Read more!

అష్టమూర్తుల పూజ వివరణ!!

 

అష్టమూర్తుల పూజ వివరణ!!

నిజంగా ఈ ప్రపంచాన్ని సృష్టించినది పరమాత్మ. విశ్వాన్ని చేసింది విశ్వేశ్వరుడే. జగత్తును నిర్మించినది జగన్నాథుడే. ఈ జగత్తు కార్యం. కార్యమున్నదీ అంటే కారణముండాలి. కనుక ఈ జగత్తుకు ఉపాదానకారణం,  నిమిత్త కారణం రెండూ భగవంతుడే. కార్యంలో వున్నదంతా కారణమేననే విషయమూ మనకు అనుభవమే. కుండ కార్యం. మట్టికారణం. కుండలో ఉన్నదంతా మట్టే. అలాగే నగ కార్యం. బంగారం కారణం. నగలో ఉన్నదంతా బంగారమే. కనుక జగత్తు కార్యం. పరమాత్మ కారణమైతే జగత్తులో ఉన్నదంతా పరమాత్మే తప్ప మరేమీకాదు. మట్టిని తీసేస్తే కుండ ఎట్లా లేదో, బంగారాన్ని తీసేస్తే ఆభరణం ఎట్లా లేదో, భగవంతుని జగత్తు లేదు. అందువల్ల ఈ జగత్తును పరమేశ్వర బుద్ధితో సేవిస్తే ఆ సేవ అష్టమూర్తులతో కూడిన భగవత్ సేవయే అవుతుంది. నిజమైన భగవంతుని పూర్ణ పూజే అవుతుంది. జగత్తంతా పరమేశ్వరుడే గనుక జగత్తులో ఉన్న ప్రాణులు మనుష్యులు, జంతువులు, చెట్లు వగైరా అన్నీ కూడా ఆ పరమేశ్వరుడే. 

అన్ని రూపాలలో అన్ని దేహాలలోను అంతర్యామిగా ఉన్నది ఆ భగవంతుడే. కనుకనే "ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశర్జున తిష్టతి" - "సర్వస్యచాహం హృది సన్ని విష్ణ:" "అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః" అని గీతలో భగవానుడు తెలియ జేయడం జరిగింది. ఈ కారణంగా ఎవరిని పూజించినా భగవంతుని పూజించినట్లే.

ఐతే ఆచరణలో ఎవరినీ ద్వేషించకుండా ఉండటం సాధ్యం కావటం లేదు. ఎందుకంటే మనం అందరినీ భగవత్ భావనతో చూడటం లేదు గనుక. అందరిలోను అంతటా అన్ని వేళలా భగవంతుని దర్శించగలిగే జ్ఞానం అనుభవజ్ఞానం కలిగేంత వరకు సాధకులు భగవంతుని పూజచేయడానికిగాను భగవంతుని కొన్ని విశిష్ట మూర్తులలో గుర్తించి ఆ గుర్తింపునే పూజగా చేయవలసి ఉంది. ఇదే 'అష్టమూర్తి భృత్ దేవపూజనం' అని ఇక్కడ చెప్పింది. అంటే భగవంతుని ఇక్కడ ఎనిమిది విశిష్ట రూపాలలో గుర్తించి పూజించాలి. 

చరాచరాత్మక ప్రపంచం అంతా భగవంతుని అష్టమూర్తులుగా మనకు దర్శనమిస్తున్నది. 

మరి అష్టమూర్తులు అంటే ఏమిటి అని సందేహం వస్తే వాటికి సమాధానం ఇదిగో….


1) భూమి

2) నీరు, 

3) అగ్ని లేదా తేజస్సు, 

4) వాయువు, 

5) ఆకాశం, 

6) స్వయం ప్రకాశమైన సూర్యుడు (నక్షత్రాలకు ప్రతినిధి) 

7) స్వయం ప్రకాశము లేక పోయినా ప్రకాశించే చంద్రుడు (చర గ్రహాలకు, ఉపగ్రహాలకు ప్రతినిధి) 8) అన్ని జీవరాసులకు ప్రతినిధియై అన్ని ప్రపంచ అనుభవాలను అనుభవించే జీవుడు. 

ఇవే అష్టమూర్తులు. ఈ రూపాలను భగవంతునిగా గుర్తించి చేసే పూజయే అష్టమూర్తి భృతేవ పూజ శ్రేష్టమైన పూజ, అదే గురుపూజ. గురువునే దైవంగా భావించి సకల ఉపచారాలతో, నైవేద్యాలతో, హారతులతో చేసే ఈ పూజ పూర్ణపూజ ఎలా అవుతుంది? అష్టమూర్తుల పూజ ఎలా అవుతుంది అంటే…...

గురువు యొక్క దేహం పంచ భూతాలతో నిర్మితమైనది - 5

గురువు యొక్క బుద్ధిలో సూర్యునిలా స్వయం ప్రకాశమై (సూర్యుడు) -1 వెలుగొందుతున్న జ్ఞానం.

ఆ జ్ఞానాన్ని వాత్సల్యంతో, ప్రేమతో, చల్లని చూపులతో అందించే గురువు యొక్క మనస్సు (చంద్రుడు) -1 

జ్ఞానాన్ని శిష్యుల బుద్ధిస్థాయిలో అందించాలనే తపనతో జీవభావంలో ఉన్నదీ గురువే (జీవుడు) - 1 కనుక గురుపూజ అష్టమూర్తుల దేవ పూజే అవుతుంది.

'దేహోదేవాలయ ప్రోక్త: జీవోదేవ: సనాతనః అన్న శ్రుతివాక్యం ఆధారంగా సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి, జ్ఞానాన్నిచ్చిన గురువును పూజించటం అష్టమూర్తి పూజనమే, పూర్ణ పూజయే అవుతున్నది. అయితే ఇది అందరికీ సాధ్యంకాకపోవచ్చు. కొందరికి గురువంటే ఎవరో ఏమిటో తెలియదు కనుక గురువే ఉండడు. కొందరికి పూర్వజన్మ సుకృతం లేకపోవటం వల్ల ఉన్నా గుర్తించలేరు. కొందరు గుర్తించినప్పటికీ పూజించరు. ఏవేవో ఆటంకాలుగా భావిస్తారు. అలాంటి మనస్సుండదు వారికి ఇది అజ్ఞానం.

కాబట్టి నిజాన్ని తెలుసుకుంటే అప్పుడు అష్టమూర్తుల పూజతో గురువును సేవిస్తే ఆ భగవంతుడిని పూజించినట్లే.

◆ వెంకటేష్ పువ్వాడ