మోక్షానికి అర్హులు ఎవరు??

 

మోక్షానికి అర్హులు ఎవరు??

 

గీతలో కృష్ణుడు ఇట్లా చెబుతాడు.

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః॥ నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్భహ్మణి తే స్థితాః!!

ఎవరి మనసులో అయితే సకల ప్రాణుల పట్ల, జీవరాసులు పట్ల సమభావం స్థిరంగా నిలిచి ఉంటుందో, అటువంటి వారు ఈ జనన మరణ చక్రము నుండి విడిపడతారు. అటువంటివారు జీవించి ఉండగానే నిర్మలమైన నిష్కల్మషమైన బ్రహ్మ పదమును పొందుతారు. ఆ బ్రహ్మలోనే స్థిరంగా ఉంటారు.

ఈ జన్మలోనే మోక్షము పొందేది ఎలాగ అంటే జననము, మరణము అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. దీనికి బంధనములే కారణము. ఈ బంధనములకు కారణము మనస్సు. మనస్సు స్థిరంగా లేకపోతే బంధనాలు కలిగిస్తుంది. స్థిరంగా ఉంటే మోక్షము కలిగిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సకల భూతముల యందు సమభావన, నిష్కామకర్మాచరణ ముఖ్యము. పరమాత్మ నిర్గుణుడు, నిర్వికారుడు. పరమాత్మను చేరాలంటే ఈ గుణాలు మనలో ఉండాలి. ఎందుకంటే ఒక వస్తువు మరొక వస్తువులో సంయోగం చెందాలంటే రెండు వస్తువుల గుణాలు, ధర్మాలు ఒకటిగా ఉండాలి. నీటిలో పాలు కలుస్తాయి కాని నూనె కలవదు. అలాగే పరమాత్మలో అంటే విశ్వ చైతన్యంలో ఐక్యం అవ్వాలంటే మనం కూడా పరమాత్మ ధర్మాలు కలిగి ఉండాలి. పరబ్రహ్మ లక్షణాలను మనం సంతరించుకోవాలి. అవే దోషములు లేకుండా ఉండటం, సమత్వభావన నిర్గుణత్వము. ఇవి అలవడితే మోక్షమార్గంలో మనం ప్రయాణం చేయవచ్చు. 

మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది. మోక్షము అంటే ఈ జన్మలో వచ్చేది కాదు. బతికి ఉండగా వచ్చేది కాదు. ఎన్నో జన్మల తరువాత కాని రాదు. అని అనుకుంటూ ఉంటారు. కాని మన సనాతన ధర్మంలో మోక్షము అంటే ఇక్కడే ఈ లోకంలోనే బతికి ఉండగానే వస్తుంది. అని చెప్పింది. వారినే జీవన్ముక్తులు అని అంటారు. 

వశిష్ఠుల వారు తమ వశిష్ఠగీతలో ఈ విధంగా అన్నారు.

【నమోక్షో నభసః పృష్టే పాతాలే న చ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యగ్జానవిబోధితమ్.

మోక్షము అనేది ఆకాశంలో లేదు. పాతాళంలో లేదు, భూమి మీద అసలే లేదు. నిర్మలమైన చిత్తములోనూ, సమ్యక్ జ్ఞానమువలన కలిగే నిర్మల చిత్తమే మోక్షం】

కాబట్టి ప్రతి మానవుడు తమ మనస్సులను నిర్మలంగా ఉంచుకోవాలి. అటు ఇటు పోనీయకూడదు. చంచలంగా ఉంచకూడదు. నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. అన్ని జీవులు పట్ల సమభావన కలిగి ఉండాలి. జనన మరణములు కేవలం ఒక పరిణామము మాత్రమే. అవి వస్తూ పోతూ ఉంటాయి, వాటి గురించి చింతించకూడదు అనే భావన కలిగిఉండాలి. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి లోపలికి మళ్లించి, ఆత్మలో స్థిరంగా, నిశ్చలంగా ఉంచాలి. అదే మోక్షము.

ఈ శ్లోకంలో ఇహైప అంటే ఇక్కడే ఈ జన్మలోనే మనం మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఆ మనకు వస్తుందా ఏమన్నానా అనే నిరాశ పడనక్కరలేదు. ముందు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మోక్షము పొందడానికి కాలము, స్థలముతో నిమిత్తము లేదు. ఇంట్లో ఉండి కూడా మోక్షము పొందడానికి ప్రయత్నం చేయవచ్చును. కావాల్సిందల్లా సమ్యక్ దృష్టి. అంటే అందరినీ సమానంగా చూడటం అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడని నమ్మడం, దేహములను బట్టి, వేషభాషలను బట్టి, భేదభావము చూపకుండా ఉండటం. మనస్సును నిర్మలంగా, నిశ్చలంగా ఉంచుకోవడం, ముక్తికి మార్గాలు. దీనికే వ్యాసుడు సామ్యేస్థితమ్ అనే పదం వాడాడు. అంటే సామ్యస్థితిలో ఉండటం. సకల భూతములను సమంగా చూడటం. చిత్తములో కల్లోలము లేకుండా ఉండటం. నిశ్చలంగా ఉండటం. యేషాం అంటే జాతి కుల వర్ణ భేదములు స్త్రీపురుష భేదములు లేకుండా అందరూ మోక్షమునకు అర్హులు అని అర్థం.

◆ వెంకటేష్ పువ్వాడ

 

 

 

More Related to Purana Patralu - Mythological Stories