Read more!

రజో, తమో గుణాలను ఎందుకు వదిలెయ్యాలి?

 

రజో, తమో గుణాలను ఎందుకు వదిలెయ్యాలి?

మనిషి శరీరాన్ని ఆవరించి త్రిగుణాల ఉంటాయి. సత్త్వ, రజో, తమో గుణాలు అయినా ఈ త్రిగుణాల ప్రభావం వల్ల మనిషి స్వభావం మారుతూ ఉంటుంది. సాధారణంగా అందరూ సత్వగుణం కలిగి ఉండాలి అని ఎన్నోచోట్ల చెబుతూ ఉంటారు. అయితే రజో గుణం, తమోగుణం ఎందుకు వదిలిపెట్టాలి అనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు.

కర్మణస్సుకృతస్యాహు స్వాత్త్వికం నిర్మలం ఫలమ్||
రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలమ్ ||

సత్వగుణముతో ఉన్న వారు చేసే సాత్వికమైన కర్మలకు నిర్మలమైన ఫలము లభిస్తుంది. రజోగుణముతో ఉన్న వారు చేసే రాజసమైన కర్మలకు దుఃఖము కలుగుతుంది. తమోగుణముతో కూడిన తామస కర్మలు చేసే వారికి అజ్ఞానము, అవివేకము ఎక్కువవుతుంది.

 ఈ శ్లోకంలో జీవితాంతం ఈ మూడు గుణములు కలిగిన వాళ్లకు ఈ లోకంలోనే, జీవించి ఉండగానే, ఏమేమి ఫలములు కలుగుతాయో క్లుప్తంగా చెప్పాడు కృష్ణుడు. సత్త్వగుణ ప్రధానమైన కర్మలు చేస్తే సుఖము, శాంతి కలుగుతాయి. రజోగుణ ప్రధానమైన కర్మలు చేస్తే మొదట్లో సుఖం కలిగినా, చివరకు అది దుఃఖంతో ముగుస్తుంది. తమోగుణప్రధాన కర్మలు చేస్తే మోహం కలుగుతుంది. ప్రతి దానినీ తప్పుగా అర్ధం చేసుకోవడం, విపరీతార్థాలు తీయడం చేస్తుంటారు. వారిలో అజ్ఞానం, అవివేకము పెరుగుతుంది. ఆలోచనా శక్తి నశిస్తుంది.

ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ సుఖ పడాలనే కోరిక ఉంటుంది. సుఖపడటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎవరూ దుఃఖపడాలని కోరుకోరు. కాబట్టి ఏ యే పనులు చేస్తే సుఖం కలుగుతుందో ఆయాపనులనే చేయాలి. దుఃఖం కలిగించే పనులు చేయకూడదు. కేవలం సాత్విక కర్మల చేతనే సుఖం కలుగుతుంది. రజోగుణము, తమోగుణము, ఉన్న కర్మలు చేస్తే దుఃఖము, అజ్ఞానము, మోహము, కలుగుతాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మలవైపు అడుగులు వేయాలి.

రజోగుణము వలన దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కామము, క్రోధము రజోగుణ ప్రధానములు. కామం మనిషిని మనిషిలో ఉండే విచక్షణను మరిచిపోయేలా చేస్తుంది. కామానికి బానిస అయినవాడు ఎలాంటి వరుసలు చూడడు. సరిగ్గా ప్రస్తుతకాలంలో ఇదే చోటు చేసుకుంటోంది. ఎక్కడపడితే అక్కడ, వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. కామం వల్ల ఇలా జరిగితే రజోగుణంలో మరొక భాగం అయిన కోపం మనిషిని నిలకడగా ఉండనివ్వదు. చీటికీ మాటికి కోపం చేసుకోవడం వల్ల అపార్థాలు చోటుచేసుకుంటాయి. కోపం ఉన్నచోట ఏ బంధం ఎక్కువకాలం నిలబడదు. రగిలిపోతున్న మంట ముందు ఎవరూ ఎక్కువసేపు కూర్చోరు కదా!! కోపం ఉన్న మనిషి కూడా రగిలిపోతున్న మంట లాంటి వాడే. మంట అన్నిటినీ కాల్చి బూడిద చేసినట్టు కోపం ఎక్కువున్న మనిషి ఎదుటివారిని గాయపరుస్తూ ఉంటారు. అందుకే కామం, క్రోధం లేదా కోపం అనే  రెండూ మొదట్లో సుఖాన్ని ఇచ్చినా చివరకు దుఃఖం కలిగిస్తాయి.

 ఇంక తమోగుణము వలన మోహం కలుగుతుంది. మొహం కలిగినవాడికి ముందు వెనుక ఆలోచనలు ఉండవు. అన్నీ సొంతమవ్వాలనే మొండితనం మూర్ఖత్వం తప్ప. ఏమి చేసి అయినా తనకు కావాల్సింది తను సాధించుకునే స్వభావం ఇందులో ఉంటుంది. అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన హాని కలుగుతుంది. కాబట్టి భక్తులు, సాధకులు ఈ రెండు గుణములను అంటే రజోగుణం, తమోగుణం వదిలిపెట్టాలి.

                                 ◆వెంకటేష్ పువ్వాడ.