నగదు రహితం ఎంతవరకు సాధ్యం!
posted on Dec 15, 2016 @ 12:04PM
‘ముందు 100 శాతం అక్షరాస్యతని సాధించలేనప్పుడు 100 శాతం డిజిటలైజేషన్ ఎంతవరకూ సాధ్యం!’ ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆరోపణ. ‘సెల్‌ఫోనుని ఆపరేట్ చేయడం నాకే రాదు. అలాంటి దేశమంతటా నగదురహిత లావాదేవీలను ఎలా నిర్వహిస్తారు?’ ఓ మాజీ ప్రధాని ఆవేదన.
ఎవరేమన్నా జాతీయ ప్రభుత్వం మాత్రం నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగానే అడుగులు వేస్తోంది. పెద్దనోట్ల రద్దు తరువాత తిరిగి ఆ ధనాన్ని చాలా నిదానంగా భర్తీ చేయడం వెనుక కారణం కూడా... ప్రజలను నగదురహితం వైపు మళ్లించేందుకే అన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మున్ముందు నగదుతో కూడుకున్న లావాదేవీల మీద కూడా రకరకాల పరిమితులను విధించే అవకాశలూ కనిపిస్తున్నాయి.
పెద్దనోట్ల రద్దు సమాజానికి ఓ కుదుపు అన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. నిర్ణయం అమలులో లోపాలు ఉన్నాయన్నదాని మీదా తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యం కాబట్టి, ఇక మీదట ఏం చేయాలన్నదే ప్రశ్న! మోదీ చేసిన పనిలో తప్పొప్పుల సంగతి పక్కనపెడితే ఇప్పుడు మన ముందు ఉన్న దారిలో ప్రయాణించడం ఎలా అన్నదే ముఖ్యం. బహుశా ఈ విషయాన్ని గ్రహించబట్టో ఏమో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా గమ్మున ఆన్‌లైన్ లావాదేవీల గురించే మాట్లాడుతున్నారు.
నగదురహిత సమాజం ఊహించడానికి బాగానే ఉంటుంది. ఇలాంటి లావాదేవీల వల్ల ప్రతి పైసాకీ లెక్క ఉండటం, లావాదేవీలు సులువుగా సాగిపోవడం, అక్రమ సంపాదనకు అడ్డుకట్టపడటం, పన్ను ఎగవేతలని నివారించడం వంటి లక్షణాలు ఊరిస్తుంటాయి. రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో అనూహ్యమైన ధరలు పలకడం తగ్గుతుంది. కానీ అసలు అడ్డంకల్లా... ఇలాంటి లావాదేవీలను నిర్వహించేందుకు జనంలో తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమే! ఇందుకోసం ఇప్పటికిప్పుడు లక్షలాది ఫోన్లను దిగుమతి చేసి ఉచితంగా పంచిపెడితే సరిపోదు. ఎందుకంటే ఆ ఫోన్లలో ఉన్న యాప్స్ అన్నీ కూడా ఇంగ్లీషులోనే ఉంటున్నాయి. వాటిని గ్రామీణులు ఉపయోగించలేరన్నది నిర్వివాదం.
ఇక ఆన్‌లైన్లలో పెరుగుతున్న లావాదేవీలకు అనుగుణంగా వాటిలో భద్రత పెరగడం లేదన్నది మరో ఆరోపణ. స్వైపింగ్ చేసేటప్పుడు ఒక చిన్నపాటి లోపం వచ్చి డబ్బు అనవసరంగా చెల్లింపుకి గురైతేనే మనం బెంబేలెత్తిపోతాము. అలాంటిది ఆన్‌లైన్ చెల్లింపులకి సంబంధించిన మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం, బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తోచడం లేదు. పేటీఎం వంటి సంస్థలు విచ్చలవిడిగా ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించేస్తున్నాయి. కానీ ఇలాంటి సంస్థల లావాదేవీలకి సంబంధించి భద్రతాపరమైన లోపాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వమూ, బ్యాంకులూ ఏవో కొన్ని ప్రకటనలు జారీ చేస్తే సరిపోదు. ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే సంస్థల పనితీరుకి సంబంధించి కఠినమైన మార్గదర్శకాలు కూడా ఉండాల్సిందే!
ఒక ముప్ఫై ఏళ్ల క్రితం మనకి కంప్యూటర్ గురించి అవగాహన లేదు, ఒక ఇరవై ఏళ్ల క్రితం ఏటీఎం వాడకమూ పెద్దగా తెలియదు. కానీ అసలంటూ మొదలుపెడితే సాంకేతికతని అందిపుచ్చుకోవడంలో భారతీయులకు ఎవ్వరూ సాటిరాదన్నది జగమెరిగిన సత్యమే! మనం ఇప్పుడు విచ్చలవిడిగా వాడేస్తున్న సెల్‌ఫోన్లే అందుకు ఉదాహరణ. కాబట్టి ఆన్‌లైన్లో భద్రత, సులువు ఉన్నాయని తెలిస్తే... నగదురహిత లావాదేవీల వైపుగా భారతీయులు మరింత మొగ్గుచూపి తీరుతారు. కానీ అటువైపుగా పయనించలేని గ్రామీణులని బలవంతపెట్టకపోవడమే మేలు. మరికొంత కాలం పాటు గ్రామీణ భారతంలో నగదు లావాదేవీలకు అవకాశాన్ని కల్పించడంలోనే అటు గ్రామీణ భారతీయులకు, ఇటు ప్రభుత్వానికీ మంచిది. ఈలోగా ఓ తరం మారిపోతుంది. లావాదేవీలు జరిగే తీరూ మారిపోతుంది. సమాజంలో ఒక సమూలమైన మార్పు రావాలంటే ఆమాత్రం వేచిచూడక తప్పదు.