Read more!

భగవద్గీతలో ఆకతాయిల గురించి ఏమిచెప్పారు?

 

భగవద్గీత ఆకతాయిల గురించి ఏమి చెప్పారు?

నిహత్య ధార్తరాష్ట్రాన్లు ప్రీతిస్సా జనార్దన|

పాపమేవాశ్రాయేదస్మాన్ హాత్వైతానాతతాయినః

యుద్ధ ప్రాంతంలో ఉండి అన్నీ చూస్తున్నప్పుడు అర్జునుడిలో మోహం అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంది. ధర్మాన్ని అధర్మంగానూ, అధర్మాన్ని ధర్మంగానూ భావిస్తున్నాడు. దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడం క్షత్రియ ధర్మం, కాని దానిని మరిచిపోయి, వాళ్లు అధర్మం చేసారని మనమూ అదే పని చేస్తామా?? వారిని చంపుతామా! అని అంటున్నాడు.

ఓ జనార్దనా! నాకు తెలియక అడుగుతాను. అసలు ఈ యుద్ధం ఎందుకుచేయాలి. ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బాపుకునేదేముంది. వీళ్లను చంపితే మనకు సుఖం, ఆనందం కలుగుతుందా! లేక పుణ్యం వస్తుందా! కేవలం వీళ్లమీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్లను చంపాలా! వీళ్లను చంపి ఆ పాపం మూటగట్టుకోవాలా! అది సరేనయ్యా! కౌరవులు దుర్మార్గులు ఆకతాయిలు, ఎన్నో పాపాలు చేసారు, వాళ్లు పాపాలు చేసారని మనం చేస్తామా! వాళ్లు లక్క ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు. మా భార్యను బట్టలూడదీసి అవమానించారు. మా ధనాన్ని అపహరించారు. మా రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు. మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు. మాకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. నిజమే! ఇవన్నీ చేసారు. వీటి వలన మాకు ఎంతో నష్టం, మనస్తాపం కలిగాయి. మాలో పగ, ప్రతీకారం ప్రజ్వరిల్లింది. అంతమాత్రం చేత వీళ్లందరినీ చంపాలా? పాపం మూటగట్టుకోవాలా! ఈ పాపులను చంపితే మనకు పాపమే కానీ పుణ్యం రాదు కదా! ఏమంటావు? అని కృష్ణుడిని నిలదీసాడు అర్జునుడు. 

అధర్మాన్ని అణచవలసిన క్షత్రియుడు పోనీ పాపం అంటున్నాడు. ఇది పిరికితనం లక్షణం. ఈ పిరికితనం అర్జునుడిలో ప్రవేశించింది. తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మరిచిపోయేటట్టు చేసింది.

ఆ రోజుల్లో ఆతతాయిలు అంటే ఆరు రకములైన నేరములు చేసిన వారిని కఠినంగా దండించాలి. లేకపోతే పాపము అని ధర్మశాస్త్రము చెబుతూ ఉంది. అర్జునుడు క్షత్రియుడు. ధర్మశాస్త్రమును అమలు చేయవలసిన వాడు. దుర్మార్గులను శిక్షించవలసిన వాడు. అలా దుర్మార్గులను శిక్షించడం వలన పుణ్యమే కాని పాపంరాదు, దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవారు. కాని ప్రస్తుతము ఒక విధమైన మోహములో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రములు అన్నీ తాత్కాలికంగా మరిచిపోయాడు. వాళ్లు దుర్మార్గులు, ఆకతాయిలు అయినా వాళ్లను చంపుతామా! చంపి పాపము మూటగట్టు కుంటామా! అనే వితండవాదం చేస్తున్నాడు. పాపం కృష్ణుడు ఓపిగ్గా వింటున్నాడు. 

(ఆతతాయిలు అంటే అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్లు అని సాధారణ అర్థం. ఆతతాయిలు అని ఈ క్రింద చెప్పబడిన ఆరుమందిని అంటారు.

1. ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్లు.

2. ఇతరులకు విషం ప్రయోగంచేసేవాళ్లు.

3. ఆయుధములతో తిరుగుతూ నిరాయుధులైన ఇతరులను హింసించేవాళ్లు.

4. ఇతరుల ధనాన్ని, ఆస్తులను లాక్కునేవాళ్లు. 

5. ఇతరుల భూములను ఆక్రమించుకునేవాళ్లు.

6.ఇతరుల భార్యలను అపహరించేవాళ్లు. 

మనుస్మృతి ప్రకారం ఇటువంటి నేరాలకు మరణశిక్ష విధించేవాళ్లు. కొంచెం ఆలోచిస్తే ఇలాంటి వాళ్లు ఈ రోజుల్లో మన మధ్యనే పెద్దమనుషుల్లా రాజకీయ నాయకుల్లాగా, రౌడీలుగా, కబ్జాదారులుగా చలామణీ అవుతున్నారు. వీళ్లు చట్టాలకు, పోలీసులకు అతీతులు.)

◆ వెంకటేష్ పువ్వాడ.