Read more!

వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు

 

 

వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు

 

 

ఏకాదశి అంటేనే, మనకు ఉపవాస దీక్ష జ్ఞప్తికి వస్తుంది. ఇహ సంసారపు ఆలోచనల్లో మునిగితేలుతున్న మనం, పక్షంలో ఒక్క రోజైనా భగవంతుని వైపుగా దృష్టి సారించేందుకు ఏర్పరిచిన నియమమే ఏకాదశి. దీని వలన మనసు పరిశుద్ధం కావడం అటుంచితే, శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.


ఒకవేళ ప్రతి ఏకాదశికీ ఉపవాసం ఉండటం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వంటి రోజులలో అయినా ఉపవాసాన్ని ఆచరించమని సూచిస్తున్నారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్నట్లు లెక్క అని కూడా పెద్దలు చెబుతారు. వైకుంఠంలోని విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకూ ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనీ పిలవడం కద్దు. వైకుంఠ ఏకాదశినాడు భక్తులు కూడా విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుని తరిస్తారు.

 


వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ముందురోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభిస్తారు. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తులసినీటిని మాత్రమే సేవిస్తూ గడుపుతారు. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆహారాన్ని భుజించడం ద్వారా ఈ ఉపవాస దీక్షను ముగిస్తారు. ఇలా ఉపవాస దీక్షను సాగించడం వెనుక పరమార్థాన్ని పెద్దలు ఇలా వివరిస్తూ ఉంటారు...


ఉపవాసం అంటేనే (భగవంతునికి) దగ్గరగా ఉండటం అన్న అర్థం వస్తుంది. పొట్ట నిండుగా ఆహారం ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలా పరుగులు తీస్తుంది. ఆకలితో శరీరం శుష్కించిన రోజున, మెదడు జాగరూకతతో మెలుగుతుంది. ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితిని చేరుకోగలదు. అలాంటి మనసుని రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఇక చెప్పేదేముంది! తన దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించగలిగినవాడి స్థైర్యానికి తిరుగేముంటుంది. అందుకనే భగవన్నామస్మరణతో ఏకాదశినాటి రాత్రిని గడపమని సూచిస్తారు.

 


సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించడం వల్ల జీర్ణవ్యవస్థ తారుమారవుతుంది. అంచేతనే ద్వాదశి రోజున కూడా మితంగా భోజనం చేయమని సూచిస్తుంటారు. అంటే దశమి రోజున మొదలైన ఉపవాస వలయం ఏకాదశి చుట్టూ పరిభ్రమించి ద్వాదశి నాటికి ముగుస్తుందన్నమాట. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కనుక పాలు, పండ్లు వంటి ఆహారాన్ని వంటి ఆహారాన్ని తీసుకోవచ్చునన్న మినహాయింపుని అందించారు. మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజున భుజించకూడదన్నది పెద్దల మాట. అలాగైనా ఏకాదశిని ఏదో ఒక రీతిని ఆచరింపచేయడం వారి ఉద్దేశం కావచ్చు.


ఇక ఏకాదశి రోజునే మన పెద్దలు ఉపవాస నియమాన్ని ఏర్పాటు చేయడం వెనుక కూడా ఒక తాత్విక ఉద్దేశం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెబుతారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావడం, మనసులో అలజడి చెలరేగడం వంటి సమస్యలు చోటు చేసుకుంటాయట. ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణలను పాటించడం ద్వారా శరీరమూ, మనసూ రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. ఇక ఆ సమయంలో మనసుని ఆ భగవంతుని మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యమూ ఖాయమే కదా!

- నిర్జర.