Read more!

ప్రస్థాన త్రయంలో ఒకటిగా భగవద్గీతను ఎందుకు చెప్పారు?

 

ప్రస్థాన త్రయంలో ఒకటిగా భగవద్గీతను ఎందుకు చెప్పారు?

ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఈ మూడు ప్రస్థాన త్రయము అని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్మాత్మిక విషయములు, ధర్మసూక్ష్మములు ఇమిడి ఉన్నందున ఇది ప్రస్థాన త్రయములో ఒకటిగా వెలుగుతూ ఉంది.

ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాక ముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మము క్షీణిస్తుందనీ, ఒంటి పాదంతో నడుస్తుందనీ తెలిసి, రాబోవు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారములను ఎత్తిన పరమాత్మ గీతను, కృతయుగములోనో, త్రేతాయుగములోనో లేక ద్వాపర యుగం మధ్యలోనో ఉపదేశించి ఉండేవాడు. అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవానుడు కలియుగ ప్రారంభంలో గీతమృతమును లోకానికి అందిచాడు పరమాత్మ. కలియుగములో మానవులకు కలగబోయే శోకమును అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. శోకము అంటే బాధ, దుఃఖం. ఇవి మనిషికి శత్రువుల్లా ఉంటాయి. నిజానికి మనిషి సుఖాన్ని చూసి ఎగిరిగంతేస్తాడు, దుఃఖాన్ని చూసి నీరుగారిపోతాడు. దుఃఖమంతా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తే, సుఖం మనిషికి గుణపాఠాలు చెబుతూ ఉంటుంది. ఎలాగంటే సుఖం అనేది శాశ్వతం కాదు. అది దుఃఖంతో మాయమైపోతుంది.దుఃఖం కూడా అంతే సుఖం తో మాయమైపోతుంది. కానీ మనిషి సుఖాన్ని తీసుకున్నట్టు దుఃఖాన్ని తీసుకోలేడు.

గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహము వచ్చినపుడు, ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతివారూ చదువ తగినది గీత అని చెప్పవచ్చు. సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలాగా ఉపయోగపడి వారిని ఒడ్డుకు చేరుస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది.

 సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి అనేక రకాలైన ప్రయాణ సాధనాలు సమకూర్చింది. ఇన్ని సుఖాలు, భోగభాగ్యాలు నా మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతున్నాడు. ఉన్నది చాలదు. ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హెూదా, భోగభాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం వారిలో జన్మజన్మలనుండి గూడుకట్టుకొని ఉన్న వాసనలతోకూడిన అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారం అయిన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం. మరొక మార్గం లేదు.

ఈ లోకంలో కేవలం కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తిని నమ్ముకున్నవారు, యోగమార్గమును అవలంబించినవారు, ఎంతో మంది ఉన్నారు. వారందరూ తాము అనుసరించే మార్గము మాత్రమే మంచిది అనీ, గొప్పది అనీ, మిగిలిన మార్గములు చెడ్డవి, అనుసరించరానివి. అని వాదిస్తుంటారు. వారి వారి వాదములకు బలం చేకూర్చడానికి ఎన్నో ప్రమాణాలు చూపిస్తుంటారు. కానీ భగవద్గీతలో అన్ని మార్గములను సమన్వయం చేసి, ఆ మార్గాలన్నీ మంచివే, ఏ మార్గం అనుసరించినా పరమాత్మను చేరుకోవడమే అంతిమలక్ష్యం అని నిరూపించాడు.

◆ వెంకటేష్ పువ్వాడ.