Read more!

వైశాఖమాసం ఎందుకంత ప్రత్యేకం?

 

వైశాఖమాసం ఎందుకంత ప్రత్యేకం?

 

తెలుగు నెలలలో కార్తికం, మాఘం, వైశాఖం ముఖ్యమైనవి… వాటిలో వైశాఖం మరీ ఉత్తమం అని చెబుతుంది వైశాఖ పురాణం. ఈ మాసంలో కనిపించే లెక్కలేనన్ని ప్రత్యేకతలే అందుకు సాక్ష్యం. విష్ణుమూర్తి రూపాలలోని నృసింహస్వామి, పరశురాముడు, కూర్మం, బుద్ధుడు అవతరించింది ఈ నెలలోనే! అక్షయ తృతీయ లాంటి అరుదైన పండుగలూ ఈ మాసంలోనే పలకరిస్తాయి. అందుకనే వైశాఖమాసంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని చెబుతారు.

వైశాఖ స్నాన వ్రతం- సముద్రస్నానం చేయడానికి మన పెద్దలు సూచించిన నెలలలో వైశాఖమాసం కూడా ఒకటి. ఈ నెలలో సూర్యోదయానికి ముందే సముద్రస్నానం చేస్తే అరుదైన పుణ్యం లభిస్తుందని పెద్దల మాట. పురాణాల ప్రకారం ఈ మాసంలో విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు సర్వదేవతలూ, సూర్యాదయ వేళలో… బయట ఉన్ననీటిని ఆశ్రయించి ఉంటారు. కాబట్టి ఆ సమయంలో చేసే స్నానంతో వారందరి అనుగ్రహం లభిస్తుంది.

అందుకనే ఒకవేళ సముద్ర స్నానం కుదరకపోయినా నది లేదా బావిలోంచి తోడుకున్న నీటితో స్నానం చేస్తే మంచిది. అదీ కుదరని పక్షంలో అప్పటికప్పుడు నేల నుంచి పట్టుకున్న నీటితో స్నానం చేయాలి. ఈ స్నానం తర్వాత రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి, విష్ణుమూర్తిని తులసీదళాలతో సేవిస్తే… ఆ మాధవుని అనుగ్రహం కలిగి తీరుతుంది. ఉత్తరాది రాష్ట్రాలలో అయితే ప్రత్యేకంగా వైశాఖ మాసంలో స్నానం చేస్తూ, మాధవుని తులసి దళాలతో పూజిస్తూ… ‘వైశాఖ స్నాన వ్రతం’ చేస్తారు.

హిందువులు అశ్వత్థ వృక్షాన్ని (రావి చెట్టు) పితృదేవతలకు నివాసంగా భావిస్తారు. సాక్షాత్తు ఆ మహావిష్ణువు ఇందులో కొలువై ఉంటాడని చెబుతారు, జ్ఞానాన్ని అందించే బోధివృక్షంగానూ దీన్ని పేర్కొంటారు. కాబట్టి విశిష్టమైన ఈ నెలలో రావిని తప్పక ఆరాధించాలనే నియమం కనిపిస్తుంది.

వైశాఖ స్నానం వెనుక ధార్మిక కారణాలతో పాటు లౌకిక కారణాలు కూడా కనిపిస్తాయి. వైశాఖమాసంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో బద్ధకాన్ని వదిలిపెట్టి, తెల్లవారుజామునే నిద్రలేవగలిగితే, బారెడు పొద్దెక్కకుండానే ముఖ్యమైన పనులన్నీ చేసుకుని నీడపట్టునే ఇంట్లో ఉండవచ్చు.

వైశాఖ మాసంలో చదివే విష్ణుసహస్రనామం కూడా విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. వీలైతే రోజూ ఆ సహస్ర నామాన్ని లేదా వరుసగా కొన్ని శ్లోకాలను చదివే ప్రయత్నం ఆ నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. వైశాఖమాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఈ నెలలో ఉదకుంభదానం చేస్తే అనూహ్యమైన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఉదకుంభదానం అంటే కుండలో నీటిని నింపి ఇవ్వడం!

ఇలా వైశాఖమాసంలో లెక్కలేనన్ని విశిష్టతలు ఉన్నాయి. ప్రతిరోజూ వాటిని తల్చుకుంటూ, ఆ పుణ్యతిథులలో ఆచరించాల్సిన విధులను గ్రహించే ప్రయత్నం చేద్దాం.
 

- మణి