Top Stories

పులివెందుల సమరం.. పీక్స్ కు చేరిన టెన్షన్లు

 పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై పులివెందుల, కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఏదో ఒక మండలానికి చెందిన ఎన్నికలా కాకుండా ఈ ఉప ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపించేంత ఉద్రిక్తత, ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం (ఆగస్టు 12)   జరగనున్న ఈ ఉప పోరును తెలుగుదేశం కూటమి ,వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.  ఇప్పటికే ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరగడంతో ఇక పోలింగ్ ఇప్పటికే ప్రచార సందర్భంగా పోలింగ్ దాడులు జరగడం తో పోలింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు  వ్యక్తమౌతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ సైన్యం దిగితే... తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పార్టీలు ప్రైవేటు సైన్యాన్ని  దించారన్న ప్రచారం   ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పులివెందులలో దౌర్జన్యానికి పై చేయి అవుతుందా? ప్రజాస్వామ్యానిదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది.   ఇప్పటికే తెలుగుదేశం కూటమి, వైసిపి నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.  ప్రచార ఘట్టంలోనే హింసాత్మక ఘటనలు జరగడంతో  పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇదిలా ఉంటే పోలింగ్ రోజు తమకు అనుకూలంగా ఓటింగ్  జరుపుకునేందుకు బయట వ్యక్తులు పులివెందులకు చేరుకున్నారన్న ప్రచారంతో స్థానికులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు పోలింగ్ ముందు రోజు నుంచే కొత్త వ్యక్తులు పోలింగ్ జరిగే పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ ఉండకూడదని   హెచ్చరించారు.  ఇక ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున  సాగుతోందంటున్నారు.  పోటాపోటీగా, ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నకలో ఓటు చాలా కాస్టీగా మారిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.  ఓటుకు పది వేల చొప్పున ఇస్తున్నారంటూ తెలుగుదేశం కూటమి, వైసీపీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒంటిమిట్టలో కూడా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా పులివెందుల స్థానం అంత కాకపోయినా.. ఓటుకు నోటు భారీగానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం రెండు  జట్పీసీలకు కలిపి..దాదాపు పాతిక కోట్ల పంపిణీ జరుగుతోందని అంచనా వేస్తున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇంత కాస్టీగా మారడం ఇదే ప్రథమం అంటున్నారు.  ఇక పులివెందుల బరిలో స్థానానికి వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా  బిటెక్ రవి సతీమణి  లతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్ధి రంగంలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులు కూడా రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉంది.  ఇక   ఒంటిమిట్ట జడ్.పి.టి.సి అభ్యర్థిగా వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ తో పాటు మరో 8 మంది స్వంతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడా పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.  
పులివెందుల సమరం.. పీక్స్ కు చేరిన టెన్షన్లు Publish Date: Aug 11, 2025 9:39PM

రాజధాని నిర్మాణానికి రూ. 2లక్షల 116లు విరాళం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ  వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు. నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ రెండు లక్షల నూట పదహారు రాపాయల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో సోమవారం (ఆగస్టు 11)న స్వయంగా కలిసి ఈ విరాళం చెక్కును అందించారు.  రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు   కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఆమెను అభినందించారు. రాష్ట్ర రాజధాని అత్యంత గొప్పగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ఆబాట గోపాలం రాజధాని నిర్మాణం పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నారనడానికి కాసా నాగేంధ్రమ్మ తన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయం వరకూ వచ్చి విరాళం అందించడమే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.  
రాజధాని నిర్మాణానికి రూ. 2లక్షల 116లు విరాళం Publish Date: Aug 11, 2025 9:00PM

ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులతో నిర్మాతల భేటీ.. ఎందుకంటే?

గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలను, రాజకీయనేతలను శరణుజొచ్చుతున్నారు నిర్మాతలు. ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫి మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మిలకు డిమాండ్ లు, ఆందోళనకు సంబంధించి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతలు కలిశారు.   కాగా నిర్మాతలతో భేటీపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్  సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేయడానికి కలుస్తామంటూ కొందరు నిర్మాతలు చెబితే రమ్మన్నాం.. అంతే తప్ప ఈ భేటీకి ప్రత్యేకమైన అజెండా ఏమీ లేదని తేల్చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యలకు సంబం ధించి నిర్మాతలు, కార్మికులు చెప్పే అంశాలను విని, వాటిని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెడతాం. వారి స్థాయిలోనే ఏం చేయాలన్న నిర్ణయం ఉంటుందని కందుల  చెప్పారు. అంతే కాకుండా   ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనకు  కృషి చేస్తాం, రాష్ట్రంలో స్టూడియోలు, రీరికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. కాగా కందుల దుర్గేష్‌ను నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్‌, నాగవంశీ, భరత్‌, విశ్వప్రసాద్‌, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్‌ వంశీ, బన్నీ వాసు, వివేక్‌ కూచిభొట్ల తదితరులు  కలిశారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని  ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌, సుప్రియ, జెమినీ కిరణ్‌ తదితరులు కలిశారు. 
ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులతో నిర్మాతల భేటీ.. ఎందుకంటే? Publish Date: Aug 11, 2025 4:55PM

ఎన్నికల జాప్యం.. పంచాయతీలకు శాపం !

ఆలస్యం అమృతం విషం ఈ నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే  అది ఇదే.  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ..   కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన  కేంద్ర నిధులు  రాకుండా ఆగి పోతాయి. అంతే కాదు..  నిర్దిష్ట గడువు ముగిస్తే అవి మురిగి  పోతాయి కూడా.   అవును..  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1992లో తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీలు కొలువు తీరి ఉన్నప్పడు మాత్రమే  పంచాయతీలకు  కేంద్ర నిధులు అందుతాయి. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీల గడువు 2024 జనవరిలోనే ముగిసింది. ఇక అక్కడి నుంచి  కారాణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ముడి పడలేదు. ఈ కారణంగా ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం  2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావలసిన రూ.1,550 కోట్లను రిలీజ్ చేయకుండా  విత్ హెల్డ్  లో పెట్టింది. అంటే..  నిధుల విడుదలను నిలుపుదల  చేసింది. అలాగే ప్రస్తుత   ఆర్థిక సంవత్సరానికి సంబందించి   రూ.1,450 కోట్లు కూడా విడుదల కాలేదు.  అంటే..  పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వలన రాష్ట్రంలోని గ్రామ  పంచాయతీలు ఇంచుమించుగా రూ.3000 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  మరో వంక నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రాణప్రదంగా భావించే  కేంద్ర నిధుల విడుదల కావాలంటే..   స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించడం మినహా మరో మార్గంలేదన్నది పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమాచారం. మరోవంక..  స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని   హై కోర్టు గడువు విధించింది. ఈ అన్నిటినీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని  బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే .. అంటూ రాజకీయ హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో  గండం నుంచి గట్టెక్కేదారి కనిపించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తికమక పడుతోంది. ఇతర అంశాలు ఎలా ఉన్నా..  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఫేస్  చేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ముందు కేంద్ర గ్రాంట్స్ తెచ్చుకోవడం పై దృష్టి పెట్టాలి,  లేదంటే,  పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన స్థితికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల అవుతాయనే నమ్మకం లేదనీ, గడువు ముగిసిన గత సంవత్సరం నిదుల విడుదల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచక్షణాదికార పరిధిలోకే వస్తుందనీ,  సో ..గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల కేంద్రం దయ .. మన ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే..  గతంలో   ఎన్నికలు నిర్వహించిన వెంటనే విత్ హెల్డ్  లో పెట్టిన నిధులను విడుదల చేసిన అనుభవాల ఉన్నాయి కాబట్టి  ఎన్నికలు జరిగితే గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబందించిన రూ. 3000 కోట్లు విడుదలవుతాయనే విశ్వాసాన్ని పంచాయతీ శాఖ అధికారాలు వ్యక్తం చేస్తున్నారు.   అలాగే.. ఈలోగా ఎన్నికలు జాప్యానికి కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాస్తే, కేంద్ర నిధులు  విడుదల అవుతాయని  కొందరు అధికారులు అంటున్నారు  అయితే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రోజురోజుకూ మరింత జటిలం అవుతున్న నేపధ్యంలో, ఈ చిక్కు ముళ్ళు వీడి, పంచాయతీ ఎన్నికల జరగడం  ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల జాప్యం.. పంచాయతీలకు శాపం ! Publish Date: Aug 11, 2025 4:32PM

పాక్ అణుబాంబులు భ‌య‌పెట్ట‌డానికేనా?

సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా?  కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది? ఈ విష‌యం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మ‌ర‌చిపోతే ఎలా? మొన్న‌టి యుద్ధంలో భార‌త్ పాక్ ని భ‌య‌పెట్ట‌కుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వ‌లున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది.  జ‌స్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్ర‌హ్మోస్ లు వ‌దిలినందుకే త‌ల్ల‌డిల్లిపోయింది పాక్.  ఈ ఎయిర్ బేస్ కి ద‌గ్గ‌ర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్ట‌ర్ తో పాటు అటు అణు నిర్వ‌హ‌ణ చేసే నేష‌న‌ల్ క‌మాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్క‌డ భార‌త్ బాంబులు ప‌డ్డంత‌నే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్‌.. జ‌డుసుకుని బంక‌ర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మ‌ళ్లీ బీరాలు ప‌లుకుతున్నాడు. సింధూన‌ది మీద ప్రాజెక్టు క‌డుతున్నందుకే ఇలా అంటుంటే మ‌రి బ్ర‌హ్మ‌పుత్రా న‌ది మీద చైనా క‌డుతున్న ప్రాజెక్టు ప‌రిస్థితి ఏంటి? సింధూన‌ది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మ‌రి చైనాపై కూడా భార‌త్ అణు బాంబులు వేయాలా? మొన్న ప‌హెల్గాం దాడి త‌ర్వాత ఇదే సింధూజ‌లాల‌ విష‌యం వెలుగులోకి వ‌స్తే మేం అణుబాంబులు వేస్తామ‌ని అన్నారు పాక్ దేశ నాయ‌కులు. తీరా భార‌త్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయ‌డం మానేసి.. బంక‌ర్ల‌లో దాక్కున్నారు. ఇరాన్ ద‌గ్గ‌ర అణుబాంబులు ఉంటే..  ప్ర‌పంచానికే అతి పెద్ద విప‌త్తుగా భావించిన అమెరికా.. పాక్ విష‌యంలో ఎందుకో వెన‌క‌డుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భార‌త్ ని భ‌య‌పెట్టి ఆయుధాలు కొనిపించాల‌న్న యోచ‌న అమెరికాది. అందుకే ఆ దేశ గ‌డ్డ‌పై నుంచి ఇలాంటి బీరాలు ప‌లికిస్తోంద‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువ‌డుతున్నాయ్.  మేం పోతే స‌గం ప్ర‌పంచాన్ని లాక్కెళ్లిపోతామ‌ని మీరు భ‌య‌పెడ‌తారేమో.. కానీ భార‌త్ మొన్న‌టిలా చేసి చూపిస్తుంది.  అయినా యుద్ధం జ‌రుగుతుంటే మ‌న ద‌గ్గ‌ర ప్లాన్స్ లేవు ప్రేయ‌ర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భార‌త్ ను భ‌య‌పెట్టేందుకు ప్రయత్నించడం  ఆశ్చ‌ర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాక‌ట్టి పెట్టి బ‌తుకుతున్న మునీర్  సైన్యాధ్య‌క్షుడంటే ఆసియాకే అవ‌మాన క‌రంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.
పాక్ అణుబాంబులు భ‌య‌పెట్ట‌డానికేనా? Publish Date: Aug 11, 2025 4:16PM

ఓట్ల చోరీ.. రాహుల్ ఆరోపణలు.. ఈసీ ఖండనలు!

తాజాగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పులకుప్పగా  మారిందంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయనీ, తాను, తన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు. అయితే ఆయన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతే సాధికారికంగా ఖండించింది.  తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో రాహుల్ చేసిన కొన్ని ఆరోపణలు, వాటికి ఈసీ ఖండనలూ ఇలా ఉన్నాయి..    బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ  స్థానంలో ఒక్కటి వినా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ విజయం సాధించినా, కేవలం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో  ఓట్ల చోరీ కారణంగా సెంట్రల్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఆరోపణను ఈసీ ఆధారాలను చూపుతూ ఖండించింది.  బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఏడింటిలో మెజారిటీ సాధించిందన్నది అవాస్తవం.  ఆ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. రాహుల్ పేర్కొన్నట్లుగా బీజేపీ ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీతో లోక్ సభ స్థానాన్ని గెలుచిందనడం పూర్తిగా అవాస్తవం అని ఈసీ పేర్కొంది.  అదే విధంగా నకిలీ ఓట్ల గురించి రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో   శ్రీవాస్తవ అనే వ్యక్తికి ఏకంగా మూడు రాష్ట్రాలలో  ఓటర్ ఐడీ ఉంది. ఆ మూడు రాష్ట్రాలూ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక. ఈ మూడు రాష్ట్రాలలోనూ శ్రీవాస్తవ ఓటు వేశాడు. ఆయన తన ఓటును బీజేపీకే వేశారంటూ ఉదాహరణగా చూపారు. అయితే ఈ ఆరోపణను కూడా ఈసీ నిర్ద్వంద్వంగా ఖండించింది. శ్రీవాస్తవ అనే వ్యక్తి మూడు రాష్ట్రాలలోనూ ఓటు వేశారనడం అబద్ధమని సాక్ష్యాలతో సహా పేర్కొంది. అయినా శ్రీవస్తవ అనే వ్యక్తి బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా చెప్పగలరని నిలదీసింది. వాస్తవానికి శ్రీవాస్తవక 2011లో యూపీలో, 2016లో మహారాష్ట్రలో నివశించారనీ, ప్రస్తుతం కర్నాటకలో ఉంటున్నారనీ పేర్కొన్న ఈసీ.. ప్రతి సారీ కూడా ఆయన చట్టబద్ధంగా తన ఓటర్ ఐడీని మార్చుకున్నారని, ఒకే సారి మూడు రాష్ట్రాలలో ఓటు వేయలేదనీ ఈసీ విస్పష్టంగా తేల్చేసింది. ఇక ఒకే చిరునామాలో 80 మంది ఓటర్లు నమోదయ్యారన్న ఆరోపణకు కూడా ఈసీ స్పష్టమైన వివరణతో సమాధానం ఇచ్చింది.  వాస్తవానికి రాహుల్ చెప్పిన చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే సత్రాలుఆ చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే చావళ్లు. అంటే సత్రాలలాంటివన్న మాట.  అక్కడ పనివాళ్లు, సెక్యూరిటీ గార్డులు  తాత్కాలికంగా వచ్చి ఉంటారు. తర్వాత అక్కడ నుంచి మారిపోతారు. అలాంటి చావళ్లను  అడ్రస్ ప్రూఫ్‌గా   ఉపయోగించుకుని ఓటరు ఐడిలు  పొందారు కానీ అక్కడ వారు నివసించడంలేదు. అంత మాత్రాన అవన్నీ నకిలీ ఓట్లు ఎలా అవుతాయని ఈసీ నిలదీస్తోంది. అంతే కాకుండా వారంతా బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నిస్తోంది.  మొత్తం మీద ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేపట్టిన ఆందోళన, ఉద్యమం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మొత్తం మీద రాహుల్ ఆరోపణలు, ఈసీ ఖండనలు నోటీసులతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. 
ఓట్ల చోరీ.. రాహుల్ ఆరోపణలు.. ఈసీ ఖండనలు!  Publish Date: Aug 11, 2025 4:04PM

నీతా అంబానీ గ్యారేజ్‌లో దేశంలోనే ఖరీదైన రూ.100 కోట్ల కారు

అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు  బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.  ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ  గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ   ఓ  కారు మాత్రం వార్తల్లో నిలుస్తోంది.  దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన ఆ కారు ఖరీదు, అందులోని ఫీచర్ల గురించి ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కారు దేశంలోనే అత్యంత ఖరీదైనదని అంటున్నారు.  ఆ కారు పేరు ఆడీ ఏ9 చమేలియన్ . ఈ కారు ఖరీదు అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఈ కారులో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయట. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే,  ఈ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చుకోగలదట.  ఈ కారు ఎప్పటికప్పుడు తన రంగులను మార్చుకుంటుందట. ఒక్క బటన్ నొక్కితే చాలు,  కారు రంగు మారిపోతుందట. ఈ కారు పెయింటింగ్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 11 మాత్రమే ఉన్నాయట.ఈ కారు సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్‌తో స్పేష్ షిప్‌లా కనిపిస్తుంది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు అయిన ఈ ఆడి ఏ9 చమేలియన్ రెండు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ కారులో 4.0-లీటర్ V8 ఇంజిన్‌ అమర్చారు. ఇది  600 సీసీ హార్స్‌పవర్‌ కారు. కేవలం మూడున్నర సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల   వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. అందుకే నీతా అంబానీకి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది.
నీతా అంబానీ గ్యారేజ్‌లో దేశంలోనే ఖరీదైన రూ.100 కోట్ల కారు Publish Date: Aug 11, 2025 3:33PM

హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారీ అంటూ చీటింగ్..నిందితులు అరెస్ట్

బంగారం తయారు చేస్తామంటూ జనాలను మోసం చేస్తున్న నిందితుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.   హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం తయారు చేసి ఇస్తామంటూ నాగపూర్ కు చెందిన ఓ ముఠా హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతోంది. అమాయకుల నుంచి  లక్షల్లో డబ్బు చోరీ చేస్తున్న ముఠాలోని ముగ్గురిని ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు  అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ కు చెందిన గ్యాంగ్ హైదరాబాద్ లోకి ప్రవేశించి స్వామీజీ వేషధారణలో కష్టాలు తొలగిపోయేలా రెండు కేజీల బంగారం తయారుచేసి ఇస్తామంటూ అమాయక  జనాలను బురిడీ కొట్టిస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే బంజారాహిల్స్ కి చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ గ్యాంగ్ మాయలో పడ్డాడు.  హిమాలయాల్లో దొరికే మూలికలతో , భస్మంతో తయారు చేసిన బంగారాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని, ప్రతి పనిలో విజయం సాధిస్తారంటూ నమ్మించి ...గోపాల్ సింగ్ వద్దనుండి 10 లక్షల రూపాయలు తీసుకొని... అతని అతని ఇంటికి వెళ్లి నెల రోజుల పాటు పూజలు చేసి అనంతరం ఒక ఎర్ర  బట్టలో రెండు కేజీల బంగారం ఉందంటూ వారి చేతికి ఇచ్చారు. వారం రోజులు పూజ గదిలో ఉంచిన అనంతరం దీనిని తెరిచి చూడాలని సూచించారు. అయితే గోపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఐదు రోజుల తర్వాత ఆ బట్ట తెరిచి చూడగా బంగారపు రంగులో ఉన్న ఇనుప ముక్కలు కనిపించాయి. స్వామీజీలమంటూ తమకు ఆ ఇనుపముక్కలను అంటగట్టిన వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముఠాలోని ముగ్గు రిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.  ఈ ముఠా నిజాంపేట్ లోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్, నాగోల్ లోని మహాలక్ష్మి ఆయుర్వేదిక్ సెంటర్లలో ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీరు హిమాలయాల్లో నుండి భస్మం తీసుకువచ్చి... జనాలను నమ్మించి... మోసాలకు పాల్పడుతూ...    లక్షల్లో నగదు దోచేస్తున్నారు.  ఇప్పుడు నిందితులను అరెస్టు చేయడంతో మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.  
హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారీ అంటూ చీటింగ్..నిందితులు అరెస్ట్ Publish Date: Aug 11, 2025 3:07PM

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్

ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 10) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది వంటి అన్ని వివరాలతో కూడిన జీవోను   ప్రభుత్వం విడుదల చేసింది.  ఈ జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందన్ని స్పష్టం చేసింది.  ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ధానికులైన మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ జండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.  స్త్రీ శక్తి పథకం కింద   మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్ జెండర్ లు ఈ ఉచిత ప్రయాణానికి అర్హులు. అయితే పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.  సప్తగిరి ఎక్స్ ప్రెస్ , సూపర్ లగ్జరీ , నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, ఎసీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి  అవకాశం ఉండదు. 
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్ Publish Date: Aug 11, 2025 1:27PM

వన్డే వరల్డ్ కప్ 2027కు కోహ్లీ, రోహిత్‌లు అనుమానమేనా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలు రెండేళ్ల తర్వాత జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.  గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఇద్దరూ ఒకేసారి టెస్ట్ ఫార్మాట్‌ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వీరిద్దరూ వన్డేల్లో మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డే క్రికెట్ నుంచి కూడా వైదొలగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఒకేసారి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.  నిజానికి వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రపంచకప్ ఆడాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే దేశీయ వన్డే సిరీస్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడవలసి ఉంటుంది. 2007 ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలంటే అప్పటి వరకు వారిద్దరు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంతో పాటు ఫామ్‌లో ఉండటం అవసరం. ఈ నేపధ్యంలో వారిద్దరనీ ఎంపిక చేయడానికి బీసీసీఐ ఓ కండీషన్ పెట్టిందంట. ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం వీరిని పరిగణనలోనికి తీసుకుంటామన్నదే ఆ కండీషన్ గా చెబుతున్నారు. అంటే విజయ్ హజారే ట్రోఫీలో  వీరు ఆడకపోతే వరల్డ్ కప్ దారులు మూసుకుపోయినట్టే.  ఇక టీమ్ ఇండియా కోచ్  యువ ఆటగాళ్లవైపే మొగ్గు చేపుతాడన్నది తెలిసిందే.  టెస్టుల విషయంలోనూ అదే జరిగిందనీ,  గిల్‌కు సారథ్యం ఇవ్వడం వెనుక కారణం అదే అంటున్నారు.  ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడాలనే తొలుత  రోహిత్, కోహ్లీ భావించారంట. కానీ భవిష్యత్తు అవసరాలు దృష్య్టా ఎంపిక కష్టమని బీసీసీఐ వర్గాలు చెప్పడంతోనే  వారు టెస్టులకు గుడ్ బై చెప్పారట. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో బీసీసీఐ, గంభీర్ వ్యూహాలు ఫలించి భారత్ యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను డ్రాగా ముగించారు.  ఆ క్రమంలో రోహిత్, కోహ్లీ భవితవ్వం ఏంటో మరో రెండు నెలల్లో వచ్చే ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌లో తేలనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మే ఉన్నాడు.  ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సారథ్యంలో ఇండియా నెగ్గింది.  అయితే  ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌కి శుభమన్‌గిల్‌కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఇక పోతే కోహ్లీ, రోహిత్ లు వచ్చే వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అన్నది విజయ్ హజారే ట్రోఫీ తేల్చేస్తుంది. ఆ  ట్రోఫీలో ఆడితేనే రోహిత్, కోహ్లీ పేర్లను ప్రపంచకప్ కోసం పరిశీలిస్తారు. ఒక వేళ ఆ ట్రోఫీలో వీరిరువురూ ఆడినా, అందులో వారు రాణించడంపైనే వరల్డ్ కప్ జట్టకు ఎంపక ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు. కాగా ఈ పరిస్థితుల నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత  తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 2027 ప్రపంచకప్ లోపు టీమిండియా మరో ఆరు వన్డే సిరీస్‌లు ఆడనుంది.
వన్డే వరల్డ్ కప్ 2027కు కోహ్లీ, రోహిత్‌లు అనుమానమేనా? Publish Date: Aug 11, 2025 1:14PM

రాహుల్ గాంధీ అరెస్టు

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.  గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై కాంగ్రస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి  ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.  బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా నిరసనలు తెలుపుతున్న విపక్షాలు  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయల్దేరాయి. తాజాగా  సోమ వారం పార్లమెంట్ భవనం నుంచి ఈసీ  కార్యాలయానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహించ తలపెట్టాయి.  అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ కు వెళ్లే మార్గంలో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. అయితే విపక్ష ఎంపీలు వాటిని దాటుకుని వేళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సందర్భంగా పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలను  అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. 
రాహుల్ గాంధీ అరెస్టు Publish Date: Aug 11, 2025 12:47PM

జగన్ మేనమామపై కేసు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై   విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  నిబంధనలను ఉల్లంఘించి తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే  రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం (ఆగస్టు 10) ఉదయం మాజీ ఎమ్మెల్యే  రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం  ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన రాజకీయ వ్యాఖ్యలూ, విమర్శలూ చేశారు.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.  తాము జగన్ వెంటే ఉన్నామని చెప్పేందుకు పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. పులివెందులలో  వైసీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడికి పాల్పడుతూ తెలుగుదేశం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రాజకీయ ఆరోపణలు చేశారంటూ టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 
జగన్ మేనమామపై కేసు Publish Date: Aug 11, 2025 12:27PM

రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.  2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక  కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే.. ఈ కేసుకు సంబంధించి రూ. 38.69 కోట్ల విలువైన 43 ఆస్తులను  ప్రభుత్వపరం చేయాలని ఆ చార్జిషీట్ లో పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈడీ చార్జ్ షీట్ పై విచారణ అంశాన్ని ఈ నెల 28కి వాయిదా వేసింది.   గురుగ్రామ్‌లోని భూమి అమ్మకానికి సంబంధించి రాబర్ట్ వాద్రా తప్పుడు వివరాలతో దస్తావేజులు సృష్టించారని ఈడీ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. భూమి విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపారనీ, దీనివల్ల హర్యానా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 44 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొంది.   అంతే కాకుండా ఈ లావాదేవీల ద్వారా రాబర్ట్ వాద్రా 58 కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని, ఇది మనీలాండరింగ్ ద్వారా వచ్చినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది
రాబర్ట్ వాద్రాపై  ఈడీ చార్జిషీట్ Publish Date: Aug 11, 2025 11:19AM

పులివెందుల వ‌ర్సెస్ కుప్పం

పులివెందుల‌లో గెల‌వ‌గానే  రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెల‌వ‌డం సాధ్య‌మేనా? ఇదీ వైసీపీ నేత‌ల ప్ర‌శ్న‌. అదే కుప్పంలో గెల‌వ‌గానే వైసీపీ ఆంధ్ర అంత‌టా విజ‌యం సాధించిన‌ట్టేనా? ఇది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా వినిపించే ప్ర‌శ్న‌.  ప్ర‌స్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద  తెలుగుదేశం ఫుల్ ఫోక‌స్ పెట్టింది. ఎక్క‌డైతే వైసీపీ బ‌లంగా ఉందో.. అక్క‌డే దెబ్బ కొట్టాల‌న్న‌ది ఆ పార్టీ  వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే క‌డ‌ప‌ జిల్లాలో మ‌హానాడు నిర్వహించింది.   ఈ క‌ల్చ‌ర్ ఈనాటిది కాదు.. ఎప్ప‌టి నుంచో ఉంది. రాజ‌కీయ‌మంటేనే అది. కాలేజీ రాజ‌కీయాల నుంచి పెద్దిరెడ్డికి, చంద్ర‌బాబుకీ పోటీ. ఆ మాట‌కొస్తే రెడ్లు త‌ప్ప రాజ‌కీయాలు క‌మ్మ‌ల‌కు సూటుకావంటూ సాగుతుంది ఈ సంకుల స‌మ‌రం. తొలి నాళ్ల‌లో చంద్ర‌బాబు త‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో.. మ‌నం నిజంగానే రాజ‌కీయాల‌కు సూటుకామా? అన్న కోణంలో దిగాలు ప‌డ్డ ప‌రిస్థితి ఉంది. అయినా స‌రే ఎ తొలిసారి నుంచి చంద్ర‌గిరిలో గెలిచి.. ఆపై కుప్పం  నుంచి ఆయ‌న 40 ఏళ్లుగా గెలుస్తూనే వ‌స్తున్నారు. నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు కూడా. అలాంటి కుప్పంలో ఎలాగైనా స‌రే గెల‌వాల‌న్న‌ది జ‌గ‌న్ ఎత్తుగ‌డ. మొన్న ఇక్క‌డ వైనాట్ వ‌న్ సెవంటీ ఫైవ్ లో బాగంగా కుప్పంలో గెలిచి తీరాల్సిందే అన్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేసింది వైసీపీ. భ‌ర‌త్ ని భారీ ఎత్తున స‌న్న‌ద్దం చేసింది. కానీ భ‌ర‌త్ కూట‌మి గాలిలో కొట్టుకు పోవ‌ల్సి వ‌చ్చింది.  కుప్పం అంటే బాబు- బాబు అంటే కుప్పం అన్న‌ది ఒక బ్రాండ్ గా మారింది.  అందుకే బాబు కుప్పం నుంచి కూర‌గాయ‌లు విమానాల ద్వారా ఎగుమ‌తి చేసే ఏర్పాట్లు చేస్తామ‌ని బ‌హుమానం ప్ర‌క‌టించారు. అంతే కాదు త‌న సొంత సెగ్మెంట్లో ఇల్లు క‌ట్టుకోవ‌డంతో పాటు ఆ నియోజక వ‌ర్గానికి.. త‌న స‌తీమ‌ణిని ఇంచార్జ్ గా చేసి అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా  ప‌రిశీలిస్తున్నారు.  ఇదిలా ఉంటే, పులివెందులలో ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత  దేశ వ్యాప్తంగా జ‌రిగిన‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి ఒకే ఒక్క‌డిగా గెలిచారు వైయ‌స్ఆర్. అంటే అప్ప‌టి నుంచి పులివెందుల వైయ‌స్ ఫ్యామిలీకి అంత ప‌ట్టున్న సెగ్మెంట్. ఇక్క‌డ ఇత‌ర పార్టీలు పాగా వేయ‌డం అంత తేలికైన ప‌ని కాదు. బీటెక్ ర‌వి ఇక్క‌డ ఎప్ప‌టి నుంచో విజ‌యం రుచి చూడ్డం కోసం ఎదురు  చూస్తున్నారు కానీ ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు. కార‌ణం ఇక్క‌డ రెడ్లు, బీసీ, ఎస్సీ ఎస్టీ క్రిష్టియ‌న్ మైనార్టీ ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా వైయ‌స్ కుటుంబానికి గ‌మద్దతుగా నిలవడం ఒక రివాజుగా వ‌స్తోంది.  కాబ‌ట్టి ఇట్స్ నాట్ సో ఈజీ. అలాంటి నియోజక వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌డం వ‌ల్ల తమ ఆధిప‌త్యం మ‌రింత స్ప‌ష్టంగా నిరూపించ‌వ‌చ్చ‌న్న భావ‌న‌లో ఉంది తెలుగుదేశం. అంతే కాదు లోకేష్ ని అడ్డు పెట్టుకుని ఆయ‌న త‌న‌కు సొంతం కాని మంగ‌ళ‌గిరిలో ఎలా పోటీ చేశారో అలా పోటీ  చేసి జ‌గ‌న్ త‌న స‌త్తా చాటాల‌న్న స‌వాళ్లు కూడా ఉన్నాయి. ఇక సీఎం స్థాయి వ్య‌క్తుల‌ సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిస్తే ఎలాంటి పరిణామ క్ర‌మాలు సంభ‌విస్తాయో చెప్ప‌డానికి కొండంగ‌ల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్క‌డ ఓడిన రేవంత్ రెడ్డి త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంపీగా మ‌ల్క‌జ్ గిరి నుంచి పోటీ చేసి గెలిచి.. అటు పిమ్మ‌ట పీసీసీ చీఫ్ గా ఎదిగి ఆపై ముఖ్య‌మంత్రి పీఠంలో స‌గ‌ర్వంగా కూర్చుకున్నారు. ఇలా ఉంటుంది ఒక సీఎం సెగ్మెంట్ తో పెట్టుకుంటే. ఇక కేసీఆర్ గ‌జ్వేల్ విష‌యానికే వ‌స్తే.. ఇక్క‌డ కేసీఆర్ కి ఎంత వ్య‌తిరేక‌త ఉన్నా  కూడా ఈ ప్రాంత వాసులు ఆయ‌న్నే పదే ప‌దే గెలిపిస్తారు. కార‌ణ‌మేంటంటే.. కేసీఆర్ వ‌ల్ల జాతీయ స్థాయిలో త‌మ నియోజ‌క‌వ‌ర్గం పేరు మారు మోగుతోంది కాబ‌ట్టి. అలా ఉంటుంది ఆయా వీవీఐపీ నియోజక వ‌ర్గాల్లోని ప్ర‌జానాడి. ఇపుడు పులివెందుల‌లో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించడం  ద్వారా తెలుగుదేశం పార్టీ  వైసీపిని జగన్ అడ్డాలో  దెబ్బ తీసి సత్తా చాటి తొడగొట్టాలని  చూస్తోంది. ఒక ర‌కంగా చెబితే అది జ‌గ‌న్ ని ఆయ‌న ప‌రివార‌గ‌ణాన్ని ఒకింత ఎక్కువ రెచ్చ‌గొట్ట‌డ‌మే అవుతుంద‌ని అంచ‌నా వేస్తారు విశ్లేష‌కులు. ఒక వేళ నిజంగానే ఈ ఉప‌ ఎన్నికలో టీడీపీ గెలిస్తే అది భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సవాళ్లకుకు దారి తీస్తుందనడంలో  ఎలాంటి  సందేహం లేదు. అలాగ‌ని రాజ‌కీయ పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోకుండా ఉండవు.  ఒక పార్టీ అంటే అన్ని చోట్లా గెల‌వాల‌నుకుంటుంది. గ‌తంలో ఎన్టీఆర్, ఇందిర వంటి వారికే వారి వారి సొంత నియోజకవర్గాలలో ఓడిన పరిస్థితి ఉంది.  కాబ‌ట్టి... గెలుపు ఓటములు  స‌ర్వ‌సాధార‌ణం. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆస‌క్తి క‌రం కూడా.
పులివెందుల వ‌ర్సెస్ కుప్పం Publish Date: Aug 11, 2025 11:07AM

మెట్ పల్లిలో భారీ అగ్రిప్రమాదం.. గన్నీ బ్యాగ్స్ గోడౌన్ లో 24 గంటలుగా అదుపులోకి రాని మంటలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్ పల్టిలోని వ్యవసాయ మార్కెట్ లో ఆదివారం ( ఆగస్టు 10) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సోమవారం (ఆగస్టు 11) ఉదయానికి కూడా అదుపులోనికి రాలేదు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని గన్నీ సంచుల గోదాంలో  మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనూ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. భారీ పొగ కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆరు అగ్నిమాపక యంత్రాలతో  గత 24 గంటలుగా మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోనికి రాలేదు. జేసీబీలతో గోడౌన్ గోడలు కూల్చి మంటలను  అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా.. భారీ సంఖ్యలో గోనె సంచులు ఉండటంతో అవన్నీ అంటుకుని పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. కాగా సంఘటనా స్థలాన్ని ఆదివారం (ఆగస్టు 10) రాత్రి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోనికి వచ్చిన తరువాత మాత్రమే నష్టం అంచనా వేయడానికి వీలౌతుందని అధికారులు తెలిపారు. 
మెట్ పల్లిలో భారీ అగ్రిప్రమాదం.. గన్నీ బ్యాగ్స్ గోడౌన్ లో 24 గంటలుగా అదుపులోకి రాని మంటలు Publish Date: Aug 11, 2025 10:55AM

ఈడీ విచారణకు సినీ నటుడు దగ్గుబాటి రాణా

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రాణా సోమవారం (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే  చిత్రపరిశ్రమకు చెందిన పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్, విజయదేవరకొండ తదితరులు ఈడీ విచారణకు హాజరైన సంగతి విదితమే. ఇలా ఉండగా ఇదే కేసులో ఈడీ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మికి కూడా నోటీసులు జారీ చేసింది. బుధవారం (ఆగస్టు 13) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.   బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా నమోదైన కేసులపై ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్ రాజ్ ఇకపై బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయనని తెలిపారు. ప్రజలకు హాని చేసే వ్యాపారాల ప్రమోషన్ లకు దూరంగా ఉంటానని విచారణ అనంతరం ప్రకటించారు.  ఇక విజయ్ దేవరకొండ అయితే..తాను అసలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదనీ, తాను ప్రమోషన్ చేసినది గేమింగ్ యాప్ అని పేర్కొన్నారు. లీగల్ గా కొనసాగుతున్న గేమింగ్ యాప్ ప్రమోషన్ లో మాత్రమే తాను పాల్గొన్నానని చెప్పిన విజయ దేవరకొండ.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.  
 ఈడీ విచారణకు సినీ నటుడు దగ్గుబాటి రాణా Publish Date: Aug 11, 2025 10:32AM

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గత వారం అంతా భక్త జనసందోహంతో కిటకిట లాడిన తిరుమలలో సోమవారం ( ఆగస్టు 11) భక్తుల రద్దీ ఒకింత తగ్గింది. తిరుమల వేంకన్న దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో మూడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఆగస్టు 10) శ్రీవారిని మొత్తం 82 వేల 629 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 505 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది. 
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు Publish Date: Aug 11, 2025 10:00AM

ఆరోగ్యం కోసం  డీటాక్స్ జ్యూసులు తీసుకుంటున్నారా? ఈ నిజాలు తెలుసా?

  శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ  డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు.  ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు.  సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. డిటాక్స్ జ్యూస్లు  కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్  తయారీలో ఉపయోగించే పదార్థాలు,  వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి.. నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్,  క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి  డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన,  కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి.  వీటికి బదులు  ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి.  లేదా వీటిని  పరిమితం చేయాలి.  మాంసాహారం తినాలని ఉంటే   లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. ధూమపానం,  అధికంగా  మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం,  కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.  కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన,  పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా.  రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన,  సురక్షితమైన విధానం.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యం కోసం  డీటాక్స్ జ్యూసులు తీసుకుంటున్నారా? ఈ నిజాలు తెలుసా? Publish Date: Aug 11, 2025 9:30AM

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను మర్చిపోవద్దు..!

చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశం చక్కగా వివరించబడింది. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, విద్య, వ్యాపారం మొదలైన అన్ని విషయాలపై నైతిక పాఠాలను అందించాడు. ఇదిలా ఉంటే పెళ్లి గురించి ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. అది జీవితాంతం ఉండే అనుబంధం. వైవాహిక జీవితం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలంటే ఇరువైపులా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరస్పర సామరస్యం,  ప్రేమపై ఆధారపడిన సంబంధం మాత్రమే బలపడుతుంది. కాబట్టి చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఏ అంశాలు దారితీస్తాయో ఇక్కడ వివరాలు ఉన్నాయి. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు సహచరులు, పోటీదారులు కాదు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భార్యాభర్తలిద్దరూ కలిసి ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే రెండు సమస్యలనూ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చేసి పరిష్కరించుకోవాలి. ఆచార్య చాణక్య ప్రకారం ప్రతి సంబంధానికి వారి వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. అదేవిధంగా, భార్యాభర్తల మధ్య కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ మూడవ వ్యక్తికి చెప్పకూడదు, లేకుంటే వారి పరస్పర సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను ఒకరు చూసుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మనం ఒకరి భావాలను గౌరవించుకోవాలి. మద్దతు ఇవ్వాలి.  మీ వైవాహిక జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే , భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఓపిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మీ సంబంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక దృక్పథం ఉండాలి. సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్నేహితులలా ఉండాలి. ఇద్దరి మధ్య సమానత్వ భావన ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను మర్చిపోవద్దు..! Publish Date: Aug 11, 2025 9:30AM

మోడీ- పుతిన్- జిన్ పింగ్ క‌లిస్తే..ఏమ‌వుతుంది???

  ట్రంప్ అస‌లు బాధంతా ఇదే. గ‌త అధ్య‌క్షుల‌కు కేవ‌లం ర‌ష్యా మాత్ర‌మే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య‌ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆయుధం ప‌ట్ట‌ని అమెరికా..  పెర్ల్ హార్బ‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత అణుబాంబు వ‌ర‌కూ ఆయుధాల త‌యారీ నేర్చుకుంది. ఆపై ర‌ష్యాతో పోటీ  ప‌డుతూ.. ఇటు ఆయుధాల‌తో పాటు అటు స్పేస్ లోనూ మున్ముందుకు వెళ్తూ వ‌చ్చింది. ఫైన‌ల్ గా ఇప్పుడు నాసా పేరు ఎక్కువ‌గా  వినిపిస్తోంది ప్ర‌పంచంలో. ర‌ష్య‌న్ స్పేస్ గురించి ఎక్క‌డా ఊసే ఉండ‌దు. దీనంత‌టికీ కార‌ణం పోటీ. ఆపై చైనాతో పోటీప‌డ్డం మొద‌లైంది అమెరికా. చైనా వ‌రల్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా ఉంది. పిన్నీసు నుంచి రాకెట్ల వ‌ర‌కూ చైనాపై ఆధార‌ప‌డ‌కుండా ఈ ప్ర‌పంచం ఏదీ చేయ‌లేదు. ముందుకు వెళ్ల‌లేదు. మొన్న రాహుల్ గాంధీ ఒక స్మార్ట్ టీవీ యూనిట్లోకి వెళ్లి చూడ‌గా తెలిసిందేంటంటే.. కేవ‌లం పై డ‌బ్బాలు త‌యారు చేయ‌డం స్టిక్క‌ర్లు వేయ‌డం త‌ప్ప మ‌న మేకిన్ ఇండియా ఏమంత ఎఫెక్టివ్ గా లేద‌ని తేల్చి చెప్పారాయ‌న‌. దానర్ధం ఏంటంటే  చైనాను కాద‌ని మ‌న‌మేం చేయ‌లేక పోతున్నామ‌ని. మ‌న‌మే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి. ఈ విష‌యంలో ట్రంప్ ఎలాగైనా స‌రే చైనాతో పోటీ ప‌డ‌దామ‌ని ట్రై చేస్తున్నారు. ఇప్ప‌టికే చైనా ఆర్మీ  ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. దాని త్రివిధ ద‌ళాల‌తో పోల్చితే అమెరికన్ ఆర్మీ జుజుబీ. దీంతో స్మార్ట్ వార్ చేయ‌డ‌మెలా?. అన్న‌ది ప్రాక్టీస్ చేస్తూ వ‌స్తోంది. గ‌త కాల‌పు అధ్య‌క్షుడు రొనాల్డ్ రీగ‌న్ ప్ర‌వేశ పెట్టిన స్టార్ వార్ త‌ర‌హాలో గోల్డ‌న్ డోమ్ అనే సేఫ్టీ లైన్ ప్ర‌వేశ పెట్టే యోచ‌న చేస్తున్నారు ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరిక‌న్ ర‌క్ష‌ణ రంగ నిపుణులు. ఇదే ర‌ష్యా సంగ‌తి చూస్తే ర‌ష్యా మొత్తం నాశ‌న‌మైనా కూడా ఆటోమేటిక్ ట్రిగ‌రింగ్ ద్వారా ప్ర‌పంచాన్ని నామ‌రూపాల్లేకుండా చేయ‌గ‌లిగే స‌త్తా త‌మ సొంత‌మ‌ని గుర్తు చేస్తోంది ఆ దేశం. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే.. ఈ దేశాన్ని పాక్ ఉగ్ర‌వాదులు సాయంతో.. కెలికి ఆపై యుధ్దానికి ప్రేరేపించి అటు పిమ్మ‌ట ఆయుధ కొనుగోళ్లు చేయిద్దామ‌ని చూసింది యూఎస్. తెలివి మీరిన భార‌త్ ప‌క్కా వ్యూహ‌ర‌చ‌న‌తో హండ్ర‌డ్ ప‌ర్సంట్ స్ట్రయిక్ రేట్ తో.. ఇటు ఉగ్ర‌వాదుల‌ను అటు చైనా  పీఎల్ 15లు, ఆపైన అమెరిక‌న్ ఎఫ్  16 ల‌ను ప‌డ‌గొట్టి దుమ్ము దులిపేసింది. దీనంత‌టికీ కార‌ణం వ్యూహ‌ర‌చ‌న‌. స‌రిగ్గా పాక్ అణు నిల్వ‌లున్న కిరానా కొండ‌ల‌పై బ్ర‌హ్మోస్ ల‌ను వ‌ద‌ల‌డంతో.. అక్క‌డ ప‌డ్డ దెబ్బ ఇటు పాక్ కి అటు అమెరికాకి  కూడా దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింది. దీంతో జ‌డుసుకున్న పాక్ అమెరికా కాళ్లు ప‌ట్టుకుని.. కాల్పుల విర‌మ‌ణ బేరానికి వ‌చ్చింది. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా ఈ మూడు అగ్ర‌దేశాలు ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న‌వారే. మొన్న‌టికి మొన్న‌.. అమెరిక‌న్ ఎఫ్- 35ల‌ను వ‌ద్ద‌ని  రిజెక్ట్ చేసింది భార‌త్. మ‌నం కూడా దాని ప‌నితీరు కేర‌ళ ట్రివేండ్రం ఎయిర్ పోర్టులో ఆగిన‌పుడు చూసే ఉంటాం. 40 మంది మెకానిక్ లు వ‌చ్చినా కూడా దాన్ని రిపేర్ చేయ‌లేక పోవ‌డంతో.. గ్లోబ్ మాస్ట‌ర్ సాయంతో బ్రిట‌న్ కి ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వ‌చ్చింది. ఇక 2018లో తాడ్ ల‌ను కొన‌మ‌ని ప్రెష‌ర్ చేసింది యూఎస్. మాకొద్దా ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్ అని తెగేసి చెప్పి.. ఎస్ 400 ల‌ను కొనుగోలు చేసింది భార‌త్. కార‌ణం అమెరికా న‌మ్మ‌ద‌గిన దేశ‌మేం కాదు. అదే ర‌ష్యా ఇటు బ్రహ్మోస్ వంటి మిస్సైళ్ల‌ త‌యారీకి సాంకేతిక సాయం చేస్తూనే.. అటు తాము యుద్ధంలో ఉండ‌గా కూడా ఎస్ 400 డెలివ‌రీ చేసింది. అంతేనా ఏ చిన్న సైనిక సాయం కావాల‌న్నా చేస్తుంది. అదే అమెరికా మ‌నం కార్గిల్ వార్ లో ఉండ‌గా.. జీపీఎస్ సిస్ట‌మ్ ని ఆపి హ్యాండ్ ఇచ్చింది. .ఇలాంటి న‌మ్మ‌క ద్రోహ దేశం వ‌ద్ద ఏం కొన్నా స‌రే మ‌న‌కేం పెద్ద యూజ్ అవ‌దు.  గ‌తంలో పెంట‌గాన్ రిపోర్టుల‌ను బ‌ట్టీ చూస్తే ప్ర‌పంచంలోనే అమెరికా ద‌గ్గ‌ర  ఆయుధాలు కొనే దేశాల్లో మ‌నం థ‌ర్డ్ ప్లేస్ లో ఉండేవారం. కానీ అమెరికా దాని నీచ బుద్ధి బ‌య‌ట ప‌డుతూ వ‌చ్చాక‌.. మ‌నం ఆయుధాల ప‌రంగా దూరం జ‌రుగుతూ వ‌స్తున్నాం. ప్ర‌స్తుతం ట్రంప్ కోపం కూడా అందుకే. భార‌త్ ర‌ష్యాకు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంటే ప‌రిస్థితి.. అమెరికాకి మైండ్ పోతోంది. దానికి తోడు మ‌నం ప్ర‌తిదానికీ ర‌ష్యా స‌హ‌కారంతో సొంత సిస్ట‌మ్ త‌యారు చేసుకుంటూ వ‌స్తున్నాం. ఎస్ 400 త‌ర‌హాలో ప్రాజెక్ట్ కుషా. ఆపై ఎఫ్ 35 ల లాంటి ఫిఫ్త్ జెన్ ఫైట‌ర్ జెట్స్.. ఇలా ఓన్ ప్రొడ‌క్ష‌న్ మొద‌లు పెట్టాం. ఎందుకంటే గ‌త ఆప‌రేష‌న్ సిందూర్ లోపాక్ ఇటు అమెరికా అటు చైనా, ట‌ర్కీల‌ నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సాయం పొందింది. వారంత‌ట వారు త‌యారు చేసుకోలేక పోవ‌డం వ‌ల్ల‌.. ఆ దేశం చివ‌ర్లో బోల్తా కొట్టింది. మ‌న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పిన‌ట్టు.. ఆయుధం ఉండ‌గానే స‌రిపోదు. దాన్ని వాడే సామ‌ర్ధ్యం కూడా అత్య‌వ‌స‌రం. అదెప్పుడు సాధ్య‌మంటే వాటిని మ‌న‌మే త‌యారు చేసుకోవ‌డం వ‌ల్ల స‌గానికి  స‌గం త‌ర్పీదు అయి ఉంటామ‌ని అంటారాయ‌న‌. దానికి తోడు ఆయుధ త‌యారీలో ర‌ష్యన్ మేడ్ మోస్ట్ ప‌ర్ఫెక్ట్ క‌మ్ ప‌వ‌ర్ఫుల్. మొన్న‌టి యుద్ధంలో పాక్ ని మ‌నం క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించింది ఎస్ 400 లు. ఈ విష‌యాన్ని తాజాగా మ‌న ఎయిర్ చీఫ్ ఏపీ సీంగ్ సైతం చెప్పుకొచ్చారు.. మ‌నం ఎఫ్ 16ల‌తో స‌హా ఆరు యుద్ధ విమానాలు ప‌డ‌గొట్టామంటే కార‌ణ‌మ‌దే. ఈ విష‌యం పాక్ ఒప్పుకోకున్నా ట్రంప్ సైతం అవును నిజ‌మేన‌న్నారు.   అలాంటి కండీష‌న్లో ర‌ష్యా- భార‌త్- చైనా అనే ఈ మూడు దేశాలు క‌లిస్తే స‌గం ప్ర‌పంచం అటు వైపు మొగ్గుతుంది. మ‌రో స‌మ‌స్య  ఏంటంటే భార‌త్ కి ఈ మూడు దేశాల్లోనే కాస్త మ‌ర్యాద‌రామ‌న్న ల‌క్ష‌ణాలు అధికం. మ‌నం ఎవ‌రినీ యుధానికి ప్రేరేపించం. ఎవ‌రితోనూ యుద్ధం కావాల‌ని కోరుకోం. ఎవ‌రినీ ట‌క్క‌రి బుద్ధుల‌తో దెబ్బ తీయాల‌ని చూడ్డం. దీంతో ఇప్ప‌టికే భార‌త్ ని స‌గం దేశాలు అగ్ర నాయ‌క‌త్వం వ‌హించ‌మ‌ని కోరుకుంటున్నాయ్. ఇదే ట్రంప్ చూడండీ.. ర‌ష్యాతో యుద్ధంలో ఉన్న దేశ‌మ‌ని కూడా వ‌ద‌ల‌కుండా ఉక్రెయిన్ తో ఏ విదంగా ఖ‌నిజ త‌వ్వ‌కాల ఒప్పందం చేసుకున్నారో. ఆపై భార‌త్ తో ఘ‌ర్ష‌ణ‌లో ఉన్న టైంలోనే పాక్ ద్వారా త‌మ కుటుంబ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టించుకున్నారు. ఇదంతా ప్ర‌పంచం చూస్తూనే ఉంది.  దానికి తోడు బ్రిక్ దేశాలన్నీటికీ ఒక భ‌రోసా అందించేలా అత్యంత చౌక ధ‌ర‌ల‌కే మ‌నం ఆయుధాల త‌యారీతో పాటు స‌ర‌ఫ‌రా కూడా చేస్తున్నాం. ఇక్క‌డే ట్రంప్ కి భార‌త్ అంటే ఒళ్లు మండిపోతోంది. ఆయా అమెరిక‌న్ కంపెనీల నుంచి మ‌న వాళ్ల‌ను వాష్ అవుట్ చేయ‌మంటున్నారాయ‌న‌. ఇంకా సుంకాల మోత మోగిస్తామ‌ని చెప్పుకొస్తున్నారు.  ప్ర‌పంచ‌మంతా ట్రంప్ భార‌త్ ని ఏదో భ‌య‌పెట్టి ఇర‌కాటంలో పెడుతున్నాడ‌ని అంటున్నారుగానీ.. దీని ప్ర‌భావం వ‌చ్చే రోజుల్లో బ‌లంగా ఉండ‌నుంది. డాల‌ర్ ద్వారా లావాదేవీల‌ను మానేసి బ్రిక్ దేశాలు త‌మ‌కు తాము స్వ‌యంగా ఒక క‌రెన్సీ ఏర్పాటు చేసుకుని త‌ద్వారా.. చెల్లింపులు చేసుకునేలా తెలుస్తోంది. దీంతో స‌గం ప్ర‌పంచం డాల‌ర్ ని వాడ్డం త‌గ్గించేస్తాయి. దీంతో అమెరికా న‌డ్డి విరిగి న‌ట్టేట్లో ప‌డ్డం ఖాయం. ఇప్ప‌టికే అమెరికా ఒక క‌న్జ్యూమ‌ర్ బేస్డ్ కంట్రీ.. ఆ దేశ ప్ర‌జ‌ల్లో అత్య‌ధిక శాతం క్రెడిట్ కార్డుల‌ను బేస్ చేసుకుని బ‌తుకుతుంటారు. అంతే కాదు.. ప్ర‌భుత్వాలు కూడా య‌ధేచ్చ‌గా రుణాల మాఫీ చేస్తూ ఉంటుంది. ఇంత వెస‌లుబాటుకు కార‌ణం అమెరిక‌న్ డాల‌ర్ లో ప్ర‌పంచంలోని ప్ర‌తి చెల్లింపు జ‌రుగుతుంది కాబ‌ట్టి.. ఆ నిల్వ‌లు ఆ దేశం చెంత అంత ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి. దానికి తోడు ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి వ‌న‌రుపై గుత్తాధిప‌త్యం వ‌హించి ఆపై ఆయా దేశాల‌కు ఇవ్వాల్సిన మొత్తాలు కూడా.. త‌మ ట్రెజ‌రీల్లో దాచుకుంటుంది యూఎస్.  ఒక వేళ డాల‌ర్ చెల్లింపుల‌ను కంట్రోల్ చేయ‌గ‌లిగితే.. దెబ్బ‌కు అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ మొత్తం కుప్ప‌కూలిపోతుంది. ఈ విష‌యం గుర్తించిన బిజినెస్ మెన్ ట్రంప్.. ఒక‌టే సుంకాల బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. కానీ ఈ ప్ర‌భావం భార‌త జీడీపీపై ప‌డేది కేవ‌లం పాయింట్ టూ ప‌ర్సంటేజీ మాత్ర‌మే.. కాబ‌ట్టి ఏం పెద్ద భ‌య‌ప‌డ‌కూడ‌ద‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది. దీంతో పెద్ద‌న్న ట్రంప్ కి లోలోన అణుబాంబులు ప‌డుత‌న్న చ‌ప్పుడు వినిపిస్తోంది..  ఉన్న సిట్యువేష‌న్ కి తోడు.. ఈ మూడు దేశాల క‌ల‌యిక అంటేనే హ‌డలెత్తి పోతోంది ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరికా.
మోడీ- పుతిన్- జిన్ పింగ్ క‌లిస్తే..ఏమ‌వుతుంది??? Publish Date: Aug 10, 2025 5:58PM

హైదరాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన

  హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను  పరిశీలించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది.. అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి సీఎం తెలుసుకున్నారు.  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థను సైతం ఆయన పరిశీలించారు.  ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతుంది. వరుసగా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తునే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. రోడ్లుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి  బాలుడు వివరించాడు. బుద్ధ నగర్‌లో  జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ జశ్వంత్ నుంచి వివరాలు తెలుసుకున్నరు. తను 7వ తరగతి చదువుతున్నట్లు సీఎంకు  జశ్వంత్ వివరించారు. వరద నీరు ఇంట్లోకి చేరడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పిని ముఖ్యమంత్రికి బాలుడు తెలిపాడు. భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని బాలుడికి సీఎం రేవంత్  ధైర్యం చెప్పారు.  మరోవైపు వర్షాలు, సీజనల్ వ్యాధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు మ్యాన్‌హోల్స్‌, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు బయటకి రావొద్దని సూచించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వాటర్ బోర్డు, హైడ్రా అధికారులు పాల్గోన్నారు.  
హైదరాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన Publish Date: Aug 10, 2025 5:43PM

బ్యాగ్ నిండా ప్లాస్టిక్ కవర్లే... కట్ చేస్తే అధికారుల చేతికి చిక్కిన యువకుడు

  ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. అనంతరం సదరు యువకుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి నడుచుకుంటూ వెళుతున్న సమ యంలో కస్టమ్స్ అధికారులు అతని లగేజ్ను చెక్ చేసి... ఒక్కసారిగా ఆశ్చర్య చకితు లయ్యారు. బ్యాగ్ నిండా కవర్లు వాటిని విప్పి చూసిన అధికా రులు నూరేళ్లు పెట్టారు.  అధికా రులు వెంటనే అప్రమత్తమై యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు... ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు ఫ్లైట్ దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయం లో కస్టమ్స్ అధికారులకు అతని కదలికలపై అనుమా నం వచ్చి.... అతని బ్యాగ్ తనిఖీలు చేశారు... కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా గంజాయిని ప్లాస్టిక్ కవర్స్ లలో ప్యాకింగ్ చేసి... వాటిని లగేజ్ బ్యాగ్ అడుగు భాగంలో పెట్టి... దాని పైన దుస్తులు పెట్టుకుని వచ్చాడు. ప్లాస్టిక్ కవర్స్లలో ఉన్న ప్యాకేజీలను తెరిచి చూసిన అధికా రులు ఒక్క సారిగా షాక్ గురయ్యారు.  వీడు మామూలోడు కాదురా బాబోయ్.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 20కోట్లు విలువ చేసే గంజా యిని... ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేసి దర్జాగా తీసుకెళ్తు న్నాడు.అధికారులు వెంటనే ఆ యువ కుడ్ని అదుపులోకి తీసుకొని అతని వద్దనున్న 20 కోట్ల విలువచేసే 19.87 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని యువకుడిపై ఎన్డీపీ ఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసు కొని...  అసలు ఈ గంజాయి ఎక్కడి నుండి తీసుకొస్తు న్నాడు. ఢిల్లీలో ఎవరికి ఈ గంజాయి చేరవేయనున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
బ్యాగ్ నిండా ప్లాస్టిక్ కవర్లే... కట్ చేస్తే అధికారుల చేతికి చిక్కిన యువకుడు Publish Date: Aug 10, 2025 4:58PM

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్‌పై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ

  నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భక్తులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరితగతిన శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకుని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు తిరిగి గమ్య స్థలాలకు  వెళ్లే విధంగా ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాతో పోలీసుల పర్యవేక్షణ చేపట్టారు . నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు  ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.   వరుస సెలవులు రావడంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సి ఐ చంద్రబాబు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాతో శ్రీశైలం హైదరాబాద్ డ్యామ్ పరిసరాలను ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్ జామ్ కు ఏమైనా అవుతుందా అని మొబైల్ పార్టీని అనుసంధానం చేస్తూ శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.  
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్‌పై  డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ Publish Date: Aug 10, 2025 4:35PM

గీత దాటితే అరెస్ట్...కేసీఆర్‌కు రేవంత్ లక్ష్మణ రేఖ

  కాళేశ్వరం నివేదికను ఒక అస్త్రంగా చేసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను అరెస్టు చేస్తారా ? కాళేశ్వరం ప్రాజెక్ట్’ నిర్మాణానికే కాదు, అందులో జరిగిన అవకతవకలకు, కర్త, కర్మ, క్రియ అన్నీ,ఆయనే అని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్’ నివేదిక తేల్చి చెప్పిన నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.  నిజానికి,అరెస్టు చేయడమా, చేయక పోవడమా అనేది, విచారణ  కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకునే నిర్ణయం కాదు. రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయం. అందుకే, రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని,విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం   గతంలో కేసీఆర్’ ప్రభుత్వం తనను జైలుపాలు చేసిన చేదు అనుభవాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోలేదని ఇంతవరకు చెపుతూ వచ్చారు. అలాగే, తప్పక ప్రతీకారం తీర్చుకుంటారని, సన్నిహితులు మాత్రమే కాదు, అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన శపధం గుర్తున్న అందరూ భావిస్తూ వచ్చారు. అయితే,ఇటీవల ఢిల్లీ  మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చచ్చిన పామును ఇంకేం చంపుతాం,అన్నట్లు, ఇప్పటికే కేసీఆర్, ఫార్మ్ హౌస్’ లో స్వీయ’ బందీగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా జైలుకు పంపవలసిన అవసరం లేదు. ఇప్పడు ఆయనకు చర్లపల్లి జైలు అయినా, ఫార్మ హౌస్ అయినా ఒక్కటే’ , ఫార్మ్ హౌస్’ లో సంరక్షణ ఉంటుంది, చర్లపల్లి జైల్లో పహారా. ఉంటుంది .. అదొక్కటే తేడా.. కాబట్టి… అంటూ, కేసీఆర్’ను జైలుకు పంపే ఆలోచన లేదనే ముఖ్యమంత్రి ఒక విధంగా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. ఒక విధంగా అదే తుది నిర్ణయం అనే భ్రమలను కల్పించారు.  అయితే, అదే ప్రభుత్వ అంతిమ నిర్ణయమా లేక కేసీఆర్’ జనంలోకి రాకుండా, ఆయన ముందరి కాళ్లకు బంధం వేసే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అరెస్ట్ ఉండదనే సంకేతాలు ఇచ్చారా,,అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్’ బయటకు రానంత వరకు అరెస్ట్’ ఉండదని కాదని కాలు బయట పెడితే మాత్రం ‘అరెస్ట్’ తప్పదనే సంకేతాలు ఇచ్చారా, అనే అనుమనాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో, ఇప్పటికిప్పడు కేసీఆర్’ను అరెస్ట్ చేస్తే,అందుకు  రాజకీయంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే అభిప్రాయం కూడా, పార్టీ వర్గాల్లో వ్యక్త  మవుతోందని అంటున్నారు. మరో వంక కేసీఆర్’ ను అరెస్ట్ చేయడం వల్లనే కాదు,అరెస్ట్ చేయక పోవడం వలన కూడా కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. గత (2023) అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తెను అరెస్ట్ చేయక పోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల అస్త్రంగా మలచు కున్నారు.  ‘బీజీపీ,బీఆర్ఎస్ ఒక్కటే’ నినాదాన్ని, జనంలోకి బలంగా తీసుకు పోయారు. అదే సమయంలో బీజేపీ ఆదిస్థానం బండి సంజయ్’ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో కాంగ్రెస్’ఆరోపణలకు మరింత బలం చేకూరి బీజేపీ మరింతగా నష్ట పోయిందని, ఇప్పటికీ రాజకీయ విశ్లేషణల్లో వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడే కాదు, ఇప్పటికి  కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూనే వుంది. అయితే, ఇప్పడు కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్, కేసుల్లో కేసీఆర్ ను అరెస్ట్ చేయక పోతే,కాంగ్రెస్ ప్రయోగించిన, ‘కుమ్ముక్కు’ అస్త్రాన్నే బీజేపీ ప్రయోగించే ప్రమాదం వుంది. నిజానికి,బీజీపే సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,ఇప్పటికే ఆరోపణలు ప్రారంభించారు.కేసీఆర్’కు కాంగ్రెస్ అధిష్టానంతో డీల్ కుదిరిందని, ముడుపులు చేతులు మారుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. సో .. ఒక విధంగాచూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో’ చెప్పలేమని అంటున్నారు.అలాగే, రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నివేదికను, అసెంబ్లీ ఇతర వేదికల ద్వారా బీఆర్ఎస్’ను, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు ఉపయోగించుకుంటారే, కానీ, కేసీఆర్’ నే కాదు,ఆయన  కుటుంబం సభ్యుల్లో ఏ ఒక్కరి విషయంలోనూ విచారణలు అరెస్టుల వరకు పోరనే  అంటున్నారు.  ముఖ్యంగా, రేవంత్ రెడ్డి లోపలి మనిషి తెలిసిన సన్నిహితులు, కనిపించినంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోరని అంటారు.అందుకే రేవంత రెడ్డి బయటకు ఆవేశంగా రాజకీయం చేస్తున్నట్లుగా కనిపించిన,కీలక సమయంలో ఆచి తూచి అడుగులు వేస్తారని, గత 18 నెలల పాలనలోనూ అదే వ్యూహాత్మకంగా,పట్టు విడుపులు ప్రదర్శిస్తూ పాలన సాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో  రాజకీయంగా లాభనష్టాలు వేసుకుని ముందడుగు వేస్తున్నారు.ఈ విషయంలో రేవంత్ రెడ్డి భవిష్యత్ వ్యూహాలు, నిర్ణయాలు చర్యలను ఊహించడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.
గీత దాటితే అరెస్ట్...కేసీఆర్‌కు రేవంత్ లక్ష్మణ రేఖ Publish Date: Aug 10, 2025 4:08PM

కర్ణాటకలో మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని

  కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బెంగళూరులో  మూడు వందే భారత్‌ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రధాని  ప్రారంభించారు. ఈ సందర్బంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కేంద్రమంత్రులతో కలిసి ప్రధాని మెట్రోలో ప్రయాణించారు. వారితో సరదాగా ముచ్చటించారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మెజెస్టిక్‌లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్‌కు చేరుకొని బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్‌ రైలుకు పచ్చ జెండా ఊపారు. అలాగే అమృత్‌సర్‌– శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్‌–పూణె మధ్య వందే భారత్‌ రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం ఆర్‌వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకొని మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించి.. మెట్రో రైలులో ఎల్రక్టానిక్‌ సిటీ వరకు ప్రయాణించారు.  
కర్ణాటకలో మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని  Publish Date: Aug 10, 2025 3:50PM

టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

  తిరుమలలో టీటీడీ బోర్డు నిబంధనలను మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు. శ్రీవారి ఆలయం ముందు నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో ఇష్టానుసారంగా రాజకీయ వ్యాఖ్యలు ఆరోపణలు చేశారు. తిరుమలలో దైవ నామస్మరణ మినహా రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని టీటీడీ బోర్డు తీర్మానించింది.  దీంతో రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ సభ్యులు పరిశీలిస్తున్నారు. ఆయన చర్యల సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇష్టానుసారం రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్‌ విభాగం పరిశీలిస్తోంది. బోర్డు తీర్మానాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  
టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే Publish Date: Aug 10, 2025 2:15PM

కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే బాలరాజు

  నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం గూటికి చేరారు. ఇవాళ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు  కాషాయ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షణీయమని  రామచందర్‌రావు అన్నారు. అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలన, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు నచ్చే బీజేపీలో చేరానని అన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. గువ్వల బాలరాజు కూడా ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి రావడం అభినందనీయమని అన్నారు.  అచ్చంపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభివృద్ధికి గువ్వల బాలరాజు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీనీ విమర్శించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఓటమి తప్పదనే విషయాన్ని రాహుల్ ముందే గుర్తించారని.. అందుకే ఈసీపై, మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ మండిపడ్డారు.
కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే బాలరాజు Publish Date: Aug 10, 2025 1:53PM

నిజంగానే పెమ్మ‌సాని..ఈవీఎం ట్యాంప‌ర్ చేయించారా?

  ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ కామెంట్లు ను బ‌ట్టీ చూస్తే... ఏపీ పైనా కొంద‌రు గురి పెట్టి.. ఇక్క‌డ ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశారు. అందుకు ప్ర‌ధాన కార‌కుడు గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు ప్ర‌జ‌ల‌కు క‌నీసం తెలియ‌ని ఇత‌డికి మూడున్న‌ర ల‌క్ష‌ల పై చిలుకు మెజార్టీ ఎలా వ‌చ్చింద‌ని గ‌ట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. అస‌లు పోలింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియ ఎలా జ‌రుగుతుంది? దాని పూర్వాప‌రాలు ఏంట‌ని ఒక సారి చూస్తే..   పోలింగ్ క్లర్కు, పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్.. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్ మ్యానేజ్‌మెంట్, ట్రైనింగ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, లైసనింగ్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్, ర్యాండమైజేషన్, కౌంటింగ్ రూమ్ ఇలా పోలింగ్ క‌మ్ కౌంటింగ్ లోని వివిధ స్థాయిల‌లో ఉంటారు అధికారులు.  ఆ ప్ర‌క్రియ‌లు కూడా అంతే స‌మానంగా పెద్ద ఎత్తున ఉంటాయి.  గ్రామపంచాయతీ సర్పంచ్-  డైరెక్ట్/ ఇండైరెక్ట్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మండల ప్రెసిడెంట్-  డైరెక్ట్ /ఇండైరెక్ట్, జెడ్పీటీసీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన వారు చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. ఇది అత్యంత క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. విప‌రీత‌మైన క్రాస్ చెక్ చేస్తుంటారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తేడా జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త వ‌హిస్తుంటారు. ఈవీయం లు అంటే,  కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్  లు.. ఇవి అంత తేలిగ్గా హ్యాకింగ్ కు గురికావు. వాటికి సిగ్నల్ రిసీవింగ్, ట్రాన్స్మిషన్ చేసే పరికరాలు, నెట్ కనెక్టివిటీ లాంటివి ఏమీ ఉండవు. ఇవ‌న్నీ క‌ల్పిత గాథ‌లు. ఎలక్షన్ కమిషన్ నియమించిన అబ్జర్వర్స్ సమక్షంలో మూడు స్థాయిల్లో జరిగే ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ అధికారులు / ఉద్యోగులు, ఈవీయం వివిధ ప్రత్యేక నంబర్లను కలిగి ఉన్న ఈ మూడు పరికరాలు  లు అనగా ఏ కంట్రోల్ యూనిట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ వీవీ ప్యాట్ లు ఏ ప్యాటర్న్ లో, ఏ పోలింగ్ స్టేషన్ కు వెళతారో / యో అలాట్ చేసిన వారికే తెలియదు.  అక్కడ, ఆ పోలింగ్ స్టేషన్ లో ఎందరు ఓటర్లు ఉంటారో కూడా ఈవీయం కు సంబంధించిన డేటాలో ఉండదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉండే సమాచారం మాత్రమే మొత్తం ఓటర్ల సంఖ్య చెబుతుంది. పోలైన ఓట్ల సంఖ్య తెలియజేస్తుంది. ఆ సంఖ్యకు అనుగుణంగా పార్టీలు / అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంటింగ్ సమయంలో తెలుస్తుంది. పోలింగ్ పూర్తి కాగానే పోలింగ్ ఏజెంట్ల, అబ్జర్వర్ లు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు .. సమక్షంలో బ్యాటరీని ఆఫ్ చేసి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ లను సీల్ చేసి రిసెప్షన్ సెంటర్ కు పోలీసు బందోబస్తు మధ్యన తీసుకొస్తారు. అక్కడినుంచి అదేబ‌రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ కు తరలించి పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా గళ్ళు వేసి ఉంచిన స్ట్రాంగ్ రూం లో తాళం వేసి, సీలు వేసి భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూంకు సీలువేసే సమయంలో కూడా పోటీ చేసిన అభ్యర్థులు / ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వీడియోగ్రఫీ చేస్తారు. ఒకే తలుపు ఉండి, అన్ని కిటికీలను మూసేసి  ప్లైవుడ్ లేదా ఇటుకలతో కట్టిన నిర్మాణం చేసి సీల్ చేస్తారు, లైట్లు ఆఫ్ చేసి- షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ రూం కు ఇరవైనాలుగు గంటలూ పోలీసు పహారా ఏర్పాటు చేస్తారు. ఆ తలుపు ఉండే ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్ ను తిరిగి కౌంటింగ్ రోజున మాత్రమే అందరి సమక్షంలో తెరుస్తారు. మూసివేసే సమయంలోనూ, తిరిగి తెరిచే సమయంలోనూ వీడియోగ్రఫీ చేస్తారు. బ్యాటరీ ఆఫ్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. కంట్రోలు యూనిట్ వాడుకునే కరెంట్ అతి తక్కువ.  కంట్రోలు యూనిట్ లో ఓటును అలాట్ చెయ్యగలం అంతే. బ్యాలెట్ యూనిట్ లో ఓటు వినియోగం తరువాతే మరోసారి కంట్రోలు యూనిట్ పని చేసేందుకు సిద్ధం అవుతుంది. ఎప్పుడైతే కంట్రోలు యూనిట్, బ్యాలెట్ యూనిట్ ల మధ్య ఉన్న కేబుల్స్ తొలగించగానే రెండు కూడా ఏ రకమైన చర్యలు చేయడానికి వీలులేకుండా ఉండిపోతాయి. అందువల్ల‌  ఒక్క ఓటు కూడా పోలింగ్ స్టేషన్ బయట వేసేందుకు వీలులేదు.ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఎన్ని ఓట్లు పోలైనాయో ఉంటుంది. ఏజెంట్లు అక్కడ సంతకం చేస్తారు. ఆ ఓట్ల సంఖ్య ఫైనల్. ఆ పైన అదనంగా ఓట్లు క‌నిపించవు. అది అసాధ్యం. ఈవీయంలను మ్యానేజ్ చేసే విధానమే ఉంటే అధికారంలో ఉన్న పార్టీ పోటీదారులు వందశాతం గెలవాలి. అన్ని పోలింగ్ స్టేషన్లలో మెజారిటీ ఆ అధికార పార్టీకే రావాలి కదా... మరి అలా జరగటం లేదు కదా. ఫలితాలు తలకిందులై అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయి వేరే పార్టీలు యంయల్ఏ, యంపీ ఎలక్షన్ల ద్వారా రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తున్నాయి అంటే ఈవీయంలు చక్కగా పని చేస్తున్నాయనే క‌దా అర్ధం. ఇక్క‌డ మ‌రో లాజిక్ కూడా చాలా మందికి పీకుతూనే ఉంది. ఒక వేళ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి నిజంగానే ఈవీఎంల‌ను టాంప‌ర్ చేసి గెలిచి ఉంటే.. మ‌రి కేంద్రంలో బీజేపీ కూడా అఖండ మెజార్టీతో విజ‌యం సాధించాలిగానీ.. 420 సీట్లు టార్గెట్  పెట్టుకుంటే 240కి ప‌రిమితం కావ‌డ‌మేంట‌న్న‌ది మ‌రి కొందరి ప్ర‌శ్న‌. మ‌రో మాట కూడా ఇదే విష‌యంలో రాసుకోవ‌చ్చు. గ‌తంలో ఏపీలో జ‌గ‌న్ మోహ‌న రెడ్డి సైతం 151 సీట్ల అఖండ మెజార్టీతో గెలిచిన‌పుడు బాబు ఇలాగే అన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ ఆ వాయిస్ అందుకుంది. మ‌రి 151 సీట్లు వ‌చ్చిన‌పుడు రాని ఈవీఎం డౌట్ ఇప్పుడే రావ‌డంలో అర్ద‌మేంటి. పెమ్మ‌సాని వంటి వారి ముక్కూ మొహం ఓట‌ర్ల‌కు తెలీదంటున్న‌పుడు జ‌గ‌న్ హ‌యాంలో గెలిచిన వారి ముక్కూ మొహం మాత్రం ఎవ‌రికి తెలుసు? పెమ్మ‌సాని అన్నా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవల్లో బ‌యో టెక్ బిజినెస్ చేసిన బిజినెస్ మెన్. మ‌రి నందిగం సురేష్ వంటి వారు ఎంపీ అయిన‌పుడు ఇదే ప్ర‌శ్న వీరంద‌రికీ ఎందుకు రాలేదు? ఇలా లాజిక్కులు లాక్కుంటూ పోతే.. తెగేది లేదు తెల్ల‌వారేది లేద‌న్న‌ది ఒక విశ్లేష‌ణ‌గా తెలుస్తోంది. మ‌రి మీరేమంటారు???    
నిజంగానే పెమ్మ‌సాని..ఈవీఎం ట్యాంప‌ర్ చేయించారా? Publish Date: Aug 10, 2025 1:05PM

మట్టి మనుషుల అరణ్యరోదన!

జై జవాన్.. జై కిసాన్.. జైహింద్.. నినాదాలకే పరిమితమా? కర్షకులకు, శ్రామికులకు సరైన ఆదాయం లేక విలవలలాడుతున్న జన భారతం. వివరాల్లోకి వెడితే.. ఆరు దశాబ్దాల కిందట భారతావని వరుస కరువు కాటకాలతో ఆకలి కేకలతో అల్లాడి, తల్లడిల్లిపోయింది. విదేశాల నుంచి ధాన్యం వస్తే తప్ప మన పొయ్యిలోని పిల్లి లేవని దుస్థితి. నాడు ఓడ వస్తేనే నోట్లోకి ముద్ద వెళ్లేది అనే నానుడి దేశ ప్రతిష్ఠకు మచ్చలా మారింది.  అలాంటి దుర్భర, దీనావస్థ నుంచి అనతి కాలంలోనే ఆహార ధాన్యాల దిగుబడిలో స్వావలంబన సాధించగలిగే స్థాయికి భారత దేశం చేరుకోగలిగింది. హరిత విప్లవం పితామహుడు, ఎంఎస్ స్వామినాథ్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త నార్మన్ బోర్లాంగ్ సహకారంతో 1960లో మొదలైన హరిత విప్లవం భారత జాతి తలరాతను మార్చివేసింది. ఆధునిక దిగుబడి ఇచ్చే వంగడాల వినియోగం, నీటి వనరుల సమర్థ వాడకం, చీడపీడ నివారణల పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో హరిత విప్లవం ప్రారంభమైన ఐదేళ్లలోనే దేశీయంగా గోధుమ ఉత్పత్తి దాదాపు రెట్టింపైంది. రెండున్నర దశాబ్దాలలో వరి ఉత్పాదకతలో మూడు రెట్లు వృద్ధి నమోదైంది. హరిత విప్లవం దరిమలా జన భారతానికి ఆహారభద్రత లభించినప్పటికీ.. సాగుదారుల ఆదాయాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. రైతు సంక్షేమానికి ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు బుట్లదాఖలయ్యాయి. సిఫారసులు ఆచరణలోకి తీసుకురావడంపై ప్రభుత్వాలు దృష్టి సారించినప్పుడే సాగురంగ రుషి అయిన ఎంఎస్ స్వామినాథన్ కు ఘనమైన నివాళి.  అన్నదాతలు, మట్టిమనుషులకి వ్యవసాయం అంటేనే వ్యయం చేయడం, సాయం అడగడం పరిపాటి అయిపోయింది. నేటి రైతు దుస్థితికి ప్రభుత్వ విధానాలు కారణమైతే.. ప్రకృతి వికృతి రూపం కారణం. రైతే దేశానికి వెన్నెముక అంటారు. సకలచరాచర జీవకోటికి అన్నంపెట్టే అన్నదాత.. ఆర్తనాదాలు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. కారణాలు అనేకం. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. పండించిన పంటలను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు లేవు. రైతులకు  సకాలంలో ఎరువులు, క్రిమి సంహారక  మందులపై సబ్సిడీ అందుబాటులో ఉండటం లేదు. క్రిమి సంహారక మందుల ధరలు ఏటాటా అడ్డూ అదుపూ లేకుండా పెస్టిసైడ్స్ కంపెనీలు పెంచుకుంటూ పోతుంటే..కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు లంచాలవతారులై  రైతు వెన్ను విరుస్తున్నారు. నకిలీ పెస్టిసైడ్స్, విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అమ్మేవారిపైన కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం ఫలసాయం అవుతుంది.. వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు సృష్టించడంలో మన శాస్త్రవేత్తలు వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా ప్రభుత్వమే సేకరించి  రైతులకు తక్షణమే ప్రభుత్వ మద్దతు ధరతో చెల్లించే ప్రక్రియ లేనే లేదు. మధ్య దళారీ వ్యవస్థ వల్ల అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో రాయలసీమలో తోతాపురి మామిడి రైతుల దుస్థితి చూశాము. అదే విధంగా పక్కనే ఉన్న మెట్రోపాలిటిన్ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన నగరాలలో తోతాపురి మామిడి కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకూ అమ్మడం జరిగింది. కనీసం రైతులకు కేజీకి ఎనిమిది రూపాయలు కూడా గిట్టుబాటు కాలేదు. దీనికి కారణం ఎవరు? మన పాలకుల విధి విధానాలే. ఇలాగా అన్ని పంటల దుస్థితి ఇలాగే దాపురించింది. ప్రభుత్వాలు మేలుకోకపోతే దేశంలో భవిష్యత్ లో వ్యవసాయం చేసే వారే కరువౌతారు. తస్మాత్ జాగ్రత్త.!
మట్టి మనుషుల అరణ్యరోదన! Publish Date: Aug 10, 2025 1:04PM