Read more!

కనుమ రోజు పాటించే కొన్ని సంప్రదాయాలు వాటికి గల కారణాలు!

 

కనుమ రోజు పాటించే కొన్ని సంప్రదాయాలు వాటికి గల కారణాలు!

మూడు రోజుల సంక్రాంతి పండుగలో భోగి, సంక్రాంతి, కనుమ వరుసగా వస్తాయి. వీటిలో మూడవ రోజైన కనుమ పండుగకు ఉన్న ప్రత్యేకత గొప్పది. మొదటి రెండు రోజులు ఒక ఎత్తు అయితే.. మూడవ రోజు మాత్రం వాటికి భిన్నంగా కేవలం పశువుల కోసం మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునేది. సాధారణంగానే సంక్రాంతి పండుగ అంటే రైతన్నల కష్టానికి ఫలితంగా పంటలు చేతికొచ్చి అవి ఇంటికి చేరి, ఇంటికి కొత్త కళ తీసుకువచ్చే పండుగ. ఇంటింటా కొత్త ధాన్యం, కొత్త బెల్లం, కొత్త బియ్యం, చెరకు ఇలా అన్నిరకాలు కొత్తగా రైతుల ఇంటికి, మార్కెట్లలోకి వచ్చి చేరతాయి. అవే ప్రతి ఇంటికి కొత్తదనాన్ని తీసుకొస్తాయి. 


ఇకపోతే  మూడవ రోజు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. రైతన్నలు కష్టపడి పంట పండించడంలో, ఆ పంట ఇంటికి చేరడం వరకు వారికి తోడుగా ఉండేవి పశువులు.  పొలం దున్నడంతో మొదలుపెట్టి, పంట ఇంటికి వచ్చే వరకూ అంటే పంటను మోసుకురావడానికి కూడా పశువులే రైతులకు సహాయపడతాయి.  అందుకే వాటికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి సంక్రాంతి తరువాతి రోజును కేటాయించారు. రైతుల వెన్నంటి ఉండే  మూగ జీవాలని పూజించడానికే పశువుల పండుగ. కనుమ పండుగ రోజు ఉదయం పశువులను దగ్గరలో ఉన్న చెరువు, కాలువలు, బావులు మొదలైన ప్రాంతాలకు తీసుకెళ్ళి, శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూలదండ వేసి అలంకరణ చేస్తారు. 


పశువులను దైవ సమానంగా భావించి పూజ చేస్తారు. పిండి వంటలు చేసి వాటికి తినిపిస్తారు. మరీ ముఖ్యంగా  అరిసెలు తినిపిస్తారు. ఆవులకూ, దూడలకూ పులగం వండి పెడతారు. పాతకాలం నుండి  కొన్ని సామెతలు ప్రచారంలో ఉంటూ వస్తుంటాయి. వాటిలో 'కనుమ నాడు మినుము కొరకాలి, లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడు' అంటారు. అంటే కనుమ పండుగ రోజు మినప్పప్పుతో గారెలు చేసుకుని తినాలి లేకపోతే యముడు యమలోకంలో శిక్షగా ఇనుము కొరిస్తాడు అని అర్థం. అందువల్ల కనుమ పండుగ రోజు  మినప గారెలు చేస్తారు. అలాగే ప్రజల వాడుకలో  ఉన్న మరొక సామెత 'కనుమ నాడు కాకి కూడా మునుగుతుంది' అని.  అంటే కనుమ పండుగ రోజు సముద్రం, నది, కాలువ ఇలా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని అంటారు. ఇవన్నీ అందుబాటులో లేకపోయినా కనుమ పండుగ రోజు ఉదయాన్నే తప్పని సరిగా తల స్నానం చేస్తారు.


ఇవి మాత్రమే కాకుండా   కనుమ పండుగరోజు ఎవరూ, ఎక్కడికీ ప్రయాణం చేయరు. నిజానికి ఈ ప్రయాణాలు  చేయకపోవడం వెనుక ఒక సమంజసమైన కారణమే ఉంది. ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే అందరికీ ఎడ్ల బండ్లు గతి. కనుమ పండుగ రోజు పశువులకు అన్ని రకాల సపర్యలు చేసి మంచి ఆహారం పెట్టి, వాటికి విశ్రాంతి ఇస్తారు. అలాంటిది మళ్ళీ వాటిని బండ్లకు కట్టి ప్రయాణాలు చేసి వాటిని కష్టపెట్టడం తగదు కదా.. ఈ కారణం వల్లనే ప్రయాణాలు చేసేవారు కాదు. ఇవి మాత్రమే కాకుండా  ఎన్నో ఆచారాలు, అలవాట్లతో సంక్రాంతి పండుగలో మూడవరోజు అయిన కనుమ పండుగ జరుపుకుంటారు.