ఏడాది చివర అద్బుతమైన అవకాశం.. అస్సలు వదలకండి..!
ఏడాది చివర అద్బుతమైన అవకాశం.. అస్సలు వదలకండి..!
2025 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. ప్రతి ఏడాదిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని ఉంటాయి. ఆధ్యాత్మికంగా, భక్తి పరంగా ఆ భగవంతుడిని చేరుకోవాలని అనుకునే వారికి కొన్ని రోజలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఏకాదశి, షష్టి, సంకట చతుర్థి వంటివి చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ధనుర్మాసంలో భాగమైన పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఏకాదశినే అందరూ పుత్రద ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని అంటారు. భక్తులందరూ వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎంతో ఎదురుచూస్తుంటారు. అసలు ఈ ఏకాదశి ఎందుకంత శక్తివంతమైనది? తెలుసుకుంటే..
ఉత్తరాయణం.. మొదటి ఏకాదశి..
మహావిష్ణువు శేషతల్పంపై పడుకుని ఉంటాడు.ఆయన ఉత్తరం వైపుకు తిరుగుతాడు కాబట్టి ఈ కాలాన్ని ఉత్తరాయణం అని అంటారని చెబుతారు. ఉత్తరాయణంలో వచ్చే మొదటి ఏకాదశే ముక్కోటి ఏకాదసి లేదా వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఆలయంలో ఉత్తర ద్వారాన్ని ఈరోజున తెరుస్తారు.
ఏకాదశి..
పుష్య మాసంలో వస్తున్న ఈ ఏకాదశి రోజు ఉపవాసం, విష్ణు ఆరాధన, ఏకాదశి నియమాలు పాటించడం, దానధర్మాలు చేయడం వంటివి చేయడం వల్ల చాలా గొప్ప మహా విష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అంతేకాదు.. ఏకాదశి రోజు వైష్ణవ ఆలయ సందర్శనం చాలా పుణ్యప్రదమైనది. ఉత్తర ద్వారం నుండి మహావిష్ణువును దర్శించుకోవడం వల్ల ఆయన కృపకు పాత్రులు కావచ్చు.
పుత్ర సంతానం..
ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి, మహా విష్ణువును పూజిస్తే పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది.
కొత్త ఏడాదికి ముందు మహా విష్ణువు అనుగ్రహం లభిస్తే.. కొత్త ఏడాది మొత్తం ఎంతో సానుకూలంగా సాగుతుందని పెద్దలు, పండితుల నమ్మకం. కాబట్టి ముక్కోటి ఏకాదశి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
*రూపశ్రీ.