50రోజుల కరెన్సీ తుఫాను...
posted on Dec 28, 2016 @ 2:43PM
నవంబర్ 8 - డిసెంబర్ 28... ఈ మధ్య కాలంలో గడిచిపోయిన రోజులు ఎన్ని? యాబై రోజులు! మామూలుగా అయితే ఈ ఫిఫ్టీ డేస్ కి నో ఇంపార్టెన్స్. కాని, మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయం వల్ల గత యాభై రోజులు యాభై యుగాలుగా గడిచాయి. జనం రోడ్లపైకి వచ్చేస్తే ... ప్రతి పక్షాలు రోడ్లపైకి రాలేక, లోపల వుండలేక ఇబ్బంది పడ్డాయి. ఇంకా పడుతూనే వున్నాయి. మరో వైపు ఇంచుమించూ మూడేళ్లు పూర్తి కావస్తోన్న మోదీ పాలనలో తొలిసారి ప్రధాని జనం మూడ్ ని బలంగా దెబ్బ తీశారు! ఇప్పటికీ మోదీ పట్ల జనం నమ్మకంతోనే వున్నా చాలా మందికి ఆయన పట్ల వ్యతిరేకత మొదలైంది. ఇది చెప్పక తప్పుకోని సత్యం...
నవంబర్ 8న నోట్ల రద్దు చేసిన మోదీ రెండు రోజుల్లో అంతా నార్మల్ అయిపోతుందని చెప్పుకొచ్చారు. 48గంటల్లో 2వేల నోట్లు మార్కెట్లో కళకళలాడతాయని భావించారు. బహుశా ఆయనకి సలహా ఇచ్చిన అధికారులు కూడా అలాగే చెప్పి వుంటారు. కాని, మోదీకి తెలిసో లేదో కాని భారీ ఆర్దిక తుఫానే చెలరేగింది నోట్ బ్యాన్ తో! కోట్లాది జనం ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు పడిగాపులు పడ్డారు. ఇప్పటికీ పరిస్థితి ఏం సంతోషకరంగా లేకున్నా మొదటి పది , ఇరవై రోజుల కన్నా చాలా నయం. అంతే తప్ప 50 రోజుల్లో ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతం కాలేదు. కాని, మోదీ డీమానిటైజేషన్ తరువాత తన సభల్లో జనాన్ని 50రోజులు ఓపిక పట్టమన్నారు. అందరూ నోట్ల కటకటని సహించారు కూడా. కాని, తీరా ఇప్పుడు చూస్తే ఒరిగింది ఏం లేదన్నట్టు వుంది పరిస్థితి!
మోదీ చెప్పిన మొదటి 50రోజులు కాదు మరో 50రోజులు కూడా ఒత్తిడి తగ్గేలా లేదు. బ్లాక్ మనీ, ఉగ్రవాద కార్యకలాపాల నోరోధం, ఎన్జీవోల అక్రమ దందా, దొంగ నోట్ల కట్టడి, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ... ఇవన్నీ విపరీతంగా చర్చింపబడ్డాయి. కాని, వీటితో దేనితోనూ సంబంధం లేని అతి సామన్య ప్రజలు మాత్రం కరెన్సీ కటకటతో అల్లాడిపోయారు. ఇంకా కూడా తేరుకోలేకపోతున్నారు. అయితే, తాము పడుతున్న ఇబ్బందులకి జనం మోదీని బాధ్యుడ్ని చేయకపోవటమే ఇక్కడ ఆశ్చర్యం. రోడ్డ మీదకొచ్చి వీరంగం వేసిన రాహుల్, మమత, అరవింద్ కేజ్రీవాల్ వెంట జనం నిలవాల్సినంతగా నిలవలేదు. తమ అవస్థలకి కారణమైన మోదీ వెంటే వారు వున్నారు. ఇందుకు కారణం, బ్లాక్ మనీ భూతం తరిమేస్తాడనే ఆశే. ఉగ్రవాదం, మత మార్పిళ్లు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు అన్నీ ఆగిపోతాయన్న భరోసానే. ఇవాళ్ల మనం కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా తరువాతి తరం చక్కగా బతుకుతారని భావించటమే.
మోదీ చేసిన నోట్ల రద్దు ఎవ్వరూ ఊహించని పరిణామం. ప్రజలు కూడా అందుకే షాకవుతూనే మద్దతిచ్చారు. కాని, ఈ యాభై రోజుల్లో డీమానిటైజేషన్ ఫలాలేవీ ప్రజలకి నేరుగా అందలేదు. శేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ బయటపడ్డాయి. కాని, ఐటీ దాడులు ఇప్పటికిప్పుడు సామాన్యులకి ఉపయోగపడేవి కావు. అందుకే, మోదీ తాను అభ్యర్థించిన 50రోజులు పూర్తయ్యాయి కాబట్టి ఇక మీదట కామన్ పీపుల్ చిల్లర కష్టాలు అస్సలు లేకుండా చేయటంపై దృష్టి పెట్టాలి. ధరలు తగ్గిస్తూ, బ్యాంక్ లోన్లు అందిస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ నిజమైన అచ్చే దిన్ వచ్చేలాగా చూడాలి. అప్పుడే ప్రధాని తీసుకున్న రిస్క్ , జనం భరించిన బాధలు అన్నీ ఫలవంతం అవుతాయి...