Read more!

మహాకాళేశ్వర క్షేత్రం దేవతలకు కూడా పూజనీయమని తెలుసా?

 

మహాకాళేశ్వర క్షేత్రం దేవతలకు కూడా పూజనీయమని తెలుసా?

భారతదేశంలో శివ క్షేత్రాలు ఎప్పటి నుండో ఉన్నాయి. వాటిలో పరమేశ్వరుడు స్వయంభువు గా వెలసిన జ్యోతిర్లింగాలు ఎంతో ప్రముఖమైనవి. ఇవి ముక్తిని ప్రసాదించేవి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో కథ ఉన్నట్టు ఉజ్జయినీలో వెలసిన మహాకాళేశ్వరునికి  ఓ కథ ఉంది. కేవలం జ్యోతిర్లింగ క్షేత్రంగానే కాకుండా… అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటైన ఈ ఉజ్జయినీ క్షేత్రంలో మహాకాళేశ్వరుడి గురించి కార్తీక మాస సందర్భంగా తప్పక తెలుసుకోవాలి….

పూర్వకాలములో ఉజ్జయినీ పట్టణములో 'వేదప్రియుడు' అనే బ్రాహ్మణుడు. ఉండేవాడు. అతడు వేదవేదాంగ విదుడు. యజ్ఞయాగాది కర్మలను ఎంతో చక్కగా ఆచరించేవాడు. అంతకంటే ముఖ్యంగా అతను గొప్ప శివభక్తుడు. అతనికి నలుగురు కుమారులు. ఉజ్జయినికి దగ్గరలోనే 'రత్నమాల' అనే పర్వతము ఒకటి ఉంది. ఆ పర్వతము మీద 'దూషణుడు' అనే రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరాలు చాలా ఉన్నాయనే గర్వంతో అతడు  బ్రాహ్మణులను ఇష్టమొచ్చినట్టు పీడిస్తున్నాడు. వారు ఎంతో నిష్ఠతో చేసే యజ్ఞ యాగాది కర్మలు పాడు చేస్తున్నాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయినీ పట్టణాన్ని ముట్టడించాడు.

ఆ రాక్షసుని సైన్యం అంతా  గ్రామంలో పడి ప్రజలను పీడిస్తోంది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట్లో ప్రవేశించి పెద్ద పెద్దగా అరుస్తూ వేదప్రియుణ్ణి చంపటానికి చూస్తున్నాడు. ఆ సమయంలో వేదప్రియడు ఒక పార్ధివలింగాన్ని ఆరాధిస్తున్నాడు. ధ్యానంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చంపటానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు. మరుక్షణంలో ఆ శివలింగము నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుణ్ణి చంపేశాడు. రాజు మరణించగానే, అతడి సైన్యం కూడా పలాయనం చిత్తగించింది.

ఈశ్వరుడు వేదప్రియుడితో "వత్సా! నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో" అని అన్నాడు. దానికి బ్రాహ్మణుడు "ప్రభూ! భక్తవత్సలా! ఆత్రత్రాణ పరాయణా! నువ్వు మృత్యుంజయుడవు. నీ కృపా విశేషము వల్లనే ఇవ్వాళ నా ప్రాణాలు నిలిచాయి. కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే వెలసి, భక్తులను రక్షించు" అని అడిగాడు. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు వేదప్రియుడి కోరిక మేరకు అక్కడ జ్యోతిర్లింగమై వెలిశాడు. 

పరమశివుడు మహాకాళుడి రూపంలో రాక్షసుడిని సంహరించాడు కాబట్టి మహాకాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం శిప్రానదీ తీరములో ఉంది. శిప్రా నదిలో స్నానం చేసి, ఇక్కడ మహాకాళేశ్వరుడిని సేవించినట్లైతే దరిద్రము, అన్ని రకాల దుఃఖాలు, అన్ని భయాలు పారిపోతాయి.

ఇక్కడ ఆలయం అయిదు అంతస్థులుగా ఉంటుంది. క్రింది అంతస్థులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఆ లింగానికి అభిషేకం చేసి, చితా భస్మాన్ని లింగానికి అలంకరిస్తారు. గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు శిప్రానదికి పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి దేవత 'అదంతిక'. అందుచేతనే ఈ పట్టణాన్ని అవంతి అనికూడా అంటారు.

ఆకాశే తారకం లింగం పాతాళే హటకేశ్వరం

మర్త్యలోకే మహాకాయం లింగత్రయ నమోస్తుతే॥ 

అనే శ్లోకంతో మహాకాళేశ్వరుడిని జపిస్తారు. 

ఆకాశంలో తారకేశ్వర లింగము, పాతాళములో హటకేశ్వర లింగము, భూలోకములో శ్రీ మహాకాళేశ్వర లింగము, ఈ మూడు  దేవతలకు కూడా పూజనీయములు. ఇదీ మహాకాళేశ్వరుడి కథనం.

                                  ◆నిశ్శబ్ద.