ఎన్నికల జాప్యం.. పంచాయతీలకు శాపం !

ఆలస్యం అమృతం విషం ఈ నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే  అది ఇదే.  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ..   కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన  కేంద్ర నిధులు  రాకుండా ఆగి పోతాయి. అంతే కాదు..  నిర్దిష్ట గడువు ముగిస్తే అవి మురిగి  పోతాయి కూడా.  
అవును..  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1992లో తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీలు కొలువు తీరి ఉన్నప్పడు మాత్రమే  పంచాయతీలకు  కేంద్ర నిధులు అందుతాయి. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీల గడువు 2024 జనవరిలోనే ముగిసింది. ఇక అక్కడి నుంచి  కారాణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ముడి పడలేదు. ఈ కారణంగా ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం  2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావలసిన రూ.1,550 కోట్లను రిలీజ్ చేయకుండా  విత్ హెల్డ్  లో పెట్టింది. అంటే..  నిధుల విడుదలను నిలుపుదల  చేసింది. అలాగే ప్రస్తుత   ఆర్థిక సంవత్సరానికి సంబందించి   రూ.1,450 కోట్లు కూడా విడుదల కాలేదు.  అంటే..  పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వలన రాష్ట్రంలోని గ్రామ  పంచాయతీలు ఇంచుమించుగా రూ.3000 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 

మరో వంక నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రాణప్రదంగా భావించే  కేంద్ర నిధుల విడుదల కావాలంటే..   స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించడం మినహా మరో మార్గంలేదన్నది పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమాచారం. మరోవంక..  స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని   హై కోర్టు గడువు విధించింది. ఈ అన్నిటినీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని  బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే .. అంటూ రాజకీయ హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో  గండం నుంచి గట్టెక్కేదారి కనిపించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తికమక పడుతోంది.

ఇతర అంశాలు ఎలా ఉన్నా..  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఫేస్  చేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ముందు కేంద్ర గ్రాంట్స్ తెచ్చుకోవడం పై దృష్టి పెట్టాలి,  లేదంటే,  పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన స్థితికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల అవుతాయనే నమ్మకం లేదనీ, గడువు ముగిసిన గత సంవత్సరం నిదుల విడుదల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచక్షణాదికార పరిధిలోకే వస్తుందనీ,  సో ..గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల కేంద్రం దయ .. మన ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే..  గతంలో   ఎన్నికలు నిర్వహించిన వెంటనే విత్ హెల్డ్  లో పెట్టిన నిధులను విడుదల చేసిన అనుభవాల ఉన్నాయి కాబట్టి  ఎన్నికలు జరిగితే గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబందించిన రూ. 3000 కోట్లు విడుదలవుతాయనే విశ్వాసాన్ని పంచాయతీ శాఖ అధికారాలు వ్యక్తం చేస్తున్నారు.  

అలాగే.. ఈలోగా ఎన్నికలు జాప్యానికి కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాస్తే, కేంద్ర నిధులు  విడుదల అవుతాయని  కొందరు అధికారులు అంటున్నారు  అయితే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రోజురోజుకూ మరింత జటిలం అవుతున్న నేపధ్యంలో, ఈ చిక్కు ముళ్ళు వీడి, పంచాయతీ ఎన్నికల జరగడం  ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu