గీత దాటితే అరెస్ట్...కేసీఆర్‌కు రేవంత్ లక్ష్మణ రేఖ
posted on Aug 10, 2025 4:08PM
.webp)
కాళేశ్వరం నివేదికను ఒక అస్త్రంగా చేసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను అరెస్టు చేస్తారా ? కాళేశ్వరం ప్రాజెక్ట్’ నిర్మాణానికే కాదు, అందులో జరిగిన అవకతవకలకు, కర్త, కర్మ, క్రియ అన్నీ,ఆయనే అని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్’ నివేదిక తేల్చి చెప్పిన నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నిజానికి,అరెస్టు చేయడమా, చేయక పోవడమా అనేది, విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకునే నిర్ణయం కాదు. రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయం. అందుకే, రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని,విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం గతంలో కేసీఆర్’ ప్రభుత్వం తనను జైలుపాలు చేసిన చేదు అనుభవాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోలేదని ఇంతవరకు చెపుతూ వచ్చారు. అలాగే, తప్పక ప్రతీకారం తీర్చుకుంటారని, సన్నిహితులు మాత్రమే కాదు, అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన శపధం గుర్తున్న అందరూ భావిస్తూ వచ్చారు.
అయితే,ఇటీవల ఢిల్లీ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చచ్చిన పామును ఇంకేం చంపుతాం,అన్నట్లు, ఇప్పటికే కేసీఆర్, ఫార్మ్ హౌస్’ లో స్వీయ’ బందీగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా జైలుకు పంపవలసిన అవసరం లేదు. ఇప్పడు ఆయనకు చర్లపల్లి జైలు అయినా, ఫార్మ హౌస్ అయినా ఒక్కటే’ , ఫార్మ్ హౌస్’ లో సంరక్షణ ఉంటుంది, చర్లపల్లి జైల్లో పహారా. ఉంటుంది .. అదొక్కటే తేడా.. కాబట్టి…
అంటూ, కేసీఆర్’ను జైలుకు పంపే ఆలోచన లేదనే ముఖ్యమంత్రి ఒక విధంగా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. ఒక విధంగా అదే తుది నిర్ణయం అనే భ్రమలను కల్పించారు.
అయితే, అదే ప్రభుత్వ అంతిమ నిర్ణయమా లేక కేసీఆర్’ జనంలోకి రాకుండా, ఆయన ముందరి కాళ్లకు బంధం వేసే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అరెస్ట్ ఉండదనే సంకేతాలు ఇచ్చారా,,అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్’ బయటకు రానంత వరకు అరెస్ట్’ ఉండదని కాదని కాలు బయట పెడితే మాత్రం ‘అరెస్ట్’ తప్పదనే సంకేతాలు ఇచ్చారా, అనే అనుమనాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో, ఇప్పటికిప్పడు కేసీఆర్’ను అరెస్ట్ చేస్తే,అందుకు రాజకీయంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే అభిప్రాయం కూడా, పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోందని అంటున్నారు. మరో వంక కేసీఆర్’ ను అరెస్ట్ చేయడం వల్లనే కాదు,అరెస్ట్ చేయక పోవడం వలన కూడా కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. గత (2023) అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తెను అరెస్ట్ చేయక పోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల అస్త్రంగా మలచు కున్నారు.
‘బీజీపీ,బీఆర్ఎస్ ఒక్కటే’ నినాదాన్ని, జనంలోకి బలంగా తీసుకు పోయారు. అదే సమయంలో బీజేపీ ఆదిస్థానం బండి సంజయ్’ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో కాంగ్రెస్’ఆరోపణలకు మరింత బలం చేకూరి బీజేపీ మరింతగా నష్ట పోయిందని, ఇప్పటికీ రాజకీయ విశ్లేషణల్లో వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూనే వుంది. అయితే, ఇప్పడు కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్, కేసుల్లో కేసీఆర్ ను అరెస్ట్ చేయక పోతే,కాంగ్రెస్ ప్రయోగించిన, ‘కుమ్ముక్కు’ అస్త్రాన్నే బీజేపీ ప్రయోగించే ప్రమాదం వుంది.
నిజానికి,బీజీపే సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,ఇప్పటికే ఆరోపణలు ప్రారంభించారు.కేసీఆర్’కు కాంగ్రెస్ అధిష్టానంతో డీల్ కుదిరిందని, ముడుపులు చేతులు మారుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. సో .. ఒక విధంగాచూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో’ చెప్పలేమని అంటున్నారు.అలాగే, రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నివేదికను, అసెంబ్లీ ఇతర వేదికల ద్వారా బీఆర్ఎస్’ను, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు ఉపయోగించుకుంటారే, కానీ, కేసీఆర్’ నే కాదు,ఆయన కుటుంబం సభ్యుల్లో ఏ ఒక్కరి విషయంలోనూ విచారణలు అరెస్టుల వరకు పోరనే అంటున్నారు.
ముఖ్యంగా, రేవంత్ రెడ్డి లోపలి మనిషి తెలిసిన సన్నిహితులు, కనిపించినంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోరని అంటారు.అందుకే రేవంత రెడ్డి బయటకు ఆవేశంగా రాజకీయం చేస్తున్నట్లుగా కనిపించిన,కీలక సమయంలో ఆచి తూచి అడుగులు వేస్తారని, గత 18 నెలల పాలనలోనూ అదే వ్యూహాత్మకంగా,పట్టు విడుపులు ప్రదర్శిస్తూ పాలన సాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా లాభనష్టాలు వేసుకుని ముందడుగు వేస్తున్నారు.ఈ విషయంలో రేవంత్ రెడ్డి భవిష్యత్ వ్యూహాలు, నిర్ణయాలు చర్యలను ఊహించడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.