Read more!

పరమాత్మను చేరడం గురించి వివరణ ఎలా ఉంది?

 

పరమాత్మను చేరడం గురించి వివరణ ఎలా ఉంది?

మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః॥ మనష్షష్టాన్డ్రియాణి ప్రకృతి స్థాని కర్షతి ॥ 

ఓ అర్జునా! ఆది అంతము లేని, సనాతనమైన నా అంశయే, జీవలోకమందు జీవుడిగా బయట ఉన్న ప్రకృతిని తన మనస్సు మొదలగు ఇంద్రియములతో ఆకర్షిస్తూ ఉంది. 

ఈ శ్లోకంలో మమైవాంశ అనే పదం వాడారు వ్యాసుల వారు. అంటే పరమాత్మ అంశ అని అర్థం. ఇక్కడ అంశ అంటే పరమాత్మలో ఒక ముక్క అని కాదు. పరమాత్మ అంటే అఖండ చైతన్యము, విశ్వచైతన్యము. సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడు. మన ఇంట్లో గది చీకటిగా ఉంది. మనం ఒక అద్దం తీసుకొని, సూర్యుడి ఎదురుగా పెడితే, సూర్యుడు ఆ అద్దంలో నుండి ప్రతిఫలించి సూర్యుని కాంతి గదిలోపల గోడ మీద పడి గది అంతా వెలుగుతో నిండిపోతుంది. అద్దం పగిలిపోగానే ఆ కాంతి పోతుంది. 

పరమాత్మ యొక్క అఖండ చైతన్యము యొక్క ప్రతిబింబం మనలో వెలిగే ఆత్మ చైతన్యము. ఆ ఆత్మచైతన్యము మనోబుద్ధి అహంకారాలతో కలిసి జీవ చైతన్యంగా మారి, ఈ ప్రకృతిలో కలిసిపోయింది. ఈ శరీరం పడిపోగానే అంటే అద్దం పగిలిపోగానే జీవచైతన్యం పోతుంది. అఖండ చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది. అంశ అంటే పరమాత్మయొక్క ప్రతిబింబ చైతన్యము అని అర్థం చేసుకుంటే ఈ శ్లోకం చక్కగా అర్థం అవుతుంది.

పరమాత్మ సనాతనుడు. అంటే చాలా కాలం నుండి ఉన్నాడు. ఆయనకు ఆది అంతము లేదు. నాశము లేదు. ఆ పరమాత్మ తన అంశ అంటే ఆత్మస్వరూపుడుగా, ప్రతి జీవిలోనూ ప్రతిబింబముగా వెలుగుతున్నాడు. ఆ ఆత్మస్వరూపమే మనలో మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము పేర్లతో ఈ ప్రపంచములో వ్యవహరిస్తూ ఉంటుంది. కళ్లు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక అనే ఇంద్రియముల ద్వారా బయట ప్రపంచంలోని వస్తువులను చూస్తుంటుంది, వింటుంది, ఆస్వాదిస్తుంది, అనుభవిస్తుంది. కాబట్టి పరమాత్మ అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా ప్రతిబింబముగా వెలుగుతున్నాడు. ఆ ఆత్మస్వరూపమే జీవాత్మ, పరమాత్మ, జీవాత్మ వేరు కాదు. రెండూ ఒకటే. ఇరువురూ సనాతనులే, నిత్యులే, అవ్యయులే. కాని వచ్చిన చిక్కల్లా జీవుడు ఈ దేహము, దానిలోని ఇంద్రియములు చేసేపనులన్నీ తాను చేస్తున్నట్టు భ్రమచెందుతున్నాడు. తనమీద ఆరోపించుకుంటున్నాడు ఇదే మాయ. 

ఈ మాయలో పడటానికి మనోబుద్ధి అహంకారాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. జీవుడు మనోబుద్ధి అహంకారాలుగా మార్పుచెంది ప్రాపంచిక వ్యవహారాలలో మునిగితేలుతున్నాడు. అన్నీ నేనే చేసాను అనుకుంటూ కర్తృత్వభావనతో ఉన్నాడు. నిజానికి బంగారం అంతా ఒకటే. కాని చైను, వంకీ, వడ్డాణము, జూకాలు ఇలా రకరకాల రూపాలు ధరించి ఊరిస్తుంటాయి. మనం వాటిని చూచి మోజుపడుతుంటాము. అలాగే కుండలో ఉన్న ఆకాశం కుండ ఆకారంలో ఉంటుంది. కుండ పగిలిపోతే అనంతాకాశంలో కలిసిపోతుంది. అలాగే జీవుడు తనలో ఉన్న అహంకారాన్ని కోరికలను వదిలిపెడితే, తన నిజస్వరూపమైన పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. 

ముందు మనం అందరం సకలజీవరాసులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని గ్రహించి అందరిపట్ల సమాన భావము కలిగి ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావము విడిచిపెట్టాలి. రాగద్వేషములు సుఖదుఃఖములు శీతోష్టాలు, కేవలం మన భావన తప్ప నిజం కావు. ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి అనే నిజం తెలుసుకోవాలి. వాటికి లొంగిపోకూడదు. తన నిజస్వరూపం పరమాత్మ కాబట్టి పరమాత్మ ధ్యానంలో నిమగ్నం కావాలి. అహంకారం వదిలిపెట్టి మనసును ఆత్మయందు ఉంచాలి. అపుడు అపరిమితమైన ఆనందాన్ని శాంతిని పొందుతాడు.

హైదరాబాదునుండి అమెరికా వెళ్లినవాడు తిరిగి హైదరాబాదు ఎలా తిరిగి వస్తాడో, ఆ పరమాత్మ నుండి వచ్చిన మనం అందరం మరలా ఆ పరమాత్మను చేరుకోడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అమెరికాలో ఉండే సుఖాలను, అందాలను అనుభవిస్తూ మనం ఎక్కడి నుండి వచ్చామో అది మరిచిపోకూడదు. అమెరికాలో మనం ఉండాల్సిన సమయం పూర్తికాగానే గెంటేస్తారు. అలాగే ఈ శరీరంలో మనం కాలం పూర్తికాగానే ఈ శరీరం మనలను గెంటేస్తుంది. ఆ గెంటించుకునే లోపల మనం పరమాత్మను చేరుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. అమెరికా వెళ్లగానే తిరుగుప్రయాణానికి టిక్కట్టు బుక్ చేసుకున్నట్టు, పుట్టినప్పటి నుండి మనం పరమాత్మ ఉండే పరమ పదానికి తిరుగు ప్రయాణానికి ప్రయత్నాలు ప్రారంభించాలి.

                              ◆వెంకటేష్ పువ్వాడ.