Read more!

అద్భుతమైన ఘృశ్మేశ్వర లింగ వృత్తాంతం!

 

అద్భుతమైన ఘృశ్మేశ్వర లింగ వృత్తాంతం!

పరమశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో  ఘృశ్మేశ్వర లింగము ముఖ్యమైనది. దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. 

పూర్వకాలంలో దేవగిరికి సమీపంలో 'సుధర్ముడు' అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగ విదుడు, ధర్మపరుడు, ఇతని భార్య 'సుదేహ'.

 ఈ దంపతులకు సిరిసంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కాని సంతానం మాత్రం లేదు. ఒక రోజున సుధర్ముని ఇంటికి బ్రహ్మజ్ఞానియైన యతీశ్వరుడు ఒకడు వచ్చాడు. భార్యాభర్తలు యతీశ్వరుడికి స్వాగత సత్కారాలు చేశారు. మధ్యాహ్న కాలమైంది. యతీశ్వరుడు బిక్ష స్వీకరించబోతూ సుదర్ముడితో 'నీకెందరు పిల్లలు' అన్నాడు. బ్రాహ్మణ దంపతుల నోటమాట రాలేదు. అనుకోని ఈ ప్రశ్నకు నిరుత్తరులైపోయారు. కొంతసేపటికి తెప్పరిల్లి తాము సంతానహీనులము అని చెప్పారు. అప్పుడు ఆ యతీశ్వరుడు పీట మీద నుంచి లేచిపోయాడు. దంపతులు అతన్ని బ్రతిమిలాడారు.

 "స్వామీ! సంతానహీనులమైన మాకు సద్గతులు లేవు. మీరు సిద్ధాన్నము కూడా వదిలి వెదతారా?" అని వాపోయారు. దానికి యతీశ్వరుడు కరుణించి కొంత కాలానికి మీకు సంతానము కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.

సుదేహ ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది. వివాహానికి ముందే జాతకులు నీకు సంతాన యోగం లేదని చెప్పారు. విషయం చెప్పకుండా సుధర్ముడికిచ్చి పెండ్లి చేశారు. సుదేహ ఇప్పుడా విషయాన్ని తన భర్తకు వివరించి తన చెల్లెలు "ఘశ్మ"ను వివాహమాడి సంతానాన్ని పొందమని చెప్పింది. సుధర్ముడు అందకు ఒప్పుకోలేదు. చివరకు భార్య బలవంతం మీద రెండవ వివాహానికి అంగీకరించాడు.

ఘష్మ పరమ పతివ్రత. తన అక్క సుదేహను తల్లిలాగా, భర్తను దైవంలాగా చూసుకునేది. ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది. అచిరకాలంలోనే గర్భవతి అయి ఒక మగశిశువును ప్రసవించింది. పిల్లవాడు దినదినాభివృద్ధి పొందుతున్నాడు.

ఇలా కొంతకాలం జరిగింది. సుదేహలో మార్పు వచ్చింది. చెల్లెలి మీద ఈర్ష్య, పిల్లవాడిపై ద్వేషము పెరిగాయి. క్రమంగా ఆమె వాటికి బానిస అయిపోయింది. సంతానము కలగటం చేతకదా నా చెల్లెలికి ఇంత మర్యాద, మన్నన. ఆ సంతానం లేకపోతే ఇద్దరం ఒక్కటే కదా?'' ఈ రకంగా ఆలోచించటం మొదలు పెట్టింది.

ఒక రోజు రాత్రి నిద్రపోతున్న పసివాడి గొంతు కోసి చంపేసింది. తలను మొండేన్ని వేరుచేసి దగ్గరనే ఉన్న చెరువులో పారేసి ఏమీ ఎరుగని దానిలాగా ఇంటికి వచ్చి పడుకుంది. మర్నాటి ఉదయాన్నే లేచి మళ్ళీ చెరువులో స్నానం చెయ్యటానికి వెళ్ళింది. పసివాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్ళు పట్టుకుని "అమ్మా! నేను చచ్చి మళ్ళీ బ్రతికినట్లు కలగన్నాను" అన్నాడు.

 ఘశ్మ అవాక్కయిపోయింది. చిన్నపిల్లవాడు కలగనటము ఏమిటి? చెరువులో నుంచి ఈదుకు రావటమేమిటి? అంతా వింతగా ఉన్నది అనుకుంటూ పిల్లవాణ్ణి తీసుకుని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది. త్రోవలో ఆమెకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై "సాధ్వీ! నీ అక్క సుదేహ, నీ పిల్లవాడి గొంతు కోసి చంపింది. నీవు నా భక్తురాలవు కాబట్టి, ఆ పిల్లవాడిని నేను మళ్ళీ బ్రతికించాను. ఇప్పుడు సుదేహను శిక్షిస్తాను" అన్నాడు. 

ఘశ్మ పరమేశ్వరుని పరిపరివిధాల స్తుతించి "దేవదేవా! మానవులు పాపపు పనులు చెయ్యటానికి పాడు బుద్ధే కారణము, లోక రక్షకుడవు, దయామయుడవు కాబట్టి మా అక్కకు మంచి బుద్ధిని ప్రసాదించు" అని వేడుకుంది.

ఆ మాటలకు శివుడు ఎంతో ఆనందించి "అమ్మా! నువ్వు కోరినట్లే చేస్తాను. అంతేకాదు పాపులను, దుర్మార్గులను కూడా క్షమించగలిగే మంచితనమున్న నీ పేరున "ఘృశ్మేశ్వరుడు" అనే పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగముగా వెలసి భక్తులను రక్షిస్తుంటాను" అన్నాడు. ఈ రకంగా ఘృశ్మేశ్వర లింగము వెలసింది. దీన్ని పూజించినవారికి పుత్రశోకము కలుగదు. ఇదీ ఈ జ్యోతిర్లింగ వృత్తాంతం.

                                    ◆నిశ్శబ్ద.