ఈడీ విచారణకు సినీ నటుడు దగ్గుబాటి రాణా
posted on Aug 11, 2025 10:32AM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రాణా సోమవారం (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్, విజయదేవరకొండ తదితరులు ఈడీ విచారణకు హాజరైన సంగతి విదితమే. ఇలా ఉండగా ఇదే కేసులో ఈడీ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మికి కూడా నోటీసులు జారీ చేసింది. బుధవారం (ఆగస్టు 13) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా నమోదైన కేసులపై ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్ రాజ్ ఇకపై బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయనని తెలిపారు. ప్రజలకు హాని చేసే వ్యాపారాల ప్రమోషన్ లకు దూరంగా ఉంటానని విచారణ అనంతరం ప్రకటించారు. ఇక విజయ్ దేవరకొండ అయితే..తాను అసలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదనీ, తాను ప్రమోషన్ చేసినది గేమింగ్ యాప్ అని పేర్కొన్నారు. లీగల్ గా కొనసాగుతున్న గేమింగ్ యాప్ ప్రమోషన్ లో మాత్రమే తాను పాల్గొన్నానని చెప్పిన విజయ దేవరకొండ.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.