రాహుల్ గాంధీ అరెస్టు
posted on Aug 11, 2025 12:47PM

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై కాంగ్రస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా నిరసనలు తెలుపుతున్న విపక్షాలు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయల్దేరాయి.
తాజాగా సోమ వారం పార్లమెంట్ భవనం నుంచి ఈసీ కార్యాలయానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహించ తలపెట్టాయి. అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ కు వెళ్లే మార్గంలో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. అయితే విపక్ష ఎంపీలు వాటిని దాటుకుని వేళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.