Read more!

వీరుడిని దేశానికి అందించిన ఓ రాజమాత వ్యక్తిత్వం!

 

వీరుడిని దేశానికి అందించిన ఓ రాజమాత వ్యక్తిత్వం!


ఆ రాజమాతకు అవి తుదిక్షణాలు... ఆగమేఘాల మీద ఆమె పాదాల వద్దకు వాలాడు చక్రవర్తి... తల్లిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకొమ్మని ఆస్థాన వైద్యుల్ని ఆదేశించాడు. కాని సున్నితంగా తిరస్క రిస్తూ ఆ మాతృమూర్తి 'నాయనా... నాకే వైద్యమూ అవసరం లేదు. ఇక నేను సెలవు తీసుకునే ఆసన్నమైంది' అంటూ కొడుకును ఆశీర్వదిస్తున్నట్టు తలపై నిమిరింది.  అంతటి మహాచక్రవర్తి కూడా ఒక్కసారిగా పసిపిల్లాడిలా విలపిస్తూ 'అమ్మా! నీవు లేకుండా నేనెలా జీవించను, ఆ సింహాసనాన్ని ఎలా ఊహించుకోను' అంటూ పాదాలపై మోకరిల్లాడు. అంతటి నిష్క్రమణ స్థితిలో కూడా ఆ తల్లి 'నాయనా! ఎందుకు దిగులు పడుతున్నావు. ఈ దేశంలోని ప్రతి స్త్రీమూర్తిలో నేను నీకు కనిపిస్తాను. నేకెక్కడికీ వెళ్లను. నా ఆత్మ ఈ మట్టిలో, ఈ గాలిలో మమేకమయ్యే ఉంటుంది. ఈ దేశ ఔన్నత్యం కోసం, సంక్షేమం కోసం పాటుపడే బిడ్డల్ని కనీ పెంచే ప్రతి తల్లినీ నా ఆత్మచైతన్యపరుస్తూనే ఉంటుంది. బిడ్డల్ని వీరులుగా, దేశభక్తులుగా తీర్చిదిద్దేందుకు ప్రేరకశక్తిగా ఇక్కడే ఉంటాను.' అని ఆ బిడ్డ ఒడిలో ఒరిగిపోయింది... చరిత్రకు ఓ వీరున్ని పరిచయం చేసి... వీరమాతగా మిగిలిపోయింది.. ఆ రాజమాత జిజా బాయి... ఆ చక్రవర్తి ఛత్రపతి శివాజీ...


భారతచరిత్రలో ఆమె ఓ స్ఫూర్తిమంతమైన మాతృమూర్తి. ఒక తల్లి తలుచుకుంటే ఈ ప్రపంచానికి ఎంతటి వీరుణ్ని ప్రసాదించగలదో అక్షరాలా నిరూపించిన చైతన్యస్ఫూర్తి. మన ఆడపడుచు ఒక కూతురిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా, చివరికి పాలనాదక్షత కలిగిన ఏలికగా కూడా ఎంతటి కీర్తి శిఖరాలను అధిరోహించ గలదో అనటానికి ఒక్క జిజాబాయి చాలు. ఎప్పుడో పదిహేడో శతాబ్దపు రోజుల్లోనే ఆమె ఈనాటి ఆధునిక మహిళకు మించి అస్తిత్వం కోసం తపన పడింది. అదే తపనతో తుదికంటా పోరాడింది. చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరచుకుంది. 


ముగ్గురన్నదమ్ముల ఒక్కగానొక్క చెల్లెలిగా జిజా అల్లారుముద్దుగా పెరిగినా, ఏనాడూ ఆమె సామాన్యబాలికల్లా మెలు ఆటపాటలవైపు, అందచందాల వైపు ఆసక్తి చూపకపోయేది. ముస్లిం పాలనలో పరతంత్రమైన భారతావని దుస్థితిని తలచుకుంటూ పదేళ్ల వయసులోనే ఆవేధనతో, ఆగ్రహంతో తండ్రి దగ్గర రాజకీయాలపై అవగాహన పెంచుకుంది. చరిత్ర రాజకీయం... తదితర అంశాలు పురుషులకే అని ఈనాటికీ చాలా మంది మహిళలు వాటికి దూరంగా ఉంటారు. కాని జిజాబాయి గురువుల దగ్గర, పెద్దల దగ్గర పూర్తిగా రాజకీయ అంశాల్నే ప్రస్తావించేది. సమాజం మార్పులో మహిళా పాలు పంచుకోవాలని ఆకాంక్షించేది. అదే పట్టుదలతో దత్తాజీ సాహెబ్ దగ్గర యుద్దవిద్యలన్నీ నేర్చుకుంది జిజాబాయి. ఈతరం యువతులు నేర్చుకో వలసిన ప్రత్యేకాంశమిది. భౌతికంగా కూడా స్త్రీలు శక్తి మంతులుగా ఉండాలని, పురుషుడిదే రక్షణబాధ్యత అన్న భావాన్ని విడనాడాలని ఆచరణలో చూపారామె.


                                          ◆నిశ్శబ్ద.