Read more!

వైకుంఠ ఏకాదశినాడు ఆచరించవలసిన విధులు

 

 

వైకుంఠ ఏకాదశినాడు ఆచరించవలసిన విధులు

 


శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి. భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.


పూజ


వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, ఇంట్లేనే అయినా తలస్నానం మాత్రం చేయడం మంచిది. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, ఆయన ప్రతిమను కొలుచుకోవాలి. కొందరి ఇళ్లలో ఈ రోజున విష్ణుమూర్తికి కలశం పెట్టే ఆచారం కూడా కనిపిస్తుంది. పూలతో పాటుగా హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.

 


ఉత్తరద్వార దర్శనం


ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ గుడికి వెళ్లడం కుదరని పక్షంలో ఆందోళన చెందకుండా, ఉన్నచోటే ఆ హరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి, శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలంటూ పెద్దలు సూచిస్తున్నారు.


ఉపవాసం


ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ (పదకొండు) ఇంద్రియాలు ఉంటాయట. ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం. ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.

 


జాగరణ


ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు. ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలని హెచ్చరిస్తారు. ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుందని చెప్పేందుకు ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం సుకేతుడనే రాజు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందాడు కాబట్టి, ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు.

- నిర్జర.