జగన్ మేనమామపై కేసు
posted on Aug 11, 2025 12:27PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం (ఆగస్టు 10) ఉదయం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన రాజకీయ వ్యాఖ్యలూ, విమర్శలూ చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తాము జగన్ వెంటే ఉన్నామని చెప్పేందుకు పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. పులివెందులలో వైసీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడికి పాల్పడుతూ తెలుగుదేశం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రాజకీయ ఆరోపణలు చేశారంటూ టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.