Read more!

పొంగలి కుండల పొంగులు!!

 

పొంగలి కుండల పొంగులు!!

ప్రతి ఇంట్లో ఉత్సాహాన్ని ఇచ్చేవాటిలో ఆహారపదార్థాలు కూడా ఉంటాయి. ఇక పండుగ అంటే ఇంట్లో ఘుమఘుమల సందడే వేరు. అయితే ప్రతి పండుగకూ కొన్ని ఆహారపదార్థాల ప్రత్యేకం ఉన్నట్టు సంక్రాంతి పండుగకు కూడా పిండివంటలు ప్రత్యేకమే. 

నువ్వులు, కొత్త బెల్లం, చెరకు, రేగుపళ్ళు, అనపగింజలు( వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అంటారు. అనుములు అంటారు). గుమ్మడి కాయ. ఇవన్నీ ప్రతి చోటా కనిపించే సాంప్రదాయపు సొగసులు. ఇవి కాకుండా ఇంటి ఆర్థిక స్థాయిని బట్టి భక్ష్యాలు, గారెలు, బూరెలు, కుడుములు, పులిహోర, పాయసం ఇలా ఇల్లంతా తీపి సువాసనలతో  అధిపోవాల్సిందే.

అయితే సంక్రాంతికి మాత్రం ప్రతి ఇంట్లో కనిపించే సాంప్రదాయపు సంతోషాల పొంగు పొంగలి కుండ. కొత్త కుండలో, పాలు, బెల్లం, బియ్యం, చెరకు పాలు (చెరకు రసం), వేసి వండే పొంగలి అంటే ఇల్లంతా పొట్లాడుకుని మరీ తినేసేంత రుచిని మరియు సంతోషాన్ని కలగలుపుకున్న  కమ్మని కుండ అది.

ఈ కుండ వెనుక ఓ కారణం ఉంది మరి!!

సంక్రాంతి పండుగ వచ్చే సమయానికి చాలావరకు పంటలు పండి, ధాన్యం రైతుల ఇళ్ళకు చేరుతుంది. అలాగే చెరకు పంటలు విరివిగా కాస్తాయి,  రేగుచేట్లు పండ్లతో కళకళలాడుతుంది. చెరకు పంట ఫ్యాక్టరీలకు, బట్టీలకు చేరి బెల్లం తయారవుతుంది. కొత్త కుండలో ఆవు పాలు పొంగిస్తే ఇంటికి మంచిది. సంవత్సరం అంతా ఆ ఇంటికి సంతోషాన్ని కలుగజేస్తుందని నమ్ముతారు. పాలు పొంగిన అదే కుండలో కొత్త బెల్లం, చెరకు పాలు, కొత్త బియ్యం వేసి పొంగలి వండుతారు. 

నిజానికి ఆంగ్ల సంవత్సరం, తరువాత తెలుగు వారి సంవత్సరం జనవరి 1, మరియు ఉగాధితో మొదలైనా. రైతు ఇంటికి పంట చేరి, ఆర్థికంగా సంతోషంగా ఉండే సమయం కావడం వల్ల మరియు చలిగాలులు తగ్గి సూర్యుడి వెలుగులు పెరిగే సమయం ప్రారంభం అవ్వడం వల్ల సంక్రాంతే నిజమైన సంబరాన్ని మోసుకొచ్చే పండుగ అని చాలామంది అభిప్రాయం. బహుశా అదే నిజం కావచ్చు కూడా.

ఇకపోతే ప్రతి ఇంట్లో పొంగలి కుండల తీపిలో ఆ ఇంటి మొత్తం సంతోషం దాగుంటుందని కూడా అభిప్రాయ పడతారు. 

ఇక సంక్రాంతి విషయంలో ఆసక్తికరమైన విఆహాయం ఒకటి ఏమిటంటే సూర్యుడు ఒకరాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. అలా చూస్తే పన్నెండు రాశుల పరంగా చూస్తే పన్నెండు సంక్రాంతులు, ఆ పన్నెండు సంక్రాంతులను నాలుగు భాగాలుగా విభజిస్తారు. 

అవి:- 

ఆయన సంక్రాంతులు

విఘవ సంక్రాంతులు

షడశీతి సంక్రాంతులు

విష్ణుపదీ సంక్రాంతులు.

ఉత్తరాయణంలో మఖరసంక్రాంతి, దక్షిణాయణంలో కర్కాటక సంక్రాంతి వస్తాయి.

విఘవ సంక్రాంతులు వచ్చే కాలంలో రాత్రి, పగలు సమానంగా ఉంటుంది.

ధనుర్మాస సంక్రాంతులను షఢశీతి సంక్రాంతులు అంటారు.

వృశ్చిక, కుంభ, సింహ, వృషభ రాశులలో వచ్చే సంక్రాంతులు విష్ణుపదీ సంక్రాంతులు.

అయితే ఉత్తరాయణ ప్రారంభం సూర్యుడి వెలుగు పెరుగుతూ అందరికీ ఓ కొత్తదనాన్ని ప్రసాదిస్తుంది. అలాగే పైన చెప్పుకున్నట్టు జీవితాల్లో చోటుచేసుకునే కొత్తదనం సంక్రాంతి పండుగ వచ్చే మాసంలోనే ఎక్కువగా ఉంటుంది. 

ప్రతిదాన్నీ సాంప్రదాయతలో భాగంగా గౌరవించే మన భారతీయ సనాతన ధర్మంలో ఈ కొత్తదనం తాలూకూ వెలుగులను పండుగ సంబరంగా చేసుకోవడం పరిపాటి. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆడపిల్లల సంబరమంతా ఇంటి ముంగిట్లో ముగ్గులోనే కనబడుతుంది. ఎంతో సృజనాత్మకతను వెలికి తీసే పండుగగా కూడా సంక్రాంతిని పేర్కొనచ్చు. ముగ్గుల పోటీలు, ఎద్దుల బండ్ల పోటీలతో ఊర్లన్నీ సందడే సందడి అంటూ కలకళలాడతాయి. అంతేనా ఇంటి ముంగిట్లో రంగురంగుల ముగ్గులు, ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల మీద గుమ్మడి పూలు. 

పల్లెల్లో అయితే ముగ్గు చుట్టూ ఆడపిల్లలు గుంపుగా చేరి మధ్యలో ఉన్న గొబ్బెమ్మను చూస్తూ చప్పట్లు కొడుతూ వలయాకరంలో తిరుగుతూ గొబ్బీయళ్ళో గొబ్బీయళ్ళో అంటూ పాటలు పాడుతూ సాంప్రదయతను, జానపదాలను కూడా గుర్తు తెచ్చుకుంటారు. 

అలాగే ఫాషన్ ల మోజులో పడి రకరకాల బట్టలు వెదుకునే నేటి యువత కూడా  పండుగంటే పట్టుబట్టలతో సందడి చేస్తుంది. పంచెలు కట్టి కుర్రాళ్ళు హంగామా చేస్తే, పట్టు పావడాలు, లంగా ఓణీలు, పట్టు చీరలతో అమ్మాయిలు పండుగను మోసుకుని తిరుగుతుంటారు. 

ఇలా పొంగలి కుండలో పొంగు వచ్చినంత ఆనందం ప్రతీ ఇంట్లో కలగాలని కోరుకుందాం.

◆ వెంకటేష్ పువ్వాడ