Read more!

పుణ్యకాల ప్రారంభానికి ఇదే ఆహ్వానం!!

 

పుణ్యకాల ప్రారంభానికి ఇదే ఆహ్వానం!!

సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః'  అని శ్లోకం. అంటే.. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.


కర్కాటకం నుండి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభిముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'దక్షిణాయణం' అ'ని అంటారు. మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరాభిముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'ఉత్తరాయణం' అ'ని అంటారు.


ఈ ఉత్తరాయణం, దక్షిణాయణం కాలాల గురించి కూడా కాస్త ఆసక్తికరమైన విశేషం ఉంది. దేవతలకు ఉత్తరాయణం ఉత్తమకాలమనీ, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యకాలమనీ భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకే అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యుడు తన ప్రాణాలను వెంటనే వదిలేయకుండా  ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి ఉన్నాడని మహాభారతం ఎంతో స్పష్టంగా చెబుతోంది. ఇదీ వేష్టి విశిష్టత. ఇకపోతే సంక్రాంతి పండుగ సకల జనులకు ఎంతో ఇష్టమైన పండుగ. మరీ ముఖ్యంగా రైతన్నలు ఎంతో సంబరంగా ఉండే పండుగ. దీన్ని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుచుకుంటూ జరుపుకుంటారు. 


సంక్రమణం రోజు ఇంటి ముంగిట అలికి, రంగు రంగులతో మేళవించి పిండితో ముగ్గులు పెట్టి అలంకరణ చేసి, గోమయంతో గొబ్బిళ్ళు చేసి, వాటిలో రంగు రంగుల పూలనూ, నూలు బియ్యాన్నీ, రేగుపండ్లనూ పెట్టి ఇళ్ళను అలంకరించుకుంటారు.


సంక్రాంతి పండుగనాడు అనేక రకాల  కూరలన్నింటిని కలిపి వండుతారు. ఆ రోజు బ్రాహ్మణులకు కూర గాయలనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇస్తారు. దీన్ని స్వయంపాకం అని కూడా అంటుంటారు. 


నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి, పుష్పాలు సమర్పించి, అంజలి ఘటించి, గాయత్రీ మంత్రం జపిస్తూ, సద్బుద్ధి, జ్ఞానం, ఉత్సాహభరితమైన, ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలతో ఇవి చేయించడం ముఖ్యం. వారికి ఈ పద్ధతులను అలవాటు చేస్తుందం వల్ల క్రమశిక్షణ పెంపొందుతుంది. 


ఇంకా ఈరోజు  పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. మన పెద్దలు, మన వెనుక తరం వారు ఎవరైనా ఏదైనా మొక్కు మొక్కుకుని ఉంటే ఆ మొక్కుబడులూ, వారు ఏదైనా అనుకుని ఉంటే మంచి ఆశయాలూ, ఆశలూ, ప్రతిజ్ఞలూ తీర్చాలి. దీనివల్ల వారు సంతృప్తి చెందుతారు. 


నువ్వుపప్పు, బెల్లం కలిపి, 'లడ్డు'లు తయారు చేసి, బంధుమిత్రులకు పంచిపెట్టాలి. అలా చేయడం వల్ల సంకుచిత మైన భావాలు పోయి, అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి.


ఇక సంక్రాంతి పండుగ గురించి శాస్త్రీయంగా చెప్పుకుంటే.. సంక్రాంతి శీతకాలంలో వస్తుంది. కాబట్టి ఆరోజు ఉష్ణాన్నిచ్చే నువ్వులు, నెయ్యి, కంబళ్ళు పేదలకు దానం చేయడం పుణ్యదాయకం.


                                  ◆నిశ్శబ్ద.