Read more!

సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి? మూడు రోజుల పండుగను ఎలా జరుపుకుంటారు..!

 


సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి? మూడు రోజుల పండుగను ఎలా జరుపుకుంటారు..!

నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. ఈ పండుగను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి. ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగగ ఎలా జరుపుకుంటున్నారో..పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు. కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు ఉండటం చాలా అరుదు.

సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకు అయ్యింది?

సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అంతేకాదు ప్రక్రుతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు.

నువ్వుల ప్రత్యేకత గురించి?

సంక్రాంతి పండగ రోజు చేసే పిండివంటన్నీంటిలోనూ నువ్వులు ఉపయోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేస్తుంటారు. కొందరు నువ్వులను శనిదేవునికి రూపంగా భావిస్తారు. చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయాల్లో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు. నువ్వుల వాడకం వెనక ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి. నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది. అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వినియోగించరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లవుతుంది.

ముగ్గులు:

సంక్రాంతికి రకరకాల ముగ్గులు లోగిళ్ల ముందు దర్శనమిస్తాయి. రంగు రంగుల రంగవల్లికలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. గాలిపటాలు, గొబ్బిల్లు, ఇలా సంక్రాంతికి ఎన్నో పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఎక్కడ చూసిన వాకిళ్లలో ముగ్గులు దర్శనమిస్తుంటాయి. హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు, ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు. వీళ్లందరికీ తోచినంత సాయం చేస్తే ఆ భగవంతుడికే సాయం చేసినట్లుగా భావిస్తారు.

2024 సంక్రాంతి జరుపుకునే తేదీలు:

భోగి - జనవరి 14 ఆదివారం
సంక్రాంతి- జనవరి 15 సోమవారం
కనుమ- జనవరి 16 మంగళవారం
ముక్కనుమ - జనవరి 17 బుధవారం