Read more!

జీవన్ముక్తులు ఎలా ఉంటారు?

 

జీవన్ముక్తులు ఎలా ఉంటారు?

ఒకసారి ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత అటువంటి వారికి ఈ ప్రపంచంలో చేయవలసినపని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కర్మలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. చేయడం వలన ప్రయోజనం కానీ, చేయక పోవడం వలన నష్టం కానీ ఏమీ ఉండవు. అటువంటి జీవన్ముక్తుడు నిర్వికారంగా ఉంటాడు. ఎందుకంటే అతడు ఆత్మయందే తృప్తిని పొందుతున్నాడు. అతడికి కావాల్సింది అంటూ ఏమీ లేదు. కొత్తగా సాధించేది ఏమీ లేదు. లోకోపకారార్ధం కర్మలు చేస్తాడు. లేకపోతే లేదు. అతడికి కర్మలు చేయాలి అన్న నిబంధన ఏమీ లేదు. అటువంటి వాడు ఈ ప్రపంచములో ఎవరినీ ఆశ్రయించడు. ఎవరి ఆశ్రయమూ అతడికి అక్కరలేదు. అతడు ఎవరి మీదా ఆధారపడడు.

సామాన్య మానవులు ప్రాపంచిక విషయములు కావాలని కోరుకుంటూ, వాటి కోసం కర్మలు చేస్తూ, అవి దొరికితే తృప్తిపడుతుంటారు. జీవన్ముక్తులు కేవలం తమలో తాము తృప్తిపడుతుంటారు. ప్రాపంచిక విషయముల మీద ఏ మాత్రము ఆసక్తి చూపరు. అటువంటి స్థిత్రపజ్ఞుడికి జీవన్ముక్తుడికి ఈ ప్రపంచంలో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కోటికి ఒకరు ఉంటారు. మిగిలిన వారందరూ తమకు విధించిన కర్మలు చేయవలసినదే. ఆత్మయందే రమించేవారు, ఆత్మయందు తృప్తి పొందేవారు, ఏ కర్మలను చేసినా చేయనట్టే ఉంటారు. కాని వారిని చూచి సామాన్య ప్రజలు కూడా వారిలా ఉందామని అనుకోవడం చాలా పొరపాటు. 

ఎలాగంటే, ఒక ఉపాధ్యాయుడు జీవితాంతం విద్యార్థులకు పాఠాలు చెప్పి, వారిని సన్మార్గంలో పెట్టి, ప్రయోజకులను చేస్తాడు. తుదకు వయసు మీదపడగానే రిటయిర్ అవుతాడు.  పెన్షన్ తీసుకుంటూ సుఖంగా జీవిస్తాడు. అటువంటి వారిని చూచి, ఆయన ఊరికే పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఉన్నాడు, మేముకూడా అలాగే పనీపాటా లేకుండా సుఖపడతాము అని విద్యార్ధులు యువకులు అనుకుంటే వారి జీవితం కష్టాలపాలవుతుంది. రిటయిర్ అయిన తరువాత కూడా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సాయం చేయాలనే కోరికతో ఉచితంగా విద్యాబోధన చేస్తుంటారు. దాని వలన వారికి ఎటువంటి బంధములు అంటవు.

కాబట్టి అందరూ కర్మలు ఆచరించాలి. కర్మలు వదిలిపెట్టకూడదు. నిష్కామ కర్మలు ఆచరించడం ద్వారా జ్ఞానము సంపాదించి దాని తరువాత మోక్షమునకు అర్హులవుతారు. ఆ స్థితిని పొందిన తరువాత, వారు కర్మలు చేసినా చేయకపోయినా ఒకటే. ఎటువంటి స్వార్ధబుద్ధి లేకుండా, లోక కల్యాణం కొరకు వారు చేసే కర్మలను తప్పుపట్టకూడదు. కాని ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాపంచిక విషయములలోనూ, విషయవాంఛలలోనూ మునిగి తేలుతున్నారు. చేయవలసిన కర్మలను వదిలిపెట్టి చేయకూడని కర్మలు చేస్తున్నారు. తాము చేసిన కర్మలతో కూడా వారు తృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని నిరంతరం ఆరాటపడుతుంటారు. దాని వలన వారికి ఏ లాభమూ లేకపోగా బంధనములు వాసనలు చుట్టుకుంటాయి. ఎవరైతే బాహ్య ప్రపంచములో లభించే సుఖములు నిజం కావు నిజమైన సుఖం ఆత్మానందమే అని అనుకుంటారో అప్పుడే వారికి విముక్తి. అప్పటి వరకూ విద్యుక్త కర్మలు ఇతరులకు ఉపయోగించే కర్మలు నిష్కామకర్మలు చేయాల్సిందే.

                               ◆ వెంకటేష్ పువ్వాడ.