Read more!

శిష్యుడికి ఉండాల్సిన ఖచ్చితమైన గుణం!

 

శిష్యుడికి ఉండాల్సిన ఖచ్చితమైన గుణం!

కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః। 
యత్రేయః స్యాన్నిశ్చితం బ్రూహితన్నే శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రసన్నమ్|| 

కృష్ణా! ఇంక లాభం లేదయ్యా! పిరికితనం నన్ను బాగా ఆవహించింది. నా స్వభావసిద్ధమైన క్షాత్రధర్మాన్ని నా పిరికితనం కప్పివేసింది. నా మనసు దయ, జాలి, కరుణ, పిరికితనం అనే క్షత్రియ విరుద్ధమైన ధర్మాలతో గిలా గిలా కొట్టుకుంటూ ఉంది. ధర్మం ఏదో, అధర్మం ఏదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏమీ తేల్చుకోలేక పోతున్నాను. అంతా అయోమయంగా ఉంది. మనసంతా వికలమయింది. నా బుద్ధి పనిచేయడం మానివేసింది. నా బుద్దికి ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నశించింది. ఈ సమయంలో నీవే నాకు దిక్కు. నన్ను నీ శిష్యుడిగా భావించి నాకు ఏది శ్రేయస్కరమో ముందు నీవు నిశ్చయం చేసుకొని తరువాత ఆ మార్గం నాకు చూపించు. నేను నీ మాట జవదాటను. నీవు చెప్పినట్టు చేస్తాను. నేను నీ శరణు వేడుతున్నాను. నీకు పూర్తిగా శరణాగతుడను అయ్యాను. నాకు కర్తవ్యం ఉపదేశించి. ఈ సందిగ్ధం నుండి బయట పడెయ్యి. అని అన్నాడు అర్జునుడు.

అప్పటి దాకా అర్జునుడు తనకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడాడు. కృష్ణుడు ఆ మాటలను ఖండించలేదు మౌనంగా విన్నాడు. ఎందుకంటే అర్జునుడు అడగంది తాను చెప్పడం ఎందుకని మౌనం పాటించాడు. తాను ఎంత చెప్పినా కృష్ణుడు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తనకు కర్తవ్యం ఉపదేశించలేదు, ఇంక ఇలా లాభంలేదు అనుకొన్న అర్జునుడు నీవే తప్ప నిత:పరం బెరుగ అనే రీతిలో కృష్ణుని శరణాగతి పొందాడు.

ఎవరికైనా ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నా పరమాత్మను శరణాగతి పొందితే మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అర్జునుడు కృష్ణుని శరణాగతి పొంది తనకు కర్తవ్యమును ఉపదేశించు అని వేడగానే, కృష్ణుడు గురుస్థానం వహించి మాట్లాడటం మొదలు పెట్టాడు. దానికి మూలం, ముందు అర్జునుడు "నన్ను నీ శిష్యునిగా అంగీకరించి నాకు కర్తవ్యబోధ చెయ్యి" అని వేడుకోవడమే. అంటే శిష్యుడు గురువు దగ్గరకుచేరి తనకు జ్ఞానబోధ చేయమని అడగాలి. అప్పుడే గురువు శిష్యుని ఆదరిస్తాడు. జ్ఞానబోధ చేస్తాడు. కృష్ణుడు అదే పని చేసాడు.

ఈ శ్లోకంలో "ఉపహత స్వభావః" అని వాడారు. అంటే ప్రతి మనిషికి స్వభావసిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి. అర్జునుడికి క్షత్రియగుణం స్వభావసిద్ధము. ఆ స్వభావసిద్ధమైన గుణములను అజ్ఞానం కప్పివేస్తుంది. ఇక్కడ అర్జునుడికి స్వభావ సిద్ధమైన క్షాత్రమును, తానే అందరినీ జయిస్తాను అన్న అహంకారము, తనవలన అందరూ చస్తారు అన్న దీనత్వము, కృపణత్వము, యుద్ధం చేయడం కన్నా అడుక్కుతినడం మేలు అన్న పిరికితనము, తన వల్ల అందరూ నరకానికి పోతారు అన్న భయమనే అజ్ఞానము కప్పివేసింది. ఆ అజ్ఞానమును తొలగించి తిరిగి అర్జునునకు తన కర్తవ్యమును బోధించాడు కృష్ణుడు.

ఇదీ గురుశిష్యుల బంధము. శిష్యుడు తనకు ఏమీ తెలియదు అనే భావనతో గురువును ఆశ్రయించాలి. అంతేకానీ "ఈయనకే తెలియదు నాకే చెబుతాడు" అనే భావనతో గురువును ఆశ్రయించకూడదు. ఈ నాటి విద్యార్థులు ఈ విషయం, ముఖ్యంగా తెలుసుకోవాలి. "ఆ లెక్చరర్ బాగా చెప్పడురా బాబూ. అసలు ఆయనకే రాదు మనకేం చెబుతాడు. ఆయన క్లాసుకు వెళ్లడం దండగ" అని విద్యార్థులు అనుకోవడం మనం వింటూ ఉంటాము. అది తప్పు. “తనకు ఏమీ తెలియదు. తనకు తెలియని విషయాలను గురువు దగ్గర నేర్చుకోవాలి" అనే భావన ప్రతి విద్యార్ధికి ఉండాలి. అంతేకానీ, “గురువుకే ఏం రాదు" అనే భావన ఉంటే, ఆయన చెప్పేది ఉండదు. ఈయన నేర్చుకునేది ఉండదు.

ప్రస్తుతం అర్జునుడు శిష్యుడు. కృష్ణుడు గురువు. కృష్ణుడు అర్జునుడికే కాదు ఈ జగత్తుకే గురువు, జగద్గురువు. ఈ గురువు చేసిన ఉపదేశమే భగవద్గీత.

                              ◆వెంకటేష్ పువ్వాడ.