సూర్యుడిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు!!
సూర్యుడిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు!!
సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఎందరు దేవతలున్నా వాళ్ళందరూ పరోక్షంగా తమ శక్తిని, తమ చల్లని చూపులను భక్తులపైన చూపిస్తారు. కానీ సూర్యుడు అందరికీ నేరుగా కనిపిస్తూనే ఉంటాడు. సూర్యుని వల్లన సంపద కలుగుతుంది అనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం పెట్టడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తే. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర ఆహార పదార్థాలను ఎలా అందిస్తుందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొంచినట్టు మనకు తెలుసు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.
ఆంజనేయుడు ఎంత శక్తి సంపన్నుడు, ఎంత తెలివైన వాడో అందరికీ తెలుసు. అలాంటి ఆంజనేయుడు కూడా సూర్యుని దగ్గరేవేద శాస్త్రాలను అభ్యసించాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఆధ్యాతికత భోదనలో ప్రస్తావించి ఇహపరాలలో ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి.
మన కర్మలను మనస్సు నియంత్రిస్తే, మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే. అందుకే చాలామంది ఆధ్యాత్మిక సాధకులు పౌర్ణమిని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆరోజు చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుందని. అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషులు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు.
ఇక శాస్త్రీయంగా సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారిపోతుంది. శరీరం ఎప్పుడైతే యోగంలో లీనమవుతుందో అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి. బాహ్య ప్రపంచ అవసరం ఏమాత్రం ఉండదు. అదే మనిషి సాధించే విజయమని చెప్పవచ్చు.
సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది, జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మతలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలు మన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి . సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంద.
ఇలా ఆధ్యాత్మిక పరంగానూ, శాస్త్రీయపరంగానూ మనుషుల ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థాయిని పెంచేవాడు ఆ సూర్యభగవానుడు. ఆయన్ను ఆరాధిస్తే సమస్త శుభాలు కలుగుతాయి.
◆ వెంకటేష్ పువ్వాడ