అధికారం దక్కినా ఏదో వెలితి..!
posted on Dec 22, 2016 @ 8:05PM
ఆంధ్రప్రదేశ్‌ను విభజించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదానికి బలైన వారి జాబితా చాలా పెద్దదే. ఆ నిర్ణయం తరతరాలుగా హస్తాన్నే నమ్ముకుని..ఆ పార్టీకే జీవితాన్ని అంకితం చేసిన ఎంతోమందిని రాజకీయంగా సమాధి చేసింది. అయితే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కొందరు కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు సైతం ప్రత్యామ్నాయాలు వెతుక్కొగా..మరికొందరు ఆ పార్టీతోనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏదో వెళ్ళాలి కాబట్టి వేరే పార్టీలోకి వెళ్లారు కానీ వీరిలో కొందరికి అలా వెళ్లడం సుతరాము ఇష్టం లేదు. పాత వాసనలు మరచిపోలేక..కొత్త పార్టీలో ఇమడలేక వీరు నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా ఆ విషయం బయటకు రాకుండా కవరు చేస్తుంటారు.
కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం అందుకు విరుద్దం..ఎంత పచ్చకండువా కప్పుకున్నా ఆయన కరడుగట్టిన కాంగ్రెస్ వాది..ఎదుటివారు ఏమనుకున్నా సరే తన మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టి చెప్పడం ఆయనకు అలవాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పినా..బాబు మాకు అన్యాయం చేస్తున్నారని బాంబు పేల్చినా ఆయనకే చెల్లింది. తాజాగా ముగిసిపోయిందని భావిస్తున్న రాయల తెలంగాణ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఏపీ విభజనకే కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపినప్పుడు జేసీ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని..అలా కుదరని పక్షంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు జేసీ. అయితే దీనికి తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించకపోవడంతో ఆచరణ సాధ్యం కాలేదు.
అప్పట్లోనే ఆగిపోయిన రాయల తెలంగాణ ప్రతిపాదనను ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు తిరిగి తవ్వడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీకి వచ్చిన జేసీ తనకు ఎదురుపడిన తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌తో సంభాసిస్తూ..మమ్మల్ని అడవుల పాలు చేశారు. విభజన వల్ల కర్నూల్, అనంతపురం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. మమ్మల్ని కలుపుకుంటే కనీసం మాకు నీళ్లు, బువ్వ అయినా దొరికేవి అన్నారు. రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మేం తెలంగాణ వాళ్లం కాదా..? మాకు నీళ్లివ్వవా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించేవాళ్లం అన్నారు. ఇక్కడే కులం ప్రస్తావన తెచ్చారు జేసీ..ఎవరినో అని లాభం లేదని..మా రెడ్లే రాయల తెలంగాణను అడ్డుకున్నారని బాంబు పేల్చారు.
ఆయన ఆవేదన వెనుక కారణం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయి. సమైక్యాంధ్రను ముఖ్యమంత్రులుగా ఎక్కువకాలం పాలించింది రెడ్లే. విభజన తర్వాత వీరు రెండు రాష్ట్రాల్లోనూ ద్వితీయ శ్రేణిగా పరిగణింపబడుతున్నారు. రెడ్ల ప్రాధాన్యత తగ్గిపోయింది. జేసీ టీడీపీలో ఎంపీగా గెలుపొందినా అనంతపురం జిల్లాలో హవా మొత్తం పరిటాల వర్గానిదే. మేము వాళ్ల కింద పనిచేయాల్సి వస్తోందని జేసీ చాలాసార్లు వాపోయారు. కాంగ్రెస్ పరిస్థితి తన సామాజిక వర్గం పరిస్థితి ఒక్కసారిగా తలచుకోని ఆయనకు పాత రోజులు గుర్తొచ్చినట్లున్నాయి. అందుకే తన బాధనంతా వెల్లగక్కారు. అయినా గతం గత: అన్నట్లు అందరితో కలుపుకుని పోతే ఏ గొడవ లేదు..జేసీ తొందర్లోనే దీనిని తెలుసుకుంటారో లేక ఇలాగే ముందుకు వెళతారో వేచి చూడాల్సిందే..!