పొలిటికల్ పార్టీలకు... మోదీ సర్కార్ పోటు?
posted on Dec 19, 2016 @ 10:58AM
నోట్ల రద్దు కేవలం మొదటి అడుగు మాత్రమే అని మోదీ పదే పదే చెబుతున్నారు. దేశాన్ని అన్ని విధాల విప్లవాత్మక మార్పులకి లోను చేయాలన్నదే ప్రధాని ఆలోచన. అందులో ఆయన ఎంత వరకూ సక్సెస్ అవుతారో మనం ఇప్పుడే చెప్పలేం కాని... నోట్ల రద్దు లాంటిదే మరో గొప్ప ముందడుగు పదే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా ఇది పార్టీలకు, ఎన్నికలకు, ఎలక్షన్స్ టైంలో పొంగిపొర్లే బ్లాక్ మనీకి సంబంధించింది కావటం మరింత విశేషం! ఈ ఒక్క అడుగు పడితే మన ఎన్నికల్లో భారీ మార్పులే జరగొచ్చు!
ఎన్నికల టైంలో ఓట్లు పడే రోజు కంటే ముందు దాకా నోట్లు ఎలా ఎగిరెగిరిపడతాయో మనకు తెలిసిందే! బీరు, బిర్యానీ మొదలు రోజు వారి జీతమిచ్చి జెండాలు మోయించుకోవటం వరకూ అన్నీ డబ్బుతోనే జరుగుతాయి. అంతే కాదు, పోలింగ్ ముందు రోజైతే నల్లధనం పల్లె, పట్నం తేడా లేకుండా దేశం మొత్తాన్ని ముంచెత్తేస్తుంది! ఇదంతా ఎక్కడ్నుంచి వస్తోంది? మామూలుగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు చేస్తాడని భావిస్తాం. అది కరెక్టే. కాని, చాలా సార్లు పార్టీలు కూడా తమ కోట్లాది రూపాయల నిధుల్లోంచి ఇష్టానుసారం ఖర్చు చేస్తూ ఎన్నికల్ని అవినీతిమయం చేస్తాయి. డబ్బున్న పార్టీ అభ్యర్థి అర్హత లేకున్నా గెలిచే ప్రమాదకర స్థితిని తీసుకొస్తాయి. కాని, ఇక మీదట పార్టీల ఆటలు చెల్లకపోవచ్చు!
1960లలో చేసిన చట్టాల ప్రకారం నడుస్తోన్న మన పొలిటికల్ పార్టీలు లొసుగుల్ని వాడుకుని ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయల్ని బ్లాక్ నుంచి వైట్ చేసుకుంటున్నాయి. ఇంత వరకూ 20వేల కన్నా ఎక్కువ విరాళాలు వస్తేనే దాతల పేర్లు లెక్క చెప్పాల్సి వుండేది.అందుకే, 20 కన్నా తక్కువ విరాళాలు ఇచ్చారంటూ చాలా మంది చందాదారుల పేర్లు హాయిగా దాచేసేవి. కాని, దేశంలోని అన్ని పార్టీలు చేస్తోన్న ఈ అరాచకానికి ఈసీ అంతం పలకాలని భావిస్తోంది. 20వేలకి బదులు 2వేలే లిమిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది! 2వేల కంటే ఎక్కువ విరాళం ఎవ్వరు ఇచ్చినా వివరాలు తెలపాల్సిందేనన్నమాట!
పార్టీ పెట్టి బ్లాక్ మనీ సంపాదించే వారు కాదు మన దేశంలో బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోటానికే పార్టీలు పెట్టిన మహానుభావులు కూడా వున్నారు. ఇంకా పెరుగుతున్నారు కూడా! ఏదో ఒక చిన్నా చితక పొలిటికల్ పార్టీ పెట్టేయటం, దాని ద్వారా వచ్చే ఆదాయ పన్ను మినహాయింపులు వాడుకోవటం, తమ బ్లాక్ మనీని వైట్ గా మార్చేసుకోటం చేస్తున్నారు. కాని, ఎన్నికల కమీషన్ తాజా సిఫారసుల ప్రకారం ఇలాంటి పప్పులు ఉడకవు. పార్టీ ఏదైనా సరే గెలిస్తేనే ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని ఈసీ అంటోంది. అంటే నిజంగా జనం మద్దతు పొందితే తప్ప మినహాయింపులు దక్కవన్న మాట. అంతే కాదు, పార్టీలు విరాళాల కోసం అచ్చేసి వదిలే కూపన్ల గురించి కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ కోరింది. లెక్కా, పత్రం లేకుండా పార్టీలు అమ్ముకునే 10, 20 రూపాయల విలువ గల కూపన్ల గురించి తప్పకుండా పార్టీలు వివరాలు చెప్పేలా నిబంధనలు చేయాలని గవర్నమెంట్ ను కోరింది!
ఎలక్షన్ కమీషన్ కోరిన అన్ని చర్యల్ని మోదీ సర్కార్ తీసుకోవాలన్నరూలేం లేదు. కాని, ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వానికి తెలియకుండా కేంద్ర ఎన్నికల కమీష్ ఈ సిఫారసులు చేస్తుందా? అస్సలు అవకాశం లేదు. అంటే నల్లధనం పై యుద్ధం ప్రకటించిన మోదీ ఎన్నికల కమీషన్ ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా ఈ సూచనలు చేయించారని భావించాలి. ముందు ముందు ఈ మార్పులన్నీ కఠినంగా అమల్లోకి వస్తే మాత్రమే ఎన్నికల ప్రక్రియలో భారీ ప్రక్షాళనే జరిగే అవకాశం వుంది. ఎన్నికల్లో డబ్బుల ప్రమేయం ఎంత తగ్గితే అంతగా నిజాయితీ పరులు గెలిచే అవకాశం వుంటుంది. ఈసీ సలహా్ల్ని, సూచనల్ని మోదీ సర్కార్ చిత్త శుద్దితో అమలు చేయాలని మనమూ కోరుకుందాం...