సిటీ ఆఫ్ హా(రర్)రన్స్!
posted on Dec 16, 2016 @ 11:51AM
శబ్దం జోష్ ని ఇస్తుందేమోగాని... నిశ్శబ్దం పీస్ ఆఫ్ మైండ్ ని ఇస్తుంది! అందుకే, గుడిలోనో, లైబ్రెరీలోనో, పచ్చటి పార్కుల్లోనో జనం పొందే తృప్తి పబ్బుల్లో, క్లబ్బుల్లో పొందలేరు! కాని, ఇప్పుడు ఈ మాటెందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేశంలోనే ఆరో అతి పెద్ద నగరమైన మన భాగ్యనగరం నిశ్భద్ధం తెలియని రణగొణ నరకంలా మారిపోతోంది! దాని ఫలితంగా హైద్రాబాదీలు ప్రశాంతత కోల్పోతున్నారు. ఇంకా చాలా చాలా నష్టపోతున్నారు...
రోజూ సిటీలో వుండే వారికి ఇరవై నాలుగు గంటలూ హారన్ల మోత చాలా మామూలు విషయం. అసలు మన సిటీలోని కొన్ని బస్తీల్లో అయితే అర్థ రాత్రి, అప రాత్రి అన్న తేడా లేకుండా వాహనల చప్పుళ్లు జీవితంలో భాగమైపోయాయి. నిద్రలో వున్నప్పుడు కూడా ఇంటి ముందు రోడ్డు మీద నుంచి హారన్లు మోగిస్తూ వెహికల్స్ దూసుకెళుతుంటాయి. అవ్వి నిజమైన శబ్దాలో , కలలోని కలతలో అర్థం కాని విచిత్ర స్థితి!
పైకి పెద్ద సమస్యగా కనిపించని నగరాల్లోని శబ్ద కాలుష్యం మనం భావించినంత చిన్నది కాదు. అసలు తాజా సర్వేల ప్రకారం హైద్రాబాద్ లోని చాలా ప్రాంతాలు చెవులు చిల్లులు పడే లాంటి ధ్వని కాలుష్యంతో సతమతం అవుతున్నాయట! మరీ ముఖ్యంగా, పంజాగుట్ట, అబిడ్స్, ప్యారడైజ్, కూకట్ పల్లి, తార్నాక లాంటి ప్రాంతాలు భీభత్సమైన శబ్దాలతో జనాన్ని నిర్వీర్యం చేసేస్తున్నాయి. విపరీతమైన శబ్దాలు ఎక్కువ సేపు వింటూ వుంటే మనిషి వినికిడి శక్తి కోల్పోతాడు. అంతే కాదు, ప్రశాంతత లోపిస్తుంది. మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఏకాగ్రత వుండదు. మెయిన్ రోడ్లపై మరీ శబ్దాలు మరీ ఎక్కువైపోతే యాక్సిడెంట్లు, గొడవలు అయ్యే ప్రమాదం కూడా వుంది! నిజానికి ఇలాంటి పరిణామాలన్నీ హైద్రాబాదీలకు ఇప్పటికే తెలుసు. కాని, వాట్ని నగర జీవనంలో తప్పనిసరి నరకంగా భావించి భరిస్తున్నారు!
శాస్త్రీయమైన లెక్కల ప్రకారం మన చుట్టూ వుండే శబ్ద తీవ్రత 50 నుంచి 60 డెసిబెల్స్ దాటకూడదు. మరీ సున్నిత ప్రాంతాలైతే 40 నుంచి 50 డెసీబెల్సే వుండాలి. రాత్రి వేళ మరింత తక్కువగా శబ్దాలుండాలి. కాని, హైద్రాబాద్ లో పొద్దస్తమానం ట్రాఫిక్ వుంటూనే వుంది. రాత్రి కూడా రోడ్లన్నీ నిర్మానుష్యం అవ్వటం ఎప్పుడో మానేశాయి. అందుకే, నిద్దుర ఎరుగక పరుగులు పెడుతోన్న భాగ్యనగరిలో గరిష్ఠంగా 80 డెసిబెల్స్ కూడా దాటిపోతోందట శబ్ద కాలుష్యం. దీని జనం ఎన్నో అనారోగ్యాలకి గురవుతున్నారు.
ప్రపంచ స్థాయి నగరం అంటూ స్పీచుల్లో హైద్రాబాద్ ను పొగిడే పాలకులు భయంకరమైన ధ్వని కాలుష్యంపై దృష్టి పెట్టాలి. ఓ పెద్ద కర్మాగారంలా కణకణ మండుతూ, రణగొణ ధ్వనులతో, ఎటు చూసినా దుమ్ము దూళితో మట్టి కొట్టుకుపోయే సిటీ... విశ్వ నగరం ఎలా అనిపించుకుంటుంది? అలాగే, జనం కూడా సాధ్యమైనంత తక్కువ కాలుష్యానికి పాల్పుడుతూ మన అందరి సుందర నగరాన్ని భద్రంగా వుంచుకోవాలి!