ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్
posted on Aug 11, 2025 1:27PM
.webp)
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 10) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది వంటి అన్ని వివరాలతో కూడిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందన్ని స్పష్టం చేసింది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ధానికులైన మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ జండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుంది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్ జెండర్ లు ఈ ఉచిత ప్రయాణానికి అర్హులు. అయితే పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ , సూపర్ లగ్జరీ , నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, ఎసీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉండదు.