పులివెందుల వ‌ర్సెస్ కుప్పం

పులివెందుల‌లో గెల‌వ‌గానే  రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెల‌వ‌డం సాధ్య‌మేనా? ఇదీ వైసీపీ నేత‌ల ప్ర‌శ్న‌. అదే కుప్పంలో గెల‌వ‌గానే వైసీపీ ఆంధ్ర అంత‌టా విజ‌యం సాధించిన‌ట్టేనా? ఇది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా వినిపించే ప్ర‌శ్న‌.  ప్ర‌స్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద  తెలుగుదేశం ఫుల్ ఫోక‌స్ పెట్టింది. ఎక్క‌డైతే వైసీపీ బ‌లంగా ఉందో.. అక్క‌డే దెబ్బ కొట్టాల‌న్న‌ది ఆ పార్టీ  వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే క‌డ‌ప‌ జిల్లాలో మ‌హానాడు నిర్వహించింది.   ఈ క‌ల్చ‌ర్ ఈనాటిది కాదు.. ఎప్ప‌టి నుంచో ఉంది. రాజ‌కీయ‌మంటేనే అది. కాలేజీ రాజ‌కీయాల నుంచి పెద్దిరెడ్డికి, చంద్ర‌బాబుకీ పోటీ. ఆ మాట‌కొస్తే రెడ్లు త‌ప్ప రాజ‌కీయాలు క‌మ్మ‌ల‌కు సూటుకావంటూ సాగుతుంది ఈ సంకుల స‌మ‌రం. తొలి నాళ్ల‌లో చంద్ర‌బాబు త‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో.. మ‌నం నిజంగానే రాజ‌కీయాల‌కు సూటుకామా? అన్న కోణంలో దిగాలు ప‌డ్డ ప‌రిస్థితి ఉంది.

అయినా స‌రే ఎ తొలిసారి నుంచి చంద్ర‌గిరిలో గెలిచి.. ఆపై కుప్పం  నుంచి ఆయ‌న 40 ఏళ్లుగా గెలుస్తూనే వ‌స్తున్నారు. నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు కూడా. అలాంటి కుప్పంలో ఎలాగైనా స‌రే గెల‌వాల‌న్న‌ది జ‌గ‌న్ ఎత్తుగ‌డ. మొన్న ఇక్క‌డ వైనాట్ వ‌న్ సెవంటీ ఫైవ్ లో బాగంగా కుప్పంలో గెలిచి తీరాల్సిందే అన్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేసింది వైసీపీ. భ‌ర‌త్ ని భారీ ఎత్తున స‌న్న‌ద్దం చేసింది. కానీ భ‌ర‌త్ కూట‌మి గాలిలో కొట్టుకు పోవ‌ల్సి వ‌చ్చింది. 

కుప్పం అంటే బాబు- బాబు అంటే కుప్పం అన్న‌ది ఒక బ్రాండ్ గా మారింది.  అందుకే బాబు కుప్పం నుంచి కూర‌గాయ‌లు విమానాల ద్వారా ఎగుమ‌తి చేసే ఏర్పాట్లు చేస్తామ‌ని బ‌హుమానం ప్ర‌క‌టించారు. అంతే కాదు త‌న సొంత సెగ్మెంట్లో ఇల్లు క‌ట్టుకోవ‌డంతో పాటు ఆ నియోజక వ‌ర్గానికి.. త‌న స‌తీమ‌ణిని ఇంచార్జ్ గా చేసి అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా  ప‌రిశీలిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, పులివెందులలో ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత  దేశ వ్యాప్తంగా జ‌రిగిన‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి ఒకే ఒక్క‌డిగా గెలిచారు వైయ‌స్ఆర్. అంటే అప్ప‌టి నుంచి పులివెందుల వైయ‌స్ ఫ్యామిలీకి అంత ప‌ట్టున్న సెగ్మెంట్. ఇక్క‌డ ఇత‌ర పార్టీలు పాగా వేయ‌డం అంత తేలికైన ప‌ని కాదు. బీటెక్ ర‌వి ఇక్క‌డ ఎప్ప‌టి నుంచో విజ‌యం రుచి చూడ్డం కోసం ఎదురు  చూస్తున్నారు కానీ ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు.

కార‌ణం ఇక్క‌డ రెడ్లు, బీసీ, ఎస్సీ ఎస్టీ క్రిష్టియ‌న్ మైనార్టీ ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా వైయ‌స్ కుటుంబానికి గ‌మద్దతుగా నిలవడం ఒక రివాజుగా వ‌స్తోంది.  కాబ‌ట్టి ఇట్స్ నాట్ సో ఈజీ. అలాంటి నియోజక వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌డం వ‌ల్ల తమ ఆధిప‌త్యం మ‌రింత స్ప‌ష్టంగా నిరూపించ‌వ‌చ్చ‌న్న భావ‌న‌లో ఉంది తెలుగుదేశం. అంతే కాదు లోకేష్ ని అడ్డు పెట్టుకుని ఆయ‌న త‌న‌కు సొంతం కాని మంగ‌ళ‌గిరిలో ఎలా పోటీ చేశారో అలా పోటీ  చేసి జ‌గ‌న్ త‌న స‌త్తా చాటాల‌న్న స‌వాళ్లు కూడా ఉన్నాయి.

ఇక సీఎం స్థాయి వ్య‌క్తుల‌ సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిస్తే ఎలాంటి పరిణామ క్ర‌మాలు సంభ‌విస్తాయో చెప్ప‌డానికి కొండంగ‌ల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్క‌డ ఓడిన రేవంత్ రెడ్డి త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంపీగా మ‌ల్క‌జ్ గిరి నుంచి పోటీ చేసి గెలిచి.. అటు పిమ్మ‌ట పీసీసీ చీఫ్ గా ఎదిగి ఆపై ముఖ్య‌మంత్రి పీఠంలో స‌గ‌ర్వంగా కూర్చుకున్నారు. ఇలా ఉంటుంది ఒక సీఎం సెగ్మెంట్ తో పెట్టుకుంటే.

ఇక కేసీఆర్ గ‌జ్వేల్ విష‌యానికే వ‌స్తే.. ఇక్క‌డ కేసీఆర్ కి ఎంత వ్య‌తిరేక‌త ఉన్నా  కూడా ఈ ప్రాంత వాసులు ఆయ‌న్నే పదే ప‌దే గెలిపిస్తారు. కార‌ణ‌మేంటంటే.. కేసీఆర్ వ‌ల్ల జాతీయ స్థాయిలో త‌మ నియోజ‌క‌వ‌ర్గం పేరు మారు మోగుతోంది కాబ‌ట్టి. అలా ఉంటుంది ఆయా వీవీఐపీ నియోజక వ‌ర్గాల్లోని ప్ర‌జానాడి.

ఇపుడు పులివెందుల‌లో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించడం  ద్వారా తెలుగుదేశం పార్టీ  వైసీపిని జగన్ అడ్డాలో  దెబ్బ తీసి సత్తా చాటి తొడగొట్టాలని  చూస్తోంది. ఒక ర‌కంగా చెబితే అది జ‌గ‌న్ ని ఆయ‌న ప‌రివార‌గ‌ణాన్ని ఒకింత ఎక్కువ రెచ్చ‌గొట్ట‌డ‌మే అవుతుంద‌ని అంచ‌నా వేస్తారు విశ్లేష‌కులు.

ఒక వేళ నిజంగానే ఈ ఉప‌ ఎన్నికలో టీడీపీ గెలిస్తే అది భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సవాళ్లకుకు దారి తీస్తుందనడంలో  ఎలాంటి  సందేహం లేదు. అలాగ‌ని రాజ‌కీయ పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోకుండా ఉండవు.  ఒక పార్టీ అంటే అన్ని చోట్లా గెల‌వాల‌నుకుంటుంది. గ‌తంలో ఎన్టీఆర్, ఇందిర వంటి వారికే వారి వారి సొంత నియోజకవర్గాలలో ఓడిన పరిస్థితి ఉంది.  కాబ‌ట్టి... గెలుపు ఓటములు  స‌ర్వ‌సాధార‌ణం. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆస‌క్తి క‌రం కూడా.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu