ఈశ్వర బోధ.. పరమేశ్వరుడి నుండి ఈ నాలుగు విషయాలు నేర్చుకుని చూడండి.. జీవితం ఎంత బాగుంటుందో..!

 

ఈశ్వర బోధ.. పరమేశ్వరుడి నుండి ఈ నాలుగు విషయాలు నేర్చుకుని చూడండి.. జీవితం ఎంత బాగుంటుందో..!


దేవాదిదేవుడు అని మహదేవుడు లేదా పరమేశ్వరుడిని పిలుస్తారు. పరమేశ్వరుడిని భక్త సులభుడు  అని అంటారు.  ఈయన్ను పూజించడానికి ఆడంబరాలు అక్కర్లేదు.  భక్తిపూర్వకంగా పూజిస్తే ఎవ్వరికైనా అనుగ్రహం ఇచ్చేస్తాడు. శివుడి నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటే.. వాటిని జీవితంలో పాటించగలిగితే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే..

స్త్రీల పట్ల గౌరవం..

శివుడు స్త్రీ, పురుషుల మధ్య ఎప్పుడూ వివక్ష చూపలేదని గ్రంథాలలో ప్రస్తావించబడింది. శంకరుని అర్ధనారీశ్వర అవతారాన్నే పరిగణలోకి తీసుకుంటే తన భార్యను తనలో సగభాగం చేసుకున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఈ అవతారాన్ని వేరుగా ఆలోచిస్తారు. కానీ ఈ అవతార ముఖ్య అర్థం..  స్త్రీ, పురుషుల సమానత్వం. సమాజం, కుటుంబం,  జీవితంలో పురుషుడిలాగే స్త్రీ కూడా ముఖ్యమైనది. ఒకరినొకరు లేకుండా వారి జీవితం అసంపూర్ణంగా ఉంటుంది.  రెండూ ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి.

సహాయం..

పురాణ గ్రంథాలను ఒక్కసారి పరిశీలిస్తే..  శివుడు ఎప్పుడూ లోక కళ్యాణం కోసం, లోక రక్షణ కోసం ఎలాంటి త్యాగానికి అయినా వెనుకాడడు. సముద్ర మథనం సమయంలో దేవాది దేవతలను,  ఈ సృష్టిని రక్షించడానికి తాను విషాన్ని స్వీకరించాడు. ఇతరులకు ఎంత ఎక్కువ సహాయం చేస్తే మనకు అంత గౌరవం, ప్రేమ లభిస్తాయని ఆయన నిరూపించాడు. ఇది అందరూ అలవాటు చేసుకోవాలి.

సమానత్వ భావన..

సమానత్వ భావన కలిగి ఉండటం అంటే వివక్ష లేకుండా ఉండటం.  పరమేశ్వుడు ఇతర దేవతలకు అయినా,  తన భక్తులకు అయినా ఎలాంటి వివక్ష చూపడు. ఆఖరికి భక్తిగా ఉంటే రాక్షసులకు కూడా వరాలు ఇచ్చేయగల కరుణామూర్తి పరమేశ్వరుడు. అందరి పట్ల సమాన భావం కలిగి ఉండటం,  అందరినీ సమాన దృష్టితో చూడటం పరమేశ్వరుడి నుండి తప్పక నేర్చుకోవాలి.

ప్రశాంతత..

పరమేశ్వరుడు లయకారుడు. సమస్తం ఆయనలో లయం కావాల్సిందే.. ఆయనలో రౌద్రం కూడా ఉంది. కానీ అది బయటపడదు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ధ్యానంలో ఉంటాడు.  పరమేశ్వడి తల మీద ఉండే చంద్రుడు శాంతిని,  చల్లదనాన్ని కురిపిస్తూ ఉంటాడు.  సాధారణ వ్యక్తులు కూడా అలాంటి ప్రశాంతతను అలవాటు చేసుకుంటే చాలా గొప్ప మార్పులు జీవితంలో చోటు చేసుకుంటాయి.

                        *రూపశ్రీ.