హనుమంతుడి నుండి ఈ మూడు విషయాలు నేర్చుకుంటే  జీవితం ఎంత బాగుంటుందో..!

 

హనుమంతుడి నుండి ఈ మూడు విషయాలు నేర్చుకుంటే  జీవితం ఎంత బాగుంటుందో..!

 


హనుమంతుడు మహాబల సంపన్నుడు. ఆయన శక్తి, ఆయన యుక్తి, ఆయన పరాక్రమం అమోఘం.  హనుమంతుడిని వాక్యకోవిదుడు అని అంటారు.  అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మాట్లాడాలో బాగా తెలిసినవాడు.  దీన్ని నేటి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మాట చాతుర్యం అని అనవచ్చు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ఎదుటివారు నొచ్చుకోకుండా,  అపార్థం చేసుకోకుండా,  పరిస్థితిని బట్టి చెప్పడంలో హనుమ సాటి అని చెప్పవచ్చు.  వేదాలు, శాస్త్రాలు చదివిన వాడు.. స్వయానా సూర్యుడే ఆయన గురువు.  అష్టసిద్దులు పొందినవాడు,  చిరంజీవిగా వరం పొందిన వాడు. ఇలాంటి హనుమ కూడా రామ భక్తుడు,  రామ బంటు అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు. అదే ఆయనలో ఉండే ప్రత్యేకత.  హనుమంతుడి జీవితం నుండి మూడు విషయాలు నేర్చుకుంటే ప్రతి వ్యక్తి జీవితం ఎంతో బాగుంటుంది. జీవితంలో చాలా గొప్ప మార్పు కనిపిస్తుంది.  అవేంటో తెలుసుకుంటే..

సమస్య కాదు.. పరిష్కారమే ముఖ్యం..

జీవితంలో పరిష్కారం స్పష్టంగా లేనప్పుడు కూడా, వదులుకోవడానికి బదులుగా ప్రత్యామ్నాయం కోసం వెతకాలని హనుమంతుడు  చెప్పకనే చెబుతాడు. లక్ష్మణుడు  మూర్ఛపోయినప్పుడు,  ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి సంజీవని మూలిక అవసరమైనప్పుడు, హనుమంతుడు ఆ మూలికను గుర్తించలేకపోయాడు. వేరే ఎవరైనా అయితే వెనక్కు వెళ్లిపోయేవారు కానీ హనుమంతుడు మాత్రం  మొత్తం పర్వతాన్ని ఎత్తి తీసుకెళ్లాడు. దీనివల్లే లక్ష్మణుడు బ్రతికాడు.  ఇది అతను కేవలం  లక్ష్మణుడి పరిస్థితి ఉదాహరణగా చూపి చెప్పే విషయం కాదు..  ఎలాంటి పరిస్థితిలో అయినా పరిష్కారాలను కనుగొన్న యోధుడిగా హనుమంతుడిని చెప్పుకోవచ్చు. ఈ గుణం నేటి కాలంలో  చాలా సందర్భోచితంగా ఉంటుంది. పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు, ఏడవడం కాదు, ఒక మార్గాన్ని కనుగొనాలి.

వినయం..

హనుమంతుడిలో ఉండే అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ తన బలం, తెలివితేటలు లేదా శౌర్యం గురించి గొప్పలు చెప్పుకోలేదు. సీతామాతను కలిసిన తర్వాత సురక్షితంగా తిరిగి వచ్చి లంకలో తన అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శించినప్పుడు కూడా ఆయన తనను తాను ప్రశంసించుకోలేదు. తన విజయాలన్నికీ  రాముడి ఆశీర్వాదాలే కారణమని ఆయన చెప్పుకుంటాడు. నిజంగా గొప్ప వ్యక్తి అంటే తన విజయాల గురించి గొప్పలు చెప్పుకోనివాడు,  ఎల్లప్పుడూ వినయంగా ఉండేవాడు.  ఈ వినయమే వ్యక్తిని ఉన్నతంగా నిలబెడుతుంది.

నాయకత్వ లక్షణం..

సముద్రం మీద వంతెన నిర్మించడం నుండి యుద్ధంలో వానర సైన్యాన్ని నడిపించడం వరకు, హనుమంతుడు  తన ప్రత్యేకమైన  నైపుణ్యాలను,  నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించాడు. వానర సైన్యానికి  క్రమశిక్షణ తక్కువ. అలాంటిది  హనుమంతుడు  తన సహనం, ధైర్యం,  వ్యూహంతో అందరినీ ఒకే లక్ష్యం కోసం తాను ముందుండి నడిపించాడు.  నిజమైన నాయకుడు అంటే ఎలాంటి వ్యక్తుల నుండి అయినా సరే..  పనిని పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టు  ధైర్యాన్ని కాపాడుకుని,  అందరినీ ఏకం చేసి ముందుకు  తీసుకెళ్లగలడని ఆయన బోధిస్తాడు. ఈ మూడు విషయాలను అర్థం చేసుకుని జీవితంలో పాటిస్తే వారి జీవితం కూడా ఎంతో బాగుంటుంది.

                            *రూపశ్రీ.