ఒకవేళ తెలుసుకొనే సమయమున్నా సహనంతో అర్థం చేసుకొనే మనసు లేదు. దాంపత్య జీవనం సమస్యల వలయంలో ఏ చిక్కుకోవడానికి ఇదే ప్రధాన కారణం. సంతుష్టో 


భార్యయా భర్తా భార్తా భార్యా తథైవ చ |

యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వైధ్రువమ్॥ 


 'భర్త భార్య అవసరాలను తీరుస్తూ, భార్య భర్త అభిరుచుల్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే అన్యోన్యంగా దాంపత్య జీవనం గడుపుతారో వారికి ఎల్లప్పుడూ శుభం చేకూరుతుంది'.

ఆధ్యాత్మిక జీవనానికి సంసారం ఒక అవరోధమనుకొని, బాధ్యతల్ని విస్మరించి తనపై ఆధారపడిన వారినంతా అర్ధంతరంగా కష్టాల కడలిలో వదలివేయడం నిజమైన 'వైరాగ్యం' కాదు. శ్రీరామకృష్ణుల దగ్గరకు వచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని ' గడుపుతామన్న భక్తులకు 'ముందు సంసార విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి' అని బోధించేవారు. ఆధ్యాత్మిక జీవనం గడపాలని శ్రీరామకృష్ణుల దగ్గరకు ఒక భక్తుడు వచ్చి ఆయనతో పాటు కొన్ని రోజులు ఉన్నాడు. ఆ భక్తునికి భార్యాబిడ్డలున్నారనీ, వారిని మామగారింటిలో, వదలివచ్చాడనీ శ్రీరామకృష్ణులు తెలుసుకున్నారు. ఆ భక్తుని బాధ్యతారహిత ప్రవర్తన గురించి తెలిసి అతనిని 'మీ భార్యాబిడ్డల్ని అనాథల్లా వదిలేస్తే వారిని ఎవరు చూసుకుంటారు? వారికి ఇరుగు పొరుగు వాళ్ళు తిండి పెడతారా? వారిని వదిలేసి ఇక్కడ సోమరిలా కూర్చోవడానికి సిగ్గులేదా? బాధ్యతల నుంచి తప్పించుకు తిరిగే నీలాంటి వారికి కాదు ఆధ్యాత్మికత' అని శ్రీరామకృష్ణులు మందలించారు. 


కాబట్టి మనిషి తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేరిస్తే సంతోషం, ప్రశాంతత అవే వస్తాయి.


                            ◆నిశ్శబ్ద.