మనిషిని కర్మకు ప్రేరేపించేవి ఇవే!!
మనిషిని కర్మకు ప్రేరేపించేవి ఇవే!!
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై
ఈ భూమిమీద పుట్టిన ప్రాణి ఏదైనా క్షణ కాలం కూడా కర్మచేయకుండా ఉండలేదు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మానవులలో ఉండే త్రిగుణాలు అయిన సత్వ, రజో, తమో గణాలకు వాళ్ళు వశమై ఉంటారు. ఆ మూడు గుణములకు లోబడి అన్ని కర్మలు చేస్తుంటారు అంటే ఆ గుణాల ప్రభావం వల్లనే కర్మలు సంభవిస్తాయి. మంచి, చెడు అనేవి కూడా అతనున్న పరిస్థితికి సంజాసమైనవి కాదు. ఎందుకంటే ఒక మనిషికి మంచి అనిపించేది ఇంకొకరికి చెడు అనిపించవచ్చు కానీ ఆ మంచి చెడు అనేవి కూడా కర్మలే. కాబట్టి ఇలా కర్మలు చేయడం కూడా ప్రకృతి ధర్మములాంటిదే. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవునికి లేదు. మానవుడు కర్మలకు లోబడి బతకాలి.
ఇక్కడ కర్మ అంటే మనం కాళ్లు చేతులు నోటితో చేసే కర్మలే కాదు. మనకు తెలియకుండానే గాలి పీలుస్తున్నాము. ఆకలి వేస్తే ఆహారం తింటున్నాము. దాహం వేస్తే నీరు తాగుతున్నాము. నడుస్తున్నాము. మాట్లాడుతున్నాము. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాము. కానీ ఆ కర్మలు నిష్కామంగా చేస్తే వాటి ఫలితములు అతనిని అంటవు. దాని వలన మనస్సు, చిత్తము పరిశుద్ధము అవుతుంది. పూర్వజన్మవాసనలు తొలగిపోతాయి. మోక్షమునకు మార్గము దొరుకుతుంది.
"ప్రకృతి జైర్గుణై" అంటే ప్రకృతిలో నుండి పుట్టిన సత్వ, రజో, తమోగుణముల వలన, ప్రతి వాడూ, అవశ: అంటే వాటికి లోబడి, వాటికి వశుడై, కర్మ కార్యతే అంటే కర్మలు చేస్తున్నాడు. నేను ఏమీ చేయను అని కూర్చున్నా వాడి సహజ గుణములు వాడిని ఏదో కర్మచేయమని ప్రేరేపిస్తుంటాయి. టేబుల్ దగ్గర కూర్చుంటే పేపర్ వెయిట్ తిప్పడం, పెన్ నోట్లో పెట్టుకొని కొరకడం, షర్టు గుండీలు సర్దుకోవడం, టేబుల్ మీద వేళ్లతో కొట్టడం, లాన్లో కూర్చుంటే గడ్డిపీకడం, నోట్లోపెట్టుకొని కొరకడం, గోళ్లు కొరకడం, చేతులు నలుపుకోవడం, ఇవేమీ చేయకున్న బుద్ధి ఊరికే ఉండదు. ఎందుకు అంటే పుట్టడంతోనే మెదడును ఉపయోగిస్తున్నవాళ్ళం మనం. ఏమి ఆలోచించకుండా ఉండలేం. ఏమీ ఆలోచించకూడదు అని అనుకుంటూ, ఆ ఆలోచించకూడదు అనే విషయాన్ని అయినా ఆలోచిస్తాం. ఇది కూడా కర్మనే. ఇవన్నీ మానవుని స్వతస్సిద్ధ కర్మలు. వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కాని చేస్తుంటాము. ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇది వరకు రాజులు ఏమీ తోచకపోతే వేటకు వెళ్లేవాళ్లు. లేకపోతే ఇతర రాజుల మీదికి యుద్ధానికి వెళ్లే వాళ్లు. వారిలో ఉన్న రజో తమోగుణములు ఎవరినీ ఊరికే ఉండనీయవు. ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి కర్మచేయకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు.
సత్వ, రజో, తమోగుణాలు ప్రకృతి నుండి పుట్టాయి. మానవుడు కూడా ఈ ప్రకృతి లోనుండి పుట్టాడు. కాబట్టి ఈ గుణాలు మానవులను ఆకర్షించి, వారిని కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ గుణాలు మానవునిలో ఉన్నంత వరకూ ప్రతి మానవుడూ కర్మలు చేస్తూ ఉండవలసిందే. ఎవరూ కర్మ చేయకుండా ఉండలేడు. కర్మలు చేయడం ప్రతి మానవుని సహజ లక్షణం. మానవునికి ఇష్టం ఉన్నా లేక పోయినా, మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. కానీ ఏ కర్మాచేయకుండా ఉండటం అసాధ్యం.
ఈ శ్లోకంలో చెప్పబడిన కశ్చిత్ అంటే ఏ మనుష్యుడైనా అంటే సాధారణ మానవుడు, అజ్ఞానంలో ఉన్నవాడు, ఆత్మతత్వము తెలియని వాడు అని అర్థం. ఇక్కడ సాంఖ్యులు అంటే జ్ఞానులు జితేంద్రియులు అని అర్థం. యోగులు అంటే కర్మలను చేస్తూ ఉండే వాళ్లు. కర్మలు చేయడంలో నిమగ్నమై ఉండే వాళ్లు. జ్ఞానులను గుణములు ప్రభావితం చేయలేవు. వారు ప్రపంచంలో సంచరిస్తున్నా గుణములు వారిని అంటవు. అటువంటి వారికి కర్మయోగము అవసరం లేదు. నేరుగా సన్యాసము స్వీకరించి ముక్తిని పొందుతారు. కాని ఆత్మజ్ఞానము లేని వానికి, కర్మయోగము తప్పని సరి. అటువంటి వారు కర్మలను చేస్తూ ఉండాలి. వారు కర్మలు చేయకుండా ఒక్కక్షణం కూడా ఉండలేరు.
◆ వెంకటేష్ పువ్వాడ