ఆఫ్టర్ నజీబ్ జంగ్... మోదీ, కేజ్రీ మధ్య నయా జంగ్?
posted on Dec 23, 2016 @ 2:23PM
మేయర్ స్థాయిలో పవర్స్ వుండే సీఎం... అయినా నేరుగా పీఎంతో పోరుకి దిగే... విచిత్రమైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్! దేశంలోని అన్ని నగరాల కంటే పెద్దది కేజ్రీవాల్ పాలనలోని ఢిల్లీ! అందుకే దాన్ని కేంద్రపాలిత ప్రాంతం, ఆ తరువాత రాష్ట్రం చేశారు. కాని, పేరుకి ఒక ముఖ్యమంత్రి వున్నా హస్తినాపురం పూర్తి స్థాయి రాజ్యం కాదు. కేవలం రాజధాని మాత్రమే. కీలకమైన పవర్స్ అన్నీ కేంద్రం ఆధీనంలో పని చేసే లెఫ్టనెంట్ గవర్నర్ దగ్గరే వుంటాయి. అదే అరవింద్ కేజ్రీవాల్ కి ఆది నుంచీ పరమ చిరాగ్గా అనిపిస్తూ వస్తోంది!
కేజ్రీవాల్, మోదీల మధ్య వార్ కొత్తదేం కాదు. ఇప్పటి వరకూ ఏకే మోదీని తిట్టకుండా గడిపిన రోజంటూ లేదు. ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడో ఎంత లాజిక్ ఉపయోగించినా అర్థం కాదు. ఎందుకంటే, పెద్ద పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోదీతో అవసరమైతేనే యుద్ధానికి దిగుతారు. మిగతా సమయాల్లో సర్దుకుపోతారు. కాని, భారతదేశంలోని ఒకానొక నగరానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ మేయర్ లాంటి సీఎం అయిన కేజ్రీవాల్ తన స్థాయికి, సత్తాకి మించి ప్రధానిని ఢీకొంటూ వుంటాడు. తాజాగా లెఫ్టనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అనూహ్య రాజీనామా తరువాత మోదీ, కేజ్రీ జంగ్ సరికొత్త మలుపు తిరగనుంది!
డిల్లీ ఎల్జీ నజీబ్ జంగ్ రాజీనామా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కేజ్రీవాల్ కూడా అవాక్కైనట్టే కనిపిస్తోంది. నిజానికి అరవింద్ తాను సీఎం అయినప్పటి నుంచీ జంగ్ తో జగడాలు పెట్టుకుంటూనే వచ్చాడు. అయినా ఆయన హఠాత్తుగా రెసిగ్నేషన్ ఇచ్చేసరికి షాకయ్యాడు. ఆయన స్టేట్మెంట్లో కూడా ఆశ్చర్యంగా వుందనే చెప్పుకొచ్చాడు. ఈ ఆశ్చర్యానికి కారణం మోదీ మనిషిగా వుంటూ వచ్చిన నజీబ్ జంగ్ అమాంతం పదవి నుంచి తొలగటం ఎందుకు అన్న ప్రశ్నే! కమలదళం ఆల్రెడీ ఎల్జీని చక్కగా ఉపయోగించుకుని అరవింద్ ని అష్టకష్టాలు పెడుతూనే వుంది. ఎల్జీ కంట్రోల్ లోని ఢిల్లీ పోలీస్ కేజ్రీవాల్ క్యాబినేట్ లోని సగం మంది మంత్రుల్ని, అసెంబ్లీలోని సగం మంది ఆప్ ఎమ్మేల్యేల్నీ కేసుల్లో ఇరికించింది. ఇందులో అన్నీ నిజమైన కేసులు కాకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీని దీర్థకాలంలో దెబ్బ తీసేవి చాలానే వున్నాయి...
మోదీ సర్కార్, ఆప్ సర్కార్ ల మధ్య అగ్గికి బోలెడంత ఆజ్యం పోసిన జంగ్ వున్నట్టుండీ రాజీనామా మాట మాట్లాడటం నమో కొత్త స్కెచ్ పై అందరి దృష్టి పడేలా చేసింది. ఈ మధ్య జరిగిన నోట్ల రద్దు విషయంలో ఏ సీఎం చేయనంత సీన్ క్రియేట్ చేశాడు కేజ్రీవాల్. మమతతో కలిసి మండిపోయాడు. ఇక అంతకు ముందు జరుగుతూ వచ్చిన రచ్చ కూడా మనకు తెలిసిందే. అందుకే, ఇప్పుడు కొత్త లెఫ్టనెంట్ గవర్నర్ ఎవరు వస్తారని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆప్ వర్గాల్లో అయితే ఆందోళన కలిగి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. త్వరలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపి గెలిస్తే తాము తెచ్చి పెట్టుకున్న కొత్త ఎల్జీతో చక్రం తిప్పే మార్గాలు బోలెడు తెరుచుకుంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం తమ వశమైతే అతి చిన్న రాష్ట్రం ఢిల్లీలో ఎలాంటి రాజకీయం చేసిన వ్యతిరేకత ఎదురయ్యే ఛాన్స్ వుండదు. ఇప్పుడు అరవింద్ ఆందోళనకు ఇదే పెద్ద కారణం...