రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు!
on Aug 11, 2025
గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. దీని పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా అవి సత్ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దర్గేశ్‌ను కలిసి సినీ పరిశ్రమలోని సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని అందించారు నిర్మాతలు.
దీనిపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేసేందుకు నిర్మాతలు వస్తామంటే రమ్మని చెప్పాం. అయితే దీనికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఈ సమస్యపై సినీ కార్మికులు, సినీ నిర్మాతలు.. ఇరువురు చెప్పే విషయాలు వింటాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి చర్చిస్తాం. ఒకవేళ ప్రభుత్వ జోక్యం అవసరం అనుకుంటే సీఎం, డిప్యూటీ సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ అంశంపై ఫెడరేషన్, ఫిలింఛాంబర్ సభ్యులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఏపీలో స్టూడియోలు, రీరికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం’ అన్నారు. కందుల దుర్గేష్‌ను కలిసిన నిర్మాతల్లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కె.ఎల్.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్, నాగవంశీ, భరత్, విశ్వప్రసాద్, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్ వంశీ, బన్నీ వాసు, వివేక్ కూచిభొట్ల తదితరులు ఉన్నారు.
మరోపక్క తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొందరు నిర్మాతలు కలిసి సమస్యను వివరించారు. ఈ సమావేశంలో ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, సుప్రియ, జెమినీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



